బాలీవుడ్‌ అందాల రాకుమారుడు దిలీప్‌ కుమార్‌ మృతి

అలనాటి బాలీవుడ్‌ అందాల రాకుమారుడు, ప్రముఖ నటుడు దిలీప్‌ కుమార్‌ (98) ఇకలేరు. ముంబయిలోని హిందూజా ఆసుపత్రిలో చికిత్స పొందుతూ బుధవారం ఉదయం 7.30 గంటలకు  తుది శ్వాస విడిచారు. గత బుధవారం ఆసుపత్రిలో చేరిన ఆయన.. వారంలో మృత్యు ఒడికి చేరుకున్నారు. గతేడాది దిలీప్‌ కుమార్‌ సోదరులు అస్లాంఖాన్‌, ఇషాన్ ఖాన్‌లు కరోనాతో ప్రాణాలు విడిచారు. 
 
గత కొన్ని సంవత్సరాలుగా వయో సంబంధిత సమస్యలతో బాధపడుతన్నారు. ఒకే నెలలో ఆయన ఆసుప్రతికి వెళ్లడం ఇది రెండవసారి. జూన్‌ 6న అనారోగ్య సమస్యలతో ఆసుపత్రులు చేర్చగా.. ఆక్సిజన్‌ సపోర్ట్‌తో చికిత్స అందించడంతో కోలుకున్నారు. ఆయన మరణంతో బాలీవుడ్‌ ఇండ్రస్టీ దిగ్భ్రాంతికి గురైంది.

దిలీప్‌ కుమార్‌ 1922 డిసెంబర్‌ 11న పాకిస్తాన్‌లోని పెషావర్‌లో జన్మించారు. ఆయన అసలు పేరు మహమ్మద్‌ యూసుఫ్‌ ఖాన్‌. బాంబే టాకీస్‌ యజమాని ఈయనకు దిలీప్‌ కుమార్‌ అని నామకరణం చేశాడు. సినిమాల్లోకి రాకముందు దిలీప్‌ తండ్రితో కలిసి పండ్లు అమ్మారు. 1950 నుండి బాలీవుడ్‌ ఇండ్రస్టీలో తనదైన ముద్ర వేసుకున్నారు. మొఘల్‌ ఎ అజమ్‌, దేవదాస్‌, నయా దర్‌, గంగా జమున, రామ్‌ ఔర్‌ శ్యామ్‌ వంటి చిత్రాల్లో నటించారు. 1998లో వచ్చిన కిల్లా ఆయన నటించిన చివరి చిత్రం. 1966లో సహ నటి సైరా భానును వివాహం చేసుకున్నారు. 
 
కాగా, వీరికి పిల్లలు లేరు. పలు చిత్రాలకు ఆయన జాతీయ పురస్కారాలు అందుకున్నారు. చిత్ర పరిశ్రమకు చేసిన కృషికి గానూ 1991లో ఆయన్ను పద్మ భూషణ్‌ అవార్డు వరించింది. 2000 – 2006 వరకు రాజ్యసభ సభ్యుడిగానూ దిలీప్‌ కుమార్‌ సేవలందించారు. దాదా సాహెబ్‌ ఫాల్కే అవార్డుతో పాటు పాకిస్తాన్‌ అత్యంత ప్రతిష్టాత్మక పౌర పురస్కారం కూడా వరించింది.  ఆయన మృతికి పలువురు సంతాపం తెలుపుతున్నారు.
దిలీప్ కుమార్ మృతి పట్ల రాష్ట్రపతి రామ్‌నాథ్ తన సంతాపం ప్రకటించారు. దిలీప్ కుమార్ దేశంలోని ప్రతి ఒక్కరిలో జీవిస్తారని రాష్ట్రపతి తెలిపారు.   ‘దిలీప్ కుమార్ భారతదేశ చరిత్రలో మిగిలిపోతారు. ఆయన కీర్తి సరిహద్దులను దాటింది. ఆయన మరణంతో ఒక శకం ముగుస్తుంది. దిలీప్ సాబ్ దేశంలోని ప్రతి ఒక్కరిలో శాశ్వతంగా జీవిస్తారు. ఆయన కుటుంబానికి మరియు అభిమానులకు నా సంతాపం’ అని రాష్ట్రపతి రామ్‌నాథ్ కోవింద్ ట్వీట్ చేశారు.
 
దిలీప్ కుమార్ మృతి పట్ల ప్రధాని నరేంద్ర మోదీ సంతాపం తెలుపుతూ  సినిమాటిక్ లెజెండ్‌గా ఆయన ప్రతి ఒక్కరికీ గుర్తుండిపోతారని ట్వీట్ చేశారు. దిలీప్ కుమార్ మృతి సాంస్కృతిక ప్రపంచానికి తీరని లోటని ఆయన పేర్కొన్నారు. అసమాన తేజస్సు దిలీప్‌ కుమార్‌ సొంతమని, దీంతో తరతరాలుగా ప్రేక్షకులు ఆయనను చూసి మంత్రముగ్ధులవుతున్నారని తన ట్వీట్ లో తెలిపారు.
 
భారతీయ సినిమాకు దిలీప్ చేసిన సేవలు మరువలేనివని కాంగ్రెస్ నేత  రాహుల్ గాంధీ చెప్పారు. భవిష్యత్ తరాలు దిలీప్ కుమార్‌ను గుర్తుంచుకుంటాయని ఆయన తెలిపారు
 
 
.