కేరళలో లెఫ్ట్ డెమొక్రటిక్ ఫ్రంట్ (ఎల్డీఎఫ్) ఓటమితో దేశంలో కమ్యూనిస్టుల అధికారపర్వానికి తెరపడింది. దశాబ్దాలపాటు దేశంలో ఏదో ఒక చోట అధికారంలో కొనసాగిన లెఫ్ట్ పార్టీలు, తమ చివరి కంచుకోటను కూడా కోల్పోయాయి. రెండు, మూడు రాష్ట్రాలలో మాత్రమే అధికారంలో ఉన్నప్పటికీ, మరో రెండు, మూడు రాష్ట్రాలలో మాత్రమే రాజకీయ ఉనికి బలంగా ఉన్నప్పటికీ దశాబ్దాలపాటు జాతీయ రాజకీయాలను ప్రభావితం చేశారు.
కేరళలో గత పదేళ్లపాటు సీపీఎం నేతృత్వంలోని ఎల్డీఎఫ్ అధికారంలో ఉంది. కానీ ఈ అసెంబ్లీ ఎన్నికల్లో అది ఘోరంగా ఓటమి పాలైంది. దీనితో గత 49 ఏళ్లలో తొలిసారి ఏ రాష్ట్రంలోనూ కమ్యూనిస్టు పార్టీలు అధికారం లేని పరిస్థితి నెలకొంది. ఇది భారత రాజకీయాల్లో కమ్యూనిస్టుల రాజకీయ అస్థిత్వాన్ని ప్రశ్నార్ధకంగా మార్చుతుంది. భారతదేశంలో 1920 నుంచి కమ్యూనిస్ట్ భావజాలం మొదలైంది. 1925లో కమ్యూనిస్టు పార్టీ ఆఫ్ ఇండియా (సీపీఐ)ని అధికారికంగా స్థాపించారు.
రష్యాలోని బోల్షివిక్ విప్లవ స్ఫూర్తితో ప్రారంభమైన కమ్యూనిస్టు పార్టీ, వలసవాద వ్యతిరేక పోరాటాల్లో కీలక పాత్ర పోషించింది. అయితే బ్రిటీష్ పాలకుