ఎల్గ‌ర్ ప‌రిష‌త్ కేసు నిందితుడు స్టాన్ స్వామి కన్నుమూత

 
ఎల్గ‌ర్ ప‌రిష‌త్ కేసులో నిందితుడిగా అరెస్ట్ అయి, ప్రస్తుతం ముంబై ఆసుపత్రిలో ఉన్న ఫాదర్ స్టాన్ స్వామి (84) నేడు కన్ను మూసారు.  ఇవాళ ఆయన బెయిల్ పిటిష‌న్ విచారణ సందర్భంగా ఆయన మృతి చెందిన్నట్లు హోలీ ఫామిలీ హాస్పిటల్ వైద్యులు ముంబై హైకోర్టుకు తెలిపారు. 
 
క్రైస్తవ ప్రచారకుడిగా,  గిరిజనుల హక్కుల నేతగా పేరొందిన ఆయన గ‌త కొన్నాళ్ల నుంచి అస్వ‌స్థ‌త‌తో ఉన్నారు. ఆదివారం నుంచి ఆయ‌న వెంటిలేట‌ర్‌పై శ్వాస తీసుకుంటున్నారు. బీమా కోరేగావ్‌కు రెండు వంద‌ల ఏళ్లు అయిన సంద‌ర్భంగా పుణెలో 2017, డిసెంబ‌ర్‌లో ఎల్గ‌ర్ ప‌రిష‌త్ స‌మావేశాన్ని నిర్వ‌హించారు. 
 
ఆ స‌మావేశం త‌ర్వాత మ‌హారాష్ట్ర‌లో భారీ స్థాయిలో అల్ల‌ర్లు జ‌రిగాయి. ఆ కేసులో స్టాన్ స్వామిని గత ఏడాది అక్టోబర్ 8న పోలీసులు అరెస్టు చేశారు. కొన్నాళ్ల పాటు ఆయ‌న్ను న‌వీ ముంబైలోని త‌లోజా ప్రిజ‌న్‌లో ఉంచారు. 
 
ఆదివారం ఉదయం 4.30 గంటలకు హుద్రోగానికి గురైన ఆయన తదుపరి స్పృహలోకి రాలేదని, తర్వాత ఈ రోజు మధ్యాన్నం 1.24 గంటలకు మృతి చెందారని ఆసుపత్రి మెడికల్ డైరెక్టర్ డా. ఇయన్ డిసౌజా ముంబై హైకోర్టుకు తెలిపారు. 
 
ఈ వార్త విని దిగ్బ్రాంతికి గురైన జస్టిస్ ఎస్ ఎస్ షిండే నేతృత్వంలోని హైకోర్ట్ బెంచ్ వ్యాఖ్యానించడానికి తమకు మాటలు రావడం లేదని విచారం వ్యక్తం చేసింది. వేలాదిమంది ఆదివాసీ యువకులను ప్రభుత్వ ఏజెన్సీలు “నక్సలైట్లు” గా ముద్ర వేసి అరెస్ట్ చేయడాన్ని సవాల్ చేయడంతో తనను అరెస్ట్ చేశారని పేర్కొంటూ ఆయన దాఖలు చేసిన బెయిల్ పిటిషన్ ను ఇంతకు ముందు ప్రత్యేక కోర్ట్ తిరస్కరించింది.
 
 ఆయనను నిషేధిత మావోయిస్టులకు మద్దతు దారులుగా వ్యవహరిస్తున్న “అర్బన్ నక్షలైట్”లలో ఒకరుగా ప్రభుత్వ ఏజెన్సీలు ఆరోపిస్తున్నాయి. అటవీ ప్రాంతాలలో మావోయిస్టులకు ఆశ్రయం కల్పించడంతో పాటు, వారి హింసాయుత కార్యకలాపాలకు అండగా వ్యవహరిస్తున్నారనే ఆరోపణలున్నాయి. 
 
గిరిజనుల హక్కుల కోసం పోరాడుతున్నామని చెబుతూ ఆచరణలో మావోయిస్టు అజెండా ప్రకారం వ్యవహరిస్తున్నారని ఆయన బెయిల్ పిటిషన్ వ్యతిరేకిస్తూ ఎన్ ఐ ఎ పేర్కొన్నది. స్పష్టమైన ఆధారాలు సేకరించిన తర్వాతనే అరెస్ట్ చేశామని, కేవలం హక్కుల పోరాటం వల్లనా కాదని స్పష్టం చేసింది. 
 
ఎలక్ట్రానిక్ సాక్ష్యాధారాలను మాయం చేయడానికి ప్రయత్నించడం ద్వారా నేర పక్రియ నుండి తప్పించుకొనే ప్రయత్నం చేస్తున్నాడని ఆరోపించింది. ఈ కేసులో సహా నిందితులతో పాటు నిషేధిత మావోయిస్టు పార్టీలో క్రియాశీల సభ్యులని, వారి చట్ట వ్యతిరేక కార్యకలాపాలలో క్రియాశీలకంగా పాల్గొంటున్నారని కూడా పేర్కొన్నది.