ప్రపంచంలోనే అత్యంత వేగవంతమైన సూపర్‌సోనిక్ క్రూయిజ్ క్షిపణి ‘బ్రహ్మోస్’ ను వియత్నాంకు విక్రయించేందుకు ఒప్పందం కుదుర్చుకుంది. ఇదే తరహా ఒప్పందం ఇండోనేషియాతో కూడా తుది దశలో ఉందని భారత రక్షణ కార్యదర్శి రాజేష్ కుమార్ సింగ్ చెప్పారు. సింగపూర్‌లో జరిగిన ప్రతిష్ఠాత్మక షాంగ్రీ-లా డైలాగ్ భద్రతా సదస్సులో ఆయన ఈ కీలక ప్రకటన చేశారు.“వియత్నాంతో బ్రహ్మోస్ ఒప్పందం ఇప్పటికే పూర్తయింది.
బహుశా బహిరంగంగా ప్రకటించనప్పటికీ ఒప్పందంపై సంతకాలు జరిగాయి. ఇండోనేషియాతో చర్చలు కూడా తుది దశకు చేరుకున్నాయి. త్వరలోనే ఒప్పందం ఖరారు కావచ్చు” అని రాజేష్ కుమార్ సింగ్ వెల్లడించారు. వియత్నాంతో కుదిరిన ఒప్పందం విలువ సుమారు రూ.5,800 కోట్లు ఉన్నట్లు తెలిసింది. ఇందులో భాగంగా తీరప్రాంత రక్షణ క్షిపణి వ్యవస్థలు, తొలి విడత క్షిపణులు, శిక్షణ, ఇతర సాంకేతిక సహకారం అందించనున్నారు.
భవిష్యత్తులో వియత్నాం గగనతలం నుంచి ప్రయోగించే బ్రహ్మోస్ క్షిపణులను కూడా కొనుగోలు చేసే అవకాశం ఉంది. ఇప్పటికే 2022లో ఫిలిప్పీన్స్ సుమారు 375 మిలియన్ డాలర్ల విలువైన ఒప్పందంతో బ్రహ్మోస్ క్షిపణులను కొనుగోలు చేసింది. దాంతో భారత్ నుంచి బ్రహ్మోస్ క్షిపణులను కొనుగోలు చేసిన తొలి విదేశంగా ఫిలిప్పైన్స్ నిలిచింది. ఇప్పుడు వియత్నాం, త్వరలో ఇండోనేషియా కూడా ఈ జాబితాలో చేరనున్నాయి.
దక్షిణ చైనా సముద్రంలో చైనాతో తీవ్రమైన ప్రాదేశిక వివాదాలు ఎదుర్కొంటున్న వియత్నాం, ఇండోనేషియా, ఫిలిప్పీన్స్ వంటి దేశాలు తమ రక్షణ సామర్థ్యాన్ని పెంచుకుంటున్న తరుణంలో ఈ ఒప్పందాలు ప్రాధాన్యం సంతరించుకున్నాయి. ధ్వని కన్నా మూడు రెట్ల వేగంతో (మాక్ 3) ప్రయాణించే బ్రహ్మోస్ క్షిపణిని భూమి, గాలి, సముద్రం నుంచి ప్రయోగించవచ్చు.
దీని వేగం, కచ్చితత్వం కారణంగా శత్రువుల యుద్ధ నౌకలను, కీలక సైనిక స్థావరాలను వేగంగా ఛేదించగలదు. 2020 గల్వాన్ ఘర్షణల తర్వాత చైనాతో సంబంధాలు ఉద్రిక్తంగా ఉన్న నేపథ్యంలో ఈ ప్రాంతంలో తన వ్యూహాత్మక ప్రభావాన్ని పెంచుకోవాలని భారత్ భావిస్తోంది. రక్షణ ఎగుమతులను 2030 నాటికి రూ.50,000 కోట్లకు చేర్చాలనే లక్ష్యంతో ముందుకు సాగుతోంది. మలేషియా, థాయ్‌లాండ్ వంటి ఇతర ఆగ్నేయాసియా దేశాలు కూడా బ్రహ్మోస్ కొనుగోలుపై ఆసక్తి చూపుతున్నట్లు తెలుస్తోంది.

More Stories
మరోసారి పెరిగిన కాంప్లెక్స్ ఎరువుల ధరలు
డిజిటల్ ప్రకటనల్లో ఉల్లంఘనలు 21 శాతం పెరుగుదల
కరిగిపోతున్న విదేశీ మారక ద్రవ్య నిల్వలు