ఇత‌ర దేశాల‌కు అందుబాటులో కోవిన్ పోర్ట‌ల్‌

కోవిడ్‌పై పోరాటంలో టెక్నాల‌జీ కూడా స‌హ‌క‌రించింద‌ని, అదృష్ట‌వ‌శాత్తు సాఫ్ట్‌వేర్‌లో ఎటువంటి అవ‌రోధాలు లేవ‌ని, అందుకే కోవిడ్ ట్రేసింగ్‌, ట్రాకింగ్ యాప్‌ను ఓపెన్ సోర్సుగా మార్చిన‌ట్లు ప్ర‌ధాని  నరేంద్ర మోదీ తెలిపారు. ఇత‌ర దేశాల‌కు కోవిన్ పోర్ట‌ల్‌ సాఫ్ట్‌వేర్ ఇక అందుబాటులో ఉంటుంద‌ని ప్రకటించారు. 

కోవిన్ యాప్‌తో వ్యాక్సినేష‌న్ ప్ర‌క్రియ‌ స‌క్సెస్ సాధించినట్లు ఆయ‌న చెప్పారు. కోవిన్ గ్లోబ‌ల్ స‌మావేశంలో ఆయ‌న వ‌ర్చువ‌ల్‌గా ప్ర‌సంగీస్తూ ఈ  మ‌హ‌మ్మారి నుంచి సుర‌క్షితంగా బ‌య‌ట‌ప‌డేందుకు వ్యాక్సినేష‌న్ విధానం ఒక్క‌టే మాన‌వ‌ళికి ఆశాకిర‌ణం అని స్పష్టం చేశారు. మ‌న దేశంలో ముందు నుంచి వ్యాక్సినేష‌న్ కోసం డిజిట‌ల్ విధానాన్ని అవ‌లంబిస్తున్న‌ట్లు ప్ర‌ధాని తెలిపారు.

అన్ని దేశాల్లోనూ క‌రోనా వ‌ల్ల ప్రాణాలు కోల్పోయిన బాధిత కుటుంబాల‌కు ఆయ‌న సంతాపం తెలిపారు. గ‌త వందేళ్ల‌లో ఇలాంటి మ‌హ‌మ్మారిని చూడ‌లేద‌ని పేర్కొన్నారు. ఏ దేశ‌మైనా, అది ఎంత శ‌క్తివంత‌మైన‌దైనా, ఇలాంటి స‌మ‌స్య‌ను ప‌రిష్క‌రించం అసాధ్య‌మ‌ని ప్రధాని స్పష్టం చేశారు. ఆరోగ్య సేత‌ను యాప్ స‌క్సెస్ అయ్యింద‌ని, 20 కోట్ల మంది ఆ యాప్‌ను వాడుతున్న‌ట్లు ప్ర‌ధాని వెల్ల‌డించారు.

యావ‌త్ ప్రపంచాన్ని ఒకే కుటుంబంగా భార‌తీయ‌ నాగ‌రిక‌త చూస్తుంద‌ని, మ‌హ‌మ్మారి వేళ ఈ త‌త్వాన్ని అంద‌రూ అర్థం చేసుకున్నార‌ని చెప్పారు, అందుకే కోవిడ్ వ్యాక్సినేష‌న్ కోసం రూపొందించిన కోవిన్ టెక్నాల‌జీ ఫ్లాట్‌ఫామ్‌ను ఓపెన్ సోర్స్‌గా చేసిన‌ట్లు ప్ర‌ధాని వివరించారు.