మనీ లాండరింగ్‌ కేసులో జర్నలిస్ట్ రాజీవ్ శర్మ అరెస్ట్

ఢిల్లీకి చెందిన ప్రముఖ కాలమిస్టు, ప్రీలాన్స్‌ జర్నలిస్టు రాజీవ్‌ శర్మను మనీ లాండరింగ్‌ కేసులో ఎన్‌ఫోర్స్‌మెంట్‌ డైరెక్టరేట్‌ (ఇడి) అధికారులు శనివారం అరెస్టు చేశారు. 
 
అనంతరం ఆయనను ప్రత్యేక కోర్టు ముందు హాజరుపర్చగా న్యాయమూర్తి ఆయనను ఏడు రోజుల పాటు ఇడి కస్టడీకి అప్పగించారు. గతేడాది సెప్టెంబరులో చైనాకు రహస్య సమాచారం చేరవేశారనే ఆరోపణలతో ఢిల్లీ పోలీసులు అరెస్టు చేశారు. అనంతరం బెయిల్‌పై ఆయన విడుదలయ్యారు.
 
ఢిల్లీ పోలీసులు ఆయనపై చైనాకు రహస్యాలు  అందించారని దాఖలు చేసిన ఎఫ్ ఐ ఆర్ ఆధారంగా ఇడి మనీ లాండరింగ్ కేసును నమోదు చేసింది. “దర్యాప్తులో, రాజీవ్ శర్మ పారితోషికం  తీసుకొని చైనా ఇంటెలిజెన్స్ అధికారులకు రహస్య, సున్నితమైన సమాచారాన్ని అందించాడని తెలిసింది. తద్వారా భారతదేశ భద్రత, జాతీయ ప్రయోజనాలకు రాజీ పడింది” అని ఇడి ఒక ప్రకటనలో తెలిపింది. 

ఇడి ప్రకటన ప్రకారం, ఈ పని కోసం, చైనా జాతీయులు సూరజ్ గా పిలువబడే జంగ్ చెంగ్, ఉషాగా పిలువబడే జంగ్ లిక్సియా, కుయింగ్ షి, నేపాలీ జాతీయుడు రాజ్ బొహ్రగా పిలువబడే షేర్ సింగ్ లు  నడిపే మహీపాలపూర్ కేంద్రంగా గల షెల్ 
కంపెనీలు శర్మకు హవాలా ద్వారా నగదు లభించింది.

“నగదుతో పాటు, వివిధ చైనా కంపెనీలు, భారతదేశంలోని కొన్ని ఇతర వాణిజ్య సంస్థలతో భారీ లావాదేవీలు జరిగాయి. రాజీవ్ శర్మ వంటి వ్యక్తులకు నేర కార్యకలాపాలకు పాల్పడే వారికి పారితోషికం ఇవ్వడానికి ఈ చైనా కంపెనీలు చైనా ఇంటెలిజెన్స్ ఏజెన్సీలకు మార్గంగా పనిచేస్తున్నాయి. నేర కార్యకలాపాలలో తన ప్రమేయాన్ని దాచడానికి రాజీవ్ శర్మ బినామి బ్యాంక్ ఖాతాల ద్వారా కూడా డబ్బు అందుకున్నాడు, ”అని ఇడి వెల్లడించింది.

2019 లో అరెస్టు చేసిన తరువాత, ఢిల్లీ పోలీసులు భారతదేశ సరిహద్దు వ్యూహం, సైన్యాన్ని మోహరించడం గురించి సున్నితమైన సమాచారాన్ని చైనా ఇంటెలిజెన్స్‌కు పంపుతున్నారని చెప్పారు.శర్మ కొన్ని భారత మీడియా సంస్థలతో పాటు చైనా గ్లోబల్ టైమ్స్ కోసం భారత రక్షణ సమస్యలపై కధనాలు వ్రాస్తున్నట్లు స్పెషల్ సెల్ డిసిపి సంజీవ్ కుమార్ యాదవ్ తెలిపారు.

అతన్ని 2016 లో చైనీస్ ఇంటెలిజెన్స్ ఏజెంట్లు సంప్రదించారని ఆరోపించారు. శర్మ కూడా కొంతమంది చైనా ఇంటెలిజెన్స్ అధికారులతో సంబంధాలు పెట్టుకున్నారని పేర్కొన్నారు.  తెలిపారు, ఫ్రీలాన్స్ జర్నలిస్టుకు ఒకటిన్నర సంవత్సరాలలో రూ .40 లక్షలు వచ్చాయని తెలిపారు. అతను ప్రతి సమాచారం కోసం 1,000 డాలర్లు పొందుతున్నాడు.

సెంట్రల్ ఇంటెలిజెన్స్ నుండి వచ్చిన సమాచారం ఆధారంగా 2020 సెప్టెంబర్ 14 న శర్మను అరెస్టు చేశారు. అతని నుంచి వర్గీకృత రక్షణ పత్రాలను పోలీసులు స్వాధీనం చేసుకున్నట్లు డీసీపీ తెలిపారు. షెల్ కంపెనీల ద్వారా శర్మకు పెద్ద మొత్తంలో డబ్బు చెల్లించినందుకు చైనా మహిళ, ఆమె నేపాల్ సహచరుడిని కూడా అరెస్టు చేసినట్లు ఆయన చెప్పారు.