ట్రంప్ సైనిక చర్యల అధికారాలకు సెనేట్ కళ్లెం

ట్రంప్ సైనిక చర్యల అధికారాలకు సెనేట్ కళ్లెం
ఇరాన్‌పై దాడులకు దిగిన అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్‌పై సొంతపార్టీలో రగులుతున్న అసంతృప్తి తొలిసారిగా సెనేట్‌లో పెల్లుబికింది. ట్రంప్ చేపట్టే సైనిక చర్యల అధికారాలను పరిమితం చేసే కీలక తీర్మానాన్ని అమెరికా సెనేట్ ఆమోదించింది. ఏడుసార్లు విఫలమైన తర్వాత ఎనిమిదో ప్రయత్నంలో ఈ తీర్మానం ఆమోదం పొందింది. సెనేట్‌లో జరిగిన ఓటింగ్‌లో తీర్మానానికి 50-47 ఓట్లతో మద్దతు లభించింది. 
 
డెమొక్రాట్లకు మద్దతుగా నలుగురు రిపబ్లికన్ సెనేటర్లు కూడా ఓటు వేశారు. దీంతో కాంగ్రెస్ అనుమతి లేకుండా ఇరాన్‌పై సైనిక దాడి చేసేందుకు ట్రంప్‌నకు అవకాశం లేకుండా పోయింది. దీనిని డెమొక్రాటిక్ సెనేటర్ టిమ్ కెయిన్ ప్రవేశపెట్టారు. అందులో కాంగ్రెస్ అధికారికంగా యుద్ధ ప్రకటన చేయకుండా లేదా ప్రత్యేక అనుమతి ఇవ్వకుండా అమెరికా సైన్యాన్ని ఇరాన్‌పై యుద్ధ చర్యల్లో కొనసాగించరాదని పేర్కొన్నారు. 
 
అయితే ఈ బిల్లు ఆమోదానికి సంబంధించి త్వరలో తుది ఓటింగ్‌ జరగనుంది. ఇది చట్టంగా మారితే, కాంగ్రెస్‌ అధికారికంగా సైనిక దాడి కొనసాగించడానికి అనుమతి ఇచ్చేవరకు ట్రంప్‌ ఇరాన్‌పై ఎలాంటి దాడులకు దిగకూడదు. మరోవైపు ఇరాన్‌తో కొనసాగుతున్న ఉద్రిక్తతలు త్వరలోనే ముగుస్తాయని అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ తెలిపారు. 
ఇరాన్ ఒప్పందం చేసుకోవడానికి ఆసక్తి చూపుతోందని పేర్కొన్నారు. అదే సమయంలో అంతర్జాతీయ మార్కెట్లో చమురు ధరలు భారీగా పడిపోతాయని అంచనా వేశారు.
ఇరాన్‌పై అమెరికా ప్రణాళికాబద్ధ సైనిక దాడిని తాత్కాలికంగా నిలిపివేసినట్లు ట్రంప్ ఇటీవల వెల్లడించారు.  గల్ఫ్​ దేశాల విజ్ఞప్తితోనే దాడిని వాయిదా వేసినట్లు తెలిపారు. ట్రంప్ తన ట్రూత్ సోషల్ పోస్టులో ఇరాన్‌తో ప్రస్తుతం కీలక చర్చలు కొనసాగుతున్నాయని చెప్పారు.  శాంతి ఒప్పందం కుదిరే అవకాశం ఉందని గల్ఫ్ దేశాల నాయకులు సూచించారని తెలిపారు. అందుకే ప్రణాళికాబద్ధ దాడిని నిలిపివేశామని పేర్కొన్నారు.
అయితే ఒప్పందం కుదరకపోతే ఎప్పుడైనా పూర్తి స్థాయి భారీ దాడికి అమెరికా సైన్యం సిద్ధంగా ఉంటుందని హెచ్చరించారు. అలాగే ఇరాన్‌కు అణ్వాయుధాలు ఉండకూడదు అన్నది అమెరికా ప్రధాన లక్ష్యమని స్పష్టం చేశారు. ముఖ్యంగా గతంలో ఇలాంటి తీర్మానాలను వ్యతిరేకించిన సెనేటర్ క్యాసిడీ ఈసారి మద్దతు తెలపడం అక్కడి రాజకీయ వర్గాల్లో చర్చకు దారి తీసింది.
ఇరాన్‌పై దాడుల విషయంలో అమెరికా ప్రభుత్వం చట్టసభలకు పూర్తి సమాచారం ఇవ్వకుండా అంధకారంలో ఉంచిందని క్యాసిడీ సోషల్ మీడియాలో వ్యాఖ్యానించారు. ట్రంప్ సొంత పార్టీలోనే చీలిక మొదలైందనేందుకు ఇది నిదర్శనమని కొందరు డెమోక్రటిక్ పార్టీ నేతలు కామెంట్ చేశారు.  లోడ్ చేసిన గన్నుతో ఆటలాడే చిన్నపిల్లాడిలా ట్రంప్ తీరు ఉందని సెనేట్ ఓటింగ్‌కు మునుపు డెమోక్రటిక్ పార్టీ సెనేటర్ చక్ షూమర్ వ్యాఖ్యానించారు.
అయితే, సెనేట్ ఆమోదించిన ఈ తీర్మానానికి రిపబ్లికన్‌ల మెజారిటీ ఉన్న ప్రతినిధుల సభలో తీవ్ర వ్యతిరేకత తప్పదని అక్కడి విశ్లేషకులు భావిస్తున్నారు. అయితే, అంతిమంగా ట్రంప్ ఈ తీర్మానాన్ని వీటో చేసే అవకాశం కూడా ఉందని అంటున్నారు.