బిజెపి కార్యకర్తల అరెస్ట్ పై మండిపడ్డ  దిలీప్ ఘోష్ 

కోల్‌కతా వ్యాక్సినేషన్ స్కామ్ ఆరోపణలపై ఆందోళనకు దిగిన సుమారు 50 మంది బీజేపీ కార్యకర్తలను పోలీసులు సోమవారంనాడు అరెస్టు చేయడంపై ఆ పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు దిలీప్ ఘోష్ మండిపడ్డారు. టీఎంసీ ప్రభుత్వం రాష్ట్రంలో శాంతిభద్రతలు ధ్వంసం చేసిందని, హింస తారాస్థాయికి చేరిందని, మనుషులను చంపుతూ, మహిళలపై అత్యాచారాలు చేస్తున్నారని ధ్వజమెత్తారు. 

మోదీ ప్రభుత్వం రాష్ట్రాలకు ఉచిత వ్యాక్సిన్ ఇస్తుంటే బెంగాల్ ప్రభుత్వం నకిలీ వ్యాక్సిన్లు ఇవ్వడమే కాకుండా, వ్యాక్సినేషన్‌కు ప్రజల నుంచి డబ్బులు వసూలు చేస్తోందని ఘోష్ ఆరోపించారు. ప్రభుత్వం పగ్గాలు చేపట్టి రెండు నెలలే అయినందున ప్రశాంతంగా ప్రభుత్వం పని చేయాలని తాము కోరుకున్నామని, అయితే గత రెండు నెలల్లోనే శాంతిభద్రతలు దారుణంగా దెబ్బతిని, హింస పరాకాష్టకు చేరుకుందని విమర్శించారు.

సుమారు 45 మంది చనిపోగా, మహిళలు అత్యాచారాలకు గురవుతున్నారని ఆరోపించారు. అన్నింటికంటే మించి వ్యాక్సిన్‌ను రాజకీయం చేస్తున్నారని,  ఏకంగా ఒక స్కామ్ నడుస్తోందని దయ్యబట్టారు. పట్టపగలే నకిలీ వ్యాక్సిన్లు ఇస్తున్నారని, ఆ కారణంగానే తాము రోడ్లపైకి రావాల్సి వచ్చిందని పేర్కొన్నారు.

మోదీ ప్రభుత్వం ఉచిత వ్యాక్సిన్లు పంపుతుంటే వాటిని అమ్ముకుంటున్నారని ఆరోపించారు. శాంతియుత ప్రదర్శన చేసేందుకు కార్యాలయం నుంచి కిలోమీటరు కూడా నడవకుండానే తమను ఆపేశారని, 50 మంది కార్యకర్తలను అరెస్టు చేశారని చెప్పారు.

నిరసన ప్రదర్శనకు అనుమతిపై అడిగినప్పుడు బీజేపీ కార్యకర్త ఒకరు స్పందిస్తూ, కార్పొరేషన్ (బిల్డింగ్) వరకూ నిరనస ప్రదర్శన చేయాలనుకున్నప్పటికీ అది కూడా చేయకుండా పోలీసులు తమను అరెస్టు చేశారని చెప్పారు.