ఎన్నికల లబ్ధికై కృష్ణ జలాలపై రెచ్చగొడుతున్న కేసీఆర్ 

కృష్ణా జలాల వివాదంపై ప్రజలను రెచ్చగొడుతూ సీఎం కేసీఆర్‌ ఎన్నికల్లో రాజకీయ లబ్ధి కోసం ప్రయత్నిస్తున్నారని కేంద్ర హోమ్ శాఖ సహాయ మంత్రి జి కిషన్ రెడ్డి మండిపడ్డారు. కేసీఆర్‌ కుటుంబం, తన పాలనా వైఫల్యాన్ని ఆంధ్ర ప్రజలపై నెడుతోందని విమర్శించారు. బీజేపీ రాష్ట్ర కార్యాలయంలో జరిగిన రాష్ట్ర కార్యవర్గ సమావేశంలో కిషన్‌రెడ్డి మాట్లాడుతూ ఆస్తులు పంచుకోవడంతో పాటు దావత్‌లు చేసుకున్న తెలంగాణ సీఎం కేసీఆర్‌, ఏపీ సీఎం జగన్‌లు, జల వివాదాలను పరిష్కరించుకోవాల్సిన అవసరం లేదా అని ప్రశ్నించారు.

‘‘ఇద్దరు సీఎంలు ఏ ఒప్పందం చేసుకున్నారోగానీ ఆంధ్ర ప్రజలను రాక్షసులుగా, ద్రోహులుగా చిత్రీకరిస్తున్నారు. ఇది మంచిది కాదు. నీటి వివాదాల పరిష్కారం కోసం కేంద్రం సహకరిస్తుంది. ఇద్దరు సీఎంలు కూర్చోండి.. ఏ రాష్ట్రానికి రావాల్సిన వాటా పొందే హక్కు ఆ రాష్ట్రానికి ఉంటుంది” అని కిషన్ రెడ్డి స్పష్టం చేశారు.

మంత్రులతో ఇష్టారాజ్యంగా ప్రకటనలు చేయించినంత మాత్రాన సమస్య పరిష్కారం కాదని హితవు చెప్పారు. కేసీఆర్‌ ఎప్పుడు ఎన్నికలు వచ్చినా ప్రజలను రెచ్చగొట్టి లబ్ధిపొందే ప్రయత్నం చేస్తారు. ఆ తర్వాత అన్నీ మరచిపోతారని ధ్వజమెత్తారు. 

కాగా, కాంగ్రెస్‌ నిన్నటి పార్టీ.. దానికి భవిష్యత్తు లేదని కిషన్‌రెడ్డి ఎద్దేవా చేశారు.కాంగ్రెస్​కు ఓటు వేసినా అది టీఆర్ఎస్​కు వేసినట్లేనని తేల్చి చెప్పారు  బిజెపిలో చేరిన మాజీ మంత్రి  ఈటల రాజేందర్‌ కుటుంబాన్ని ఏదోరకంగా జైలుకు పంపించేందుకు కేసీఆర్‌ కుట్ర పన్నారని కిషన్‌రెడ్డి ఆరోపించారు.

‘‘కేసీఆర్ నియంతృత్వ పోకడలను ఎదిరించినందుకు ఈటల కుటుంబాన్ని కేసీఆర్ వేధిస్తున్నారు. ఈటలకు బీజేపీ ఎప్పుడూ అండగా ఉంటుంది. ఆయన ఇప్పుడు బీజేపీ కుటుంబ సభ్యుడు” అని గుర్తు చేశారు. 

ఈటల వెనుక మోదీ ఉన్నారని, ఆయన్ను వేధిస్తే కేంద్రం చూస్తూ ఊరుకోబోదని హెచ్చరించారు. హుజూరాబాద్‌లో బీజేపీ, టీఆర్‌ఎస్‌ మధ్యే పోటీ ఉంటుందని స్పష్టం చేశారు.ఏడేండ్లలో తెలంగాణను కేసీఆర్ అప్పుల రాష్ట్రంగా మార్చారని, రాష్ట్రంలో కుటుంబ పాలన సాగుతోందని మండిపడ్డారు. 

