అధికారిక నివాసంలోనే హైతీ దేశ అధ్య‌క్షుడి హత్య

సామాజిక, ఆర్థిక, రాజకీయ సంక్షోభంలో కొట్టుమిట్టాడుతున్న పేద కరీబియన్‌ దేశం హైతీలో అతి పెద్ద దారుణం చోటుచేసుకుంది. సాక్షాత్తూ ఆ దేశ అధ్యక్షుడే హత్యకు గురయ్యారు. హైతీ అధ్య‌క్షుడు జోవెనెల్ మొయిజ్‌ను త‌న అధికారిక నివాసం నిద్రిస్తుండగా మంగళవారం రాత్రి కొందరు గుర్తు తెలియ‌ని వ్య‌క్తులు హ‌త్య‌ చేశారు. 

ఆయుధాల‌తో వ‌చ్చిన కొంద‌రు మొయిజ్‌ను కాల్చి చంపిన‌ట్లు తాత్కాలిక ప్ర‌ధాని క్లాడ్ జోసెఫ్ తెలిపారు. అధ్య‌క్షుడు మ‌ర‌ణించిన నేప‌థ్యంలో తానే దేశానికి ఇంచార్జీగా మారిన‌ట్లు ఆయ‌న వెల్ల‌డించారు. ఈ హత్యా విద్వేషంతో కూడుకున్నదని, దుర్మార్గమైనదని, అమానుషమైనదని ఆయన తీవ్రంగా ఖండించారు. 

 గాయ‌ప‌డ్డ అధ్య‌క్షుడు మొయిజ్ భార్య ప్ర‌స్తుతం హాస్పిట‌ల్‌లో చికిత్స పొందుతున్నారు. ప్ర‌జ‌లంతా సంయ‌మ‌నంతో ఉండాల‌ని జోసెఫ్ అభ్య‌ర్థించారు. పోలీసులు, ఆర్మీ ప్ర‌జ‌ల భ‌ద్ర‌త చూసుకుంటుంద‌ని భరోసా ఇచ్చారు. 

నాలుగున్నర కోట్ల జనాభా కలిగిన ఈ కరీబియన్‌ దేశం 216 ఏళ్ల క్రితం వరకు ఫ్రెంచ్‌ వలసపాలన నుంచి విముక్తి సాధించినప్పటికీ పాలకులు అనుసరించిన ముదనష్టపు విధానాల వల్ల 60 శాతం జనాభా ఇప్పటికీ కడు పేదరికంలో మగ్గుతున్నారు. రాజకీయ అస్థిరత, అశాంతికి నిలయంగా మారిన హైతీలో చమురు ధరల పెంపుపై 2018లో దేశవ్యాపితంగా పెద్దయెత్తున ప్రజలు పెద్దయెత్తున ఉద్యమించారు. 

 2018లోనే మోయిజ్‌ అధ్యక్ష పదవీ కాలం ముగిసినప్పటికీ డిక్రీల ద్వారా ఆయన పాలనసాగిస్తూ వస్తున్నారు. ఎన్నికలు జరపడం లేదు.  బుధవారం ఉదయం దేశ  రాజధానిలో వీధులన్నీ దాదాపు నిర్మానుష్యంగా ఉండగా, ఒక ప్రాంతంలో మాత్రం కొందరు వ్యక్తులు వ్యాపార సంస్థల వద్ద విధ్వంసం సృష్టించడం జరిగింది.