టీఎంసీలో చేరిన అభిజిత్ ముఖ‌ర్జీ

ప‌శ్చిమ బెంగాల్‌లో కాంగ్రెస్ పార్టీకి గ‌ట్టి ఎదురుదెబ్బ త‌గిలింది. మాజీ రాష్ట్ర‌ప‌తి ప్ర‌ణ‌బ్ ముఖ‌ర్జీ కుమారుడు, మాజీ ఎంపీ అభిజిత్ ముఖ‌ర్జీ సోమ‌వారం పాల‌క తృణ‌మూల్ కాంగ్రెస్ (టీఎంసీ)లో చేరారు. టీఎంసీలో చేరిక సంద‌ర్భంగా ప‌శ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి  మ‌మ‌తా బెన‌ర్జీకి ఆయన ధ‌న్య‌వాదాలు తెలిపారు.

కోల్‌కతాలోని టీఎంసీ కార్యాలయంలో ఆయన పార్టీ కండువా కప్పుకున్నారు.  కాంగ్రెస్‌లో తనకు ఎలాంటి హోదా ఇవ్వనందున టీఎంసీలో చేరానని, తనకు టీఎంసీ  ఏ పదవి ఇచ్చినా ఒక సైనికుడిలా బాధ్యతతో పనిచేస్తానని చెప్పారు. 

కాగా, కోల్‌క‌తాలో గ‌త నెల‌లో టీఎంసీ నేత‌, దీదీ మేన‌ల్లుడు అభిషేక్‌ బెన‌ర్జీని అభిజిత్ ముఖ‌ర్జీ క‌ల‌వ‌డం రాజ‌కీయ ప్రాధాన్య‌త సంతరించుకుంది. ఈ క్ర‌మంలో టీఎంసీ నేత‌ల‌తో అభిజిత్ పార్టీ మారే విష‌యంపై సంప్ర‌దింపులు జ‌రుపుతూ వ‌చ్చారు.

మ‌రోవైపు ఇటీవల న‌కిలీ వ్యాక్సినేష‌న్ స్కామ్‌పై దీదీకి మ‌ద్ద‌తుగా అభిజిత్ ట్విట్టర్ వేదికగా తన వాణిని వినిపించారు. కేంద్రంలోని మోదీ సర్కార్‌పై ఈ సందర్భంగా వ్యంగ్యాస్త్రాలు సంధించ‌డంతో అభిజిత్ తృణమూల్ కాంగ్రెస‌లో చేరతారనే ప్రచారం ఊపందుకుంది.

2012లో తండ్రి ప్రణబ్ ముఖేర్జీ రాష్ట్రపతిగా ఎన్నికైన సందర్భంగా ఖాళీ అయిన జంగిపూర్ లోక్ సభ స్థానం నుండి కాంగ్రెస్ అభ్యర్థిగా స్వల్ప ఆధిక్యత 2,536 ఓట్లతో,  సిపిఎం అభ్యర్థి ముజాఫ్ఫార్ హుస్సేన్ ను ఓడించి గెలుపొందిన అభిజిత్, తిరిగి 2014 ఎన్నికలలో కూడా ఎన్నికయ్యారు. అయితే 2019లో టిఎంసి అభ్యర్థి ఖేలుగ్ రెహమాన్ చేతిలో ఓటమి చెందారు.