హిందూ, ముస్లిం వేర్వేరు సమూహాలు కావు

భారత దేశ ప్రజలందరిదీ ఒకే డీఎన్‌ఏ అని రాష్ట్రీయ స్వయం సేవక్ సంఘ్ సరసంఘ చాలక్ డా. మోహన్ భాగవత్ స్పష్టం చేశారు. హిందూ, ముస్లిం అనేవి రెండు వేర్వేరు సమూహాలు కావని, ఆ రెండు ఇప్పటికీ కలిసే ఉన్నాయని తేల్చి చెప్పారు. గత 40,000 సంవత్సరాలుగా భారతీయులు అందరూ ఒకే డీఎన్‌ఏ కలిగి ఉన్నారని తెలిపారు.
 
యూపీలోని ఘజియాబాద్‌లో జరిగిన ‘ముస్లిం రాష్ట్రీయ మంచ్’ కార్యక్రమంలో ఆయన పాల్గొంటూ  మూక దాడులు చేసే వ్యక్తులు హిందుత్వానికి శత్రువులుగా అభివర్ణించారు. దేశంలో ఉంటున్న వారందరిదీ ఒకే డీఎన్‌ఏ అని, వారు ఏ ధర్మాన్ని ఆచరించేవారైనా పర్లేదని పేర్కొన్నారు. 
 
ఈ సందర్భంగా డా. ఖవాజా ఇఫ్తికార్ అహ్మద్ గ్రంధం “మీటింగ్ అఫ్ మైండ్స్” ను డా. భాగవత్ ఆవిష్కరించారు. భారత దేశంలో ముస్లింలు ప్రమాదకారి కాదని ఆర్ ఎస్ ఎస్ అధిపతి స్పష్టం చేశారు. దేశంలో ఐక్యత లేకుండా అభివృద్ధి సాధ్యం కాదని, ఐక్యత కోసం ప్రజల మధ్య సంప్రదింపులు అవసరమని, అపోహాలు కాదని ఆయన పేర్కొన్నారు.
భారత దేశంలో ఇస్లాం ప్రమాదంలో పడినదనే భయం సృష్టించే వాతావరణంలో చిక్కుకోవద్దని హితవు చెప్పారు. హిందూ- ముస్లింలు ఒకటేనని, పూజా విధానంలో మార్పు ఉన్నంత మాత్రాన దానిని ఆధారం చేసుకొని, వేర్వేరుగా చూడటం సమంజసం కాదని హితవు చెప్పారు. ఆవు ఒక పవిత్ర జంతువు, కానీ ఇతరులను కించపరిచే ప్రజలు హిందుత్వానికి వ్యతిరేకంగా వెళుతున్నారని భగవత్‌ విమర్శించారు. అలాంటి వారిపై ఎటువంటి పక్షపాతం లేకుండా చట్టం తనదైన చర్యలు తీసుకోవాలని పిలుపునిచ్చారు.
హిందూ, ముస్లిం ఐక్యత గురించి పొరపాటుగా అర్ధం చేసుకొంటున్నారని చెబుతూ దేశంలో ఎప్పుడు హిందువులు ఆధిపత్యం వహించడం గాని, ముస్లింలు ఆధిపత్యం గాని ఉండబోదని, కేవలం భారతీయులే ఆధిపత్యం వహిస్తారని పేర్కొన్నారు. ‘‘కొన్ని విషయాలను రాజకీయ కోణంలో చూడలేం. రాజకీయాలు ప్రజలను ఏమాత్రం ఏకం చేయలేవు. రాజకీయం ఏకం చేసే సాధనంగా కూడా మారలేదు” అని హితవు చెప్పారు. 
 
కానీ ఐక్యతను నాశనం చేసే ఆయుధంగా రాజకీయం మారుతుందని భాగవత్ ఆందోళన వ్యక్తం చేశారు. దేశంలో ఐక్యత లేకుండా అభివృద్ధి అసాధ్యం అని స్పష్టం చేశారు. ఐక్యతకు ఆధారం జాతీయవాదం అని తెలిపారు. అందరం ప్రజాస్వామ్య వ్యవస్థలో జీవిస్తున్నామని, అందుకే హిందువుల ప్రభుత్వమో, ముస్లింల ప్రభుత్వమో ఉండే అవకాశమే ఉండదని భాగవత్ చెప్పారు. కేవలం భారతీయుల ప్రభుత్వం మాత్రమే ఉంటుందని మోహన్ భాగవత్ పేర్కొన్నారు. 
 
“నేను ఆర్ ఎస్ ఎస్ ఇమేజ్ కోసమో, ఓట్లకోసమే తాపత్రయ పడటం లేదు. సంఘ్ ఎప్పుడు దేశంను బలోపేతం చేయడానికి, ప్రజల అందరి సంక్షేమం కోసం పనిచేస్తుంది” అని ఆర్ ఎస్ ఎస్ అధినేత ఈ సందర్భంగా తేల్చి చెప్పారు.