లోటు భర్తీకి నోట్లను ముద్రిస్తే  వృధా వ్యయాలకే దోహదకారి 

ద్రవ్యలోటును తీర్చడానికి ఆర్‌బిఐ (భారతీయ రిజర్వు బ్యాంక్) నోట్లను ముద్రిస్తే  వృధా వ్యయాలకే దోహ దకారి అవుతుందని ప్రముఖ ఆర్థికవేత్త,  ఎన్‌ఐపిఎఫ్‌పి(నేషనల్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ పబ్లిక్ ఫైనాన్స్ అండ్ పాలసీ) డైరెక్టర్  పినాకి చక్రవర్తి హెచ్చరించారు.

విత్తలోటును పూడ్చడానికి నగదు ముద్రణే ప్రత్యామ్నాయం అన్న చర్చ కరోనా మహమ్మారి ప్రారం భ కాలంలో మొదలైందని, అయితే ఆర్‌బీఐ ఇలాంటి చర్యకు దిగుతుందని తాను భావించడం లేదని ఒక ఇంటర్వ్యూలో పేర్కొన్నారు. ఆర్‌బీఐ విత్త లోటును పూడ్చడానికి నగదు ముద్రిస్తోందంటే ఎలాంటి అత్యవసర పరిస్థితి ఏర్పడినా ఆదుకునేందుకు తానున్నానని ప్రభుత్వానికి భరోసా ఇవ్వడమేనని తేల్చిచెప్పారు. 

అలాగే విచ్చలవిడి వ్యయాలకు తెర తీసినట్టవుతుందని వారించారు. దేశంలో మూడో విడత కరోనా ఉదృతి ముప్పు అంతగా లేనందు వల్లదేశీయ ఆర్థిక వ్యవస్థ వేగంగా కోలుకుంటుందని ఆయన ఆశాభావం వ్యక్తం చేశారు. అధిక ద్రవ్యోల్బణం ఆందోళన కల్గించే విషయమని, దీనిని వీలైనంత వరకు నియంత్రించాల్సిన అవసరం ఉందని చక్రవర్తి సూచించారు.

1996లోనే ఆర్‌బీఐ, ప్రభుత్వం ఒక అవగాహనా ఒప్పందం ద్వారా అదనపు నగదు ముద్రణ నిలిపివేశాయని గుర్తు చేస్తూ మళ్లీ ఆ స్థితికి తిరోగమించకూడదని ఆయన స్పష్టం చేశారు.  కరోనా మహమ్మారి మొదటి దశలో ఉన్నదాని కంటే ప్రస్తుత స్థూల ఆర్థిక వ్యవస్థ పరస్థితి మెరుగ్గా ఉందని సంతృప్తి వ్యక్తం చేశారు.

రాబోయే రోజుల్లో కొవిడ్19 మూడో దశ లేకపోయినట్లయితే భారతదేశ ఆర్థిక వ్యవస్థ వేగంగా కోలుకోవడం చూస్తామని ఆయన భరోసా వ్యక్తం చేశారు. కరోనా మహమ్మారి కారణంగా ఉద్యోగాలు కోల్పోయిన వారికి నగదు పరమైన సహాయం చేస్తారా? అనే ప్రశ్నకు చక్రవర్తి స్పందిస్తూ ఆర్థిక క్షీణత నుంచి ఉపాధి చక్రాన్ని నిరోధించలేమని, ఉద్యోగాలను పెంచేందుకు వేగంగా కోలుకోవడమే కీలకమని ఆయన వివరించారు.

అయితే ఆర్థిక చర్యల ద్వారా సహాయం చేయడం ద్వారా స్వల్ప కాలంలో కొంత వరకు జీవోనోపాధి భద్రతను ఇవ్వగలమని స్పష్టం చేశారు. ఉద్దీపన ప్యాకేజీల ఉద్దేశం ఆర్థిక పునరుద్ధరణ అని చక్రవర్తి చెబుతూ బడ్జెట్ ఉద్దీపనలు ఆందోళనకరం, గతేడాది 9.5 శాతం జిడిపిలోనూ ద్రవ్యలోటు పెరిగిందని ఆయన గుర్తు చేశారు.

ప్రభుత్వం ప్రకటించే ఉద్దీపనలేవైనా ఎంత మేరకు ఈ సంక్షోభాన్ని అధిగమించేందుకు దోహదపడేలా రూపొందించారనేదే ప్రధానమని పేర్కొన్నారు. ఏ విధంగా ప్రస్తుతానికి వ్యయాలను పెంచే అవకాశాలు చాలా తక్కువని చెప్పారు.  పెట్రోలియం ఉత్పత్తుల ధరలు దారుణంగా పెరిగిన నేపథ్యంలో వాటిపై పన్ను తగ్గింపు చర్యలు ప్రభుత్వాలు తీసుకోవలసి ఉంటుందా అన్న ప్రశ్నకు పన్ను తగ్గించడం అంటే కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల విత్త లోటును మరింత భారం అయ్యేలా పెంచడమే అవుతుందని చక్రవర్తి హెచ్చరించారు.

కాగా, గత వారం ఆర్థికమంత్రి నిర్మలా సీతారామన్ చిన్న, మధ్యతరహా పరిశ్రమలకు రూ.1.5 లక్షల కోట్ల అదనపు రుణం ప్రకటించారు. గత ఏడాది మే నెలలో ప్రకటించిన ఆత్మ నిర్భర్ భారత్ ప్యాకేజీలో భాగంగా అత్యవసర క్రెడిట్ లైన్ గ్యారెంటీ స్కీమ్ (ఇఎల్‌జిఎస్)కు అదనంగా ఈ నిధులను ప్రకటించారు. ఇఎల్‌జిఎస్ కింద ప్రతి రుణంపై ఉన్న 20 శాతం స్థాయిని హామీ, రుణ నగదు పరిమితిని పెంచాలని ప్రతిపాదించారు. ఇఎల్‌జిఎస్ కింద హామీ పరిమితి రూ.3 లక్షల కోట్ల నుంచి రూ.4.5 లక్షల కోట్లకు పెంచారు.

సూక్ష్మరుణ సంస్థల (ఎంఎఫ్‌ఐ) ద్వారా 25 లక్షల మందికి రూ.1.25 లక్షల అత్యవసర రుణం ఇస్తారు. దీనికి వడ్డీ గరిష్ఠంగా ఎంసిఎల్‌ఆర్ ప్లస్ 2 శాతం, గరిష్ఠంగా మూడేళ్ల కాలపరిమితి ఉంటుంది. ఇంకా ఆర్థికమంత్రి రూ.1.1 లక్షల కోట్ల రుణ హామీ పథకం ప్రకటించారు. దీనిలో ఆరోగ్య రంగానికి రూ 50 వేల కోట్లు, ఇతర రంగాలకు రూ.60 వేల కోట్లు కేటాయించారు.