భారత్‌ ప్రయాణికులపై జర్మనీ నిషేధం ఎత్తివేత

భారత్‌లో కరోనా కేసులు తగ్గుముఖం పడుతున్న నేపథ్యంలో జర్మనీ కీలక నిర్ణయం తీసుకున్నది. కొవిడ్‌ సెకండ్‌ వేవ్‌ నేపథ్యంలో భారత్‌ ప్రయాణికులపై నిషేధం విధించిన విషయం తెలిసిందే. ప్రస్తుతం మహమ్మారి తగ్గుముఖం పడుతున్న క్రమంలో నిషేధాన్ని ఎత్తివేస్తామని జర్మనీ ఆరోగ్య సంస్థ  ప్రకటించింది. 

భారత్‌ సహా నేపాల్‌, రష్యా, పోర్చుగల్‌, యూకేను ‘హై ఇన్సిడెంట్‌ ఏరియాలు’గా పునర్వర్గీకరించనున్నట్లు రాబర్ట్‌ కోచ్‌ ఇన్‌స్టిట్యూట్‌ (ఆర్‌కేఐ)  తెలిపింది. ఈ మార్పుతో జర్మన్‌ నివాసితులు, పౌరులు కాని ప్రయాణికుల ప్రవేశంపై నిషేధాన్ని తగ్గిస్తుందని, బదులుగా ఎవరైనా క్వారంటైన్‌, టెస్టింగ్‌ నియమాలను పాటించేంత వరకు అనుమతి ఉంటుందని పేర్కొంది.

సొంత గడ్డపై కొత్త కరోనా వేరియెంట్లను అడ్డుకునే ప్రయత్నంలో జర్మనీ ‘వైరస్‌ వేరియంట్‌ కంట్రీ’ ట్రావెల్‌ కేటగిరిని ప్రవేశపెట్టింది. గతవారం ఆరోగ్యశాఖ మంత్రి జెన్స్‌ స్పాన్‌ మాట్లాడుతూ డెల్టా వేరియంట్‌తో దెబ్బతిన్న దేశాల నుంచి చాలా మంది ప్రయాణికులపై నిషేధం ఎత్తివేసే అవకాశం ఉన్నదని పేర్కొన్నారు. 

వైరస్‌కు వ్యతిరేకంగా టీకాలు ప్రభావవంతంగా ఉన్నాయని వచ్చిన పరిశోధనల ప్రకారం.. ‘రాబోయే కొద్ది రోజుల్లో పరిస్థితిని పరిశీలిస్తామని పేర్కొన్నారు. ఇదిలా ఉండగా.. ప్రస్తుతం జర్మనీలో డెల్టా వేరియంట్‌ ప్రభావం ఉన్నా ఇటీవల కరోనా కేసులు తగ్గుముఖం పడుతున్నాయి. గత 24 గంటల్లో 212 కొత్త కేసులు నమోదయ్యాయి.