కల్యాణ్‌ సింగ్ ఆరోగ్యం విషమం… ప్రధాని ఆరా !

ఉత్తరప్రదేశ్‌ మాజీ ముఖ్యమంత్రి, బీజేపీ సీనియర్‌ నేత కల్యాణ్‌ సింగ్ ‌(89) ఆరోగ్య పరిస్థితి విషమించింది. దీంతో లక్నో‌లోని సంజయ్‌ గాంధీ పోస్ట్‌ గ్రాడ్యుయేట్‌ ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ మెడికల్‌ సైన్సెస్‌ (ఎస్‌‌జీ‌పీ‌జీఐ) దవా‌ఖా‌నలో చేర్పిం‌చారు. వైద్యులు ఆయనను ఐసీ‌యూలో ఉంచి చికిత్స అంది‌స్తు‌న్నారు. 

కల్యా‌ణ్‌‌సింగ్‌ గత రెండు వారా‌లుగా అనా‌రో‌గ్యంతో బాధ‌ప‌డు‌తు‌న్నారు. అప్పటి నుంచి ఆయన రామ్‌ మనోహర్‌ లోహియా దవాఖానకు తరలించారు. అక్కడ ఆయన ఆరోగ్యం విషమించడంతో వైద్యులు పీజీఐకి తరలించారు.

ఆయన మెదడులో రక్తం గడ్డ కట్టిందని, చికిత్స ద్వారా ఆరోగ్యం మెరుగుపడినప్పటికీ రక్తపోటు పెరిగిందని, దీనికితోడు గుండెపోటు కూడా వచ్చిందని హాస్పిటల్‌ వర్గాలు వెల్లడించాయి. దీంతో నెఫ్రాలజీ, కార్డియాలజీ, న్యూరాలజీ, ఎండోక్రినాలజీ, న్యూరో ఆటోలజీ నిపుణులతో కూడిన బృందం ఆయనకు వైద్య సేవలు అందిస్తున్నారని ఆసుపత్రి వర్గాలు పేర్కొన్నాయి. 

కల్యాణ్‌ సింగ్‌ రాజస్థాన్‌ గవర్నర్‌గా కూడా పనిచేశారు. దవాఖానలో చికిత్స పొందుతున్న కల్యాణ్‌ సింగ్‌ను ఉత్తరప్రదేశ్‌ ముఖ్యమంత్రి యోగీ ఆదిత్య నాథ్‌ పరామర్శించారు. ఆరోగ్య పరిస్థితిని గురించి వైద్యులను అడిగి తెలుసుకున్నారు. కల్యాణ్‌సింగ్‌ త్వరగా కోలుకోవాలని ఆ రాముణ్ని ప్రార్థిస్తున్నానంటూ ట్వీట్‌ చేశారు.

మరోవైపు కల్యాణ్‌ సింగ్‌ ఆరోగ్యపరిస్థితిపై ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఆరా తీశారు. ఆయన కుమారుడు రాజ్‌వీర్‌కు ఫోన్ చేసి, వివరాలను తెలుసుకున్నారు. అలాగే ఆయనకు మెరుగైన వైద్య సేవలు అందించాల్సిందిగా సీఎం యోగీని  కోరారు. 

 అంతకుముందు రక్షణ మంత్రి రాజ్‌నాథ్ సింగ్, యూపీ సీఎం యోగి ఆదిత్యనాథ్,  కేశవ్ ప్రసాద్ మౌర్య, యూపీ బీజేపీ చీఫ్ స్వాత్రా దేవ్ సింగ్ ఆసుపత్రిని సందర్శించిన కల్యాణ్‌ సింగ్‌ను పరామర్శించారు.