తెలంగాణ ప్రజల ఆకాంక్షలకు భిన్నంగా కేసీఆర్ పాలన సాగిస్తున్నారని, ఆయన తీరుతో విసుగెత్తిపోయిన జనం ప్రత్యామ్నాయం కోసం బీజేపీ వైపు చూస్తున్నారని కిషన్​రెడ్డి చెప్పారు. 

కాగా, ఎన్నికల మేనిఫెస్టోలో ఇచ్చిన హామీలు ఏమయ్యాయని సీఎం కేసీఆర్‌ను బీజేపీ జాతీయ ప్రధాన కార్యదర్శి, రాష్ట్ర ఇన్‌చార్జ్‌ తరుణ్‌ఛుగ్‌  ఈ సమావేశంలో ప్రశ్నించారు. నిరుద్యోగ భృతి ఇస్తామన్న సీఎం కేసీఆర్  దానిని అమలు చేయలేదని విమర్శించారు. 

తెలంగాణలో అవినీతి, అహంకార టీఆర్ఎస్ సర్కార్ ను గద్దె దించే వరకు ఏ ఒక్క బీజేపీ కార్యకర్త నిద్రపోవొద్దని తరుణ్​ చుగ్  పిలుపునిచ్చారు. త్వరలో జరుగనున్న హుజూరాబాద్ నియోజకవర్గ ఉప ఎన్నికతో పాటు రాష్ట్రంలో ఎప్పుడు, ఎక్కడ  ఏ ఎన్నిక జరిగినా టీఆర్ఎస్ ను ఓడించడమే లక్ష్యంగా పనిచేయాలని చెప్పారు. 

రాష్ట్రంలో టీఆర్ఎస్  లంకను తగులబెట్టాలన్నారని ధ్వజమెత్తారు. టీపీసీసీ కొత్త టీంను చూస్తుంటే, టీడీపీకి కాంగ్రెస్‌ బీ టీంలా ఉందని ఎద్దేవా చేశారు. రాష్ట్రంలో కాంగ్రెస్  పార్టీ  వారం కిందటి  వరకు టీఆర్ఎస్  చేతిలో ఉండేదని, ఇప్పుడది టీడీపీ చేతిలోకి వెళ్లిందని చుగ్​ విమర్శించారు. 

కృష్ణా జలాల వివాదంపై తెలంగాణ, ఏపీ సీఎంలు కేసీఆర్‌, జగన్‌ డ్రామాలాడుతున్నారని సంజయ్‌ ధ్వజమెత్తారు. ‘‘హుజూరాబాద్‌ ఎన్నిక ఉందని తెలియగానే కేసీఆర్‌కు తెలంగాణ సెంటిమెంట్‌, కృష్ణా జలాల అంశం గురుకొస్తుంది” అని ఎద్దేవా చేశారు. సంగమేశ్వరం లిఫ్ట్‌ను ఆపాలని, పోతిరెడ్డిపాడు విస్తరణ కోసం ఏపీ ఇచ్చిన 203 జీవోకు వ్యతిరేకంగా కేంద్ర జలశక్తి శాఖకు తాను లేఖ వ్రాయగా,  స్పందించిన కేంద్ర జలశక్తి శాఖ ఏపీకి వార్నింగ్‌ ఇచ్చిందని గుర్తు చేశారు. 

అయితే, రాయలసీమ లిఫ్ట్‌ ప్రాజెక్టు టెండర్లు ఖరారు అయ్యేందుకు అవకాశం ఇవ్వాలన్న ఉద్దేశంతో అపెక్స్‌ కమిటీ మీటింగ్‌ను కేసీఆర్‌ వాయిదా వేయించారతెలిపారుని . ఇప్పుడు హుజూరాబాద్‌ ఎన్నికలను దృష్టిలో పెట్టుకుని.. ఏపీ సీఎం గజ దొంగ.. వాళ్ల నాన్న దొంగ.. అంటూ ఈయన దొంగ డ్రామాలు మొదలు పెట్టారని  సంజయ్‌ ధ్వజమెత్తారు.