మమతకు హైకోర్టు రూ 5 లక్షలు జరిమానా

పశ్చిమ బెంగాల్ రాష్ట్ర ముఖ్యమంత్రి మమతా బెనర్జీకి కోల్ కతా హైకోర్టు షాక్ ఇచ్చింది. బీజేపీతో న్యాయమూర్తి జస్టిస్ కౌశిక్ చందాకు సంబంధాలున్నాయని ఆరోపించినందుకుగాను మమతాబెనర్జీకి హైకోర్టు రూ.5 లక్షల జరిమానా విధించింది.

మమతాబెనర్జీ న్యాయవ్యవస్థను చెడుగా చిత్రీకరించినందుకు జరిమానా విధిస్తున్నట్లు హైకోర్టు పేర్కొంది.మమతా బెనర్జీ దరఖాస్తును జస్టిస్ చందా తిరస్కరించారు. తాను వ్యక్తిగత అభీష్టానుసారం కేసు నుంచి వైదొలగాలని నిర్ణయించుకున్నానని చెపుతూ కేసును తన బెంచ్ నుంచి విడుదల చేశారు. 

“ఈ కేసు విచారణకు నాకు వ్యక్తిగతంగా ఎటువంటి అభ్యంతరం లేదు. అదే సమయంలో నాకు ఎటువంటి  ఆసక్తి కూడా లేదు.ప్రధాన న్యాయమూర్తి కేటాయించిన కేసు విచారించడం నా రాజ్యాంగబద్ధ విధి. ఏది ఏమైనా నేను ఈ కేసు నుండి వైదొలగాలని నిర్ణయించుకున్నాను” అని ఈ సందర్భంగా జస్టిస్ చందా పేర్కొన్నారు. 

సమస్యలు సృష్టించేవారు కేసు నుండి బయటపడటం కోసం వివాదాలు సృష్టిస్తూనే ఉంటారని చెబుతూ తనను శాశ్వత జడ్జిగా నియమించడానికి మమతా అభ్యంతరం చెప్పడానికి, ఆమె దాఖలు చేసిన పిటిషన్ కు సంబంధం లేదని స్పష్టం చేశారు.
 
 “ఒక జడ్జి నియామకం పట్ల తమ సమ్మతి లేదా అసమ్మతిని కారణంగా చూపు పిటిషన్ దాఖలు చేసినవారు దాని ఆధారంగా ఉపశమనం కోరలేరు. ఒక జడ్జి ఎప్పుడుపిటిషన్ దారుని వ్యక్తిగత చర్యను బట్టి తన తీర్పులో పక్షపాతంగా వ్యవహరింపలేరు” అని కూడా న్యాయమూర్తి ఘాటైన పదజాలం వాడారు. 

నందిగ్రామ్ ఎన్నికల్లో బీజేపీ అభ్యర్థి సువేందు అధికారి చేతిలో స్వల్ప ఓట్ల తేడాతో్ ఓటమి పాలైన మమతాబెనర్జీ…ఎన్నికల్లో, ఓట్ల లెక్కింపులోనూ అక్రమాలు జరిగాయని, కావున సువేందు ఎన్నికను రద్దు చేయాలని కోరుతూ కోల్ కతా హైకోర్టులో పిటిషన్ వేశారు. ఈ పిటిషన్ ను జస్టిస్ కౌశిక్ చందా విచారణ చేపట్టారు.

ఈ పిటిషన్ ప్రజా ప్రాతినిధ్యం చట్టం-1951కి అనుగుణంగా వేశారా లేదా అనే విషయమై ఓ నివేదిక ఇవ్వాలని హైకోర్టు రిజిస్ట్రార్ కు జడ్జి కౌశిక్ ఆదేశాలు కోరారు.ఈ క్రమంలోనే మమతా దీనిపై అభ్యంతరం వ్యక్తం చేశారు. వెంటనే ఆ జడ్జిని తన కేసు విచారించకుండా చూడాలని.. ఆయనకు బీజేపీ నేపథ్యం ఉందని చీఫ్ జస్టిస్ కార్యదర్శికి ఫిర్యాదు చేశారు.