రూ.లక్ష కోట్ల దిగువకు జిఎస్‌టి వసూళ్లు

ప్రభుత్వ జిఎస్‌టి (వస్తు, సేవల పన్ను) వసూళ్లు 8 నెలల తర్వాత తొలిసారిగా రూ.లక్ష కోట్ల మార్క్ దిగువకు పడిపోయాయి. కరోనా సెకండ్ వేవ్ కారణంగా గత నెలలో జిఎస్‌టి ఆదాయం క్షీణించింది. జూన్‌లో రూ.92,849 కోట్ల జిఎస్‌టి వసూళ్లు మాత్రమే వచ్చాయి. 

వీటిలో కేంద్ర జిఎస్‌టి వసూళ్లు రూ.16,424 కోట్లు, రాష్ట్ర జిఎస్‌టి రూ.20,397 కోట్లు, ఉమ్మడి జిఎస్‌టి వసూళ్లు రూ.49,079 కోట్లు ఉన్నాయి. ఈ ఉమ్మడి జిఎస్‌టిలో వస్తువుల దిగుమతులపై వచ్చిన రూ.25,762 కోట్లు పన్ను ఉంది. ఇక మొత్తం సెస్ పన్ను రూ.6,949 కోట్లు వచ్చింది. 

అంతకుముందు నెలతో పోలిస్తే జిఎస్‌టి వసూళ్లు తగ్గినా, గతేడాది (2020)తో పోలిస్తే 2 శాతం ఎక్కువగానే ఉన్నాయి. జిఎస్‌టి సేకరణ డేటా జూన్ 5 నుంచి జూలై 5 మధ్య ఉంటుంది. ఈ సమయంలో ఐటిఆర్ ఫైలింగ్ గడువును 15 రోజుల పొడిగించడంతో పాటు అనేక పన్ను సంబంధిత రాయితీలను ప్రభుత్వం పన్ను చెల్లింపుదారులకు ఇచ్చింది.

ఆర్థిక మంత్రిత్వ శాఖ ప్రకారం, జూన్ నెలలో జిఎస్‌టి వసూళ్లు మే నెలలో జరిగే వ్యాపార లావాదేవీలకు సంబంధించినవి ఉంటాయి. ఈ సమయంలో చాలా రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాలలో పూర్తి లేదా పాక్షిక లాక్‌డౌన్ ఉంది. దీంతో మే నెలలో ఇ-వే బిల్ జనరేషన్ సంఖ్య 30 శాతం తగ్గింది.

అంటే మే నెలలో 3.99 కోట్ల ఇ-వే బిల్లులు ఉత్పత్తి చేయగా, అంతకుముందు ఏప్రిల్‌లో ఇది 5.88 కోట్లు ఉంది. అయితే లాక్‌డౌన్ ఆంక్షలను ఎత్తివేయడంతో జూన్‌లో 5.5 కోట్ల ఇ-వే బిల్లులు వచ్చాయి. అంటే వాణిజ్యం, వ్యాపారం తిరిగి గాడిన పడుతోందనే విషయాన్ని ఇది చూపిస్తుంది.