శివసేన ఎప్పటికి శత్రుపక్షం కాదు… కలకలం సృష్టిస్తున్న ఫడ్నవిస్

శివసేన తమకు ఎన్నటికీ శత్రువు కాదని మాజీ ముఖ్యమంత్రి, బీజేపీ సీనియర్ నేత దేవేంద్ర ఫడ్నవిస్ స్పష్టం చేయడం మహారాష్ట్ర రాజకీయాలలో కలకలం సృష్టిస్తున్నది. బిజెపి, మాజీ మిత్రపక్షమైన శివసేన “శత్రువులు కాదు” అని ఆయన తేల్చి చెప్పారు. అయితే తమ మధ్య కొన్ని సమస్యలపై అభిప్రాయ భేదాలు ఉన్నాయని,చెప్పారు.
 
ఇద్దరు మాజీ మిత్రపక్షాలు మళ్లీ కలిసి వచ్చే అవకాశం ఉందా అనే ప్రశ్నకు సమాధానమిస్తూ, పరిస్థితిని బట్టి “తగిన నిర్ణయం” తీసుకుంటామని ఫడ్నవిస్ వెల్లడించారు. కేంద్ర హోంమంత్రి అమిత్ షాతో ఇటీవల జరిగిన సమావేశం, బిజెపి- శివసేన మళ్లీ కలిసి వచ్చే అవకాశం గురించి అడిగినప్పుడు, “రాజకీయాల్లో ఎటువంటి ఇఫ్ట్స్, బట్స్ లేవు” అని తేల్చి చెప్పారు. 
 
ఓబిసి రేజర్వేషన్ల విషయమై అఖిల పక్ష ప్రతినిధి వర్గంను తీసుకు వెళ్లి ఇటీవల ప్రధాన మంత్రి నరేంద్ర మోదీని కలిసిన సందర్భంగా సమావేశం తర్వాత మహారాష్ట్ర ముఖ్యమంత్రి ఉద్ధవ్ ఠాక్రే విడిగా ప్రధానితో భేటీ జరపడం రాజకీయాలలో పలు ఊహాగానాలకు తెరలేపింది. శివసేన తిరిగి బిజెపి దరి చేరుతున్నట్లు కధనాలు వెలువడ్డాయి.
అటువంటి సమయంలో ఫడ్నవిస్ వాఖ్యలో మహారాష్ట్ర రాజకీయాలలో తీవ్ర ఆసక్తి కలిగిస్తున్నాయి. ఎప్పటికప్పుడు అప్పుడు నెలకొన్న పరిస్థితులను బట్టి నిర్ణయాలు తీసుకొంటూ ఉంటామని చెప్పడం ద్వారా పలు ఊహాగానాలకు ఆస్కారం కలిగించారు. మహారాష్ట్ర శాసనసభ వర్షాకాలం సందర్భంగా ఫడ్నవిస్ విలేకరుల సమావేశంలో మాట్లాడుతూ  “మా మిత్రుడు (శివసేన) మాతో 2019 అసెంబ్లీ ఎన్నికల్లో కలసి పోటీ చేశారు. కాని ఎన్నికల తరువాత, వారు (సేన) చాలా మంది వ్యక్తులతో (ఎన్‌సిపి,కాంగ్రెస్) చేతులు కలిపారు” గుర్తు చేసారు.

ముఖ్యంగా, ఉద్ధవ్ ఠాక్రే నేతృత్వంలోని పార్టీ ముఖ్యమంత్రి పదవిపై మొండి పట్టు పట్టడంతో  ఎన్నికల తర్వాత ఆ రెండు పార్టీల దారులు వేరయ్యాయి. సేన తరువాత ఎన్‌సిపి, కాంగ్రెస్‌లతో చేతులు కలిపి ఠాక్రేతో ముఖ్యమంత్రిగా మహా వికాస్ అగాడి (ఎంవిఎ) ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసింది. 
 
హైకోర్టు ఆదేశాల మేరకు మహారాష్ట్రలో కేంద్ర దర్యాప్తు సంస్థలు వివిధ కేసులను పరిశీలిస్తున్నాయని, అయితే ఆయా కేసులపై రాజకీయంగా ఎటువంటి వత్తిడులు లేవని ఫడ్నవిస్ స్పష్టం చేసారు. 
 
కాగా, శివసేన ఎంపి సంజయ్ రౌత్ శనివారం బిజెపి నాయకుడు ఆశిష్ షెలార్‌తో తాను జరిపిన భేటీ గురించి చెలరేగిన “పుకార్లను” శివసేన ఎంపీ సంజయ్ రౌత్ తోసిపుచ్చుతూ  “ఇలాంటి పుకార్లు మరింత వ్యాప్తి చెందుతాయి, ఎంవిఎ కూటమి బలంగా మారుతుంది” అంటూ పేర్కొన్నారు. “మనకు రాజకీయ, సైద్ధాంతిక భేదాలు ఉండవచ్చు, కాని బహిరంగ కార్యక్రమాలలో ముఖాముఖి వస్తే, మేము ఒకరినొకరు హృదయపూర్వకంగా పలకరిస్తాము. నేను షెలార్‌తో బహిరంగంగా కాఫీ తాగాను” అని తెలిపారు.