రేపే కేంద్ర మంత్రివర్గం విస్తరణ!

ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ తన మంత్రివర్గాన్ని మంగళవారం విస్తరింపనున్నట్లు తెలుస్తున్నది. 2019 ఎన్నికలలో గెలుపొందిన తర్వాత రెండేళ్లకు పైగా మంత్రివర్గంలో ఎటువంటి మార్పులు చేయలేదు. కొద్దీ నెలల్లో కీలకమైన ఉత్తర ప్రదేశ్ తో పాటు ఐదు రాష్ట్ర అసెంబ్లీకి ఎన్నికలు జరుగనున్న దృష్ట్యా ఈ విస్తరణ ప్రాధాన్యత సంతరింప చేసుకున్నది. 

బుధ‌వారం మ‌ధ్యాహ్నం 11 గంట‌ల‌కు మోదీ 2.0 ప్ర‌భుత్వంలో తొలిసారి క్యాబినెట్ విస్త‌ర‌ణ కానున్న‌ది. ప్ర‌స్తుతం 28 మంత్రి ప‌ద‌వులు ఖాళీగా ఉన్నాయి. గరిష్టంగా 81 మంది మంత్రులు ఉండే అవకాశం ఉండగా ప్రస్తుతం 53 మాత్రమే ఉన్నారు.  17-22 మంది ఎంపీలు మంత్రులుగా ప్ర‌మాణ స్వీకారం చేయ‌వచ్చని తెలుస్తున్నది. 

మంత్రివర్గ విస్త‌ర‌ణ‌పై రెండు రోజులుగా కేంద్ర హోంమంత్రి అమిత్‌షా, బీజేపీ సంస్థాగ‌త ప్ర‌ధాన కార్య‌ద‌ర్శి బీఎల్ సంతోష్‌ల‌తో శని, ఆదివారాలలో పొద్దుపోయే వరకు సుదీర్ఘంగా చర్చలు జరిపారు. 

ముగ్గురు మాజీ ముఖ్యమంత్రులతో పాటు కీలక నేతలు పలువురు కేంద్ర మంత్రివర్గంలో చేరనున్నట్లు చెబుతున్నారు. ఉత్త‌రాఖండ్ మాజీ సీఎం తీర‌త్ సింగ్ రావ‌త్‌, అసోం మాజీ ముఖ్య‌మంత్రి శ‌ర్బానద సోనోవాల్‌, మ‌హారాష్ట్ర మాజీ సీఎం నారాయ‌ణ్ రాణెలతో పాటు బీహార్ మాజీ ఉపముఖ్యమంత్రి  సుశీల్ కుమార్ మోదీలకు మంత్రివర్గంలో స్థానం లభింపవచ్చని భావిస్తున్నారు. 

మాజీ కేంద్ర మంత్రి జ్యోతిరాదిత్య సింధియా (ఎంపీ), అనుప్రియా ప‌టేల్ (అప్నా దళ్ అధినేత, యుపి)లు కూడా చేరగలరని తెలుస్తున్నది.  లోక్ జ‌న‌శ‌క్తి పార్టీ (ఎల్జేపీ) ఎంపీ ప‌శుప‌తి కుమార్ ప‌రాస్‌, జేడీయూ నేత ఆర్సీపీ సింగ్‌లు మంత్రులుగా ప్ర‌మాణం చేయొచ్చని ఆశిస్తున్నారు. 

వీరితో పాటు పలు రాష్ట్రాల నుండి పలువురు బిజెపి ఎంపీల పేర్లు కూడా వినిపిస్తున్నాయి. కాగా, ప్రస్తుత మంత్రులలో ఇద్దరు, ముగ్గురికి ఉద్వాసన జరిగే అవకాశాలు కూడా ఉన్నట్లు భావిస్తున్నారు. ఎనిమిది మంది కేంద్ర మంత్రులకు ప్రస్తుతం నిర్వహిస్తున్న అదనపు మంత్రిత్వ శాఖల నుండి ఉపశమనం కలిగించే అవకాశం ఉంది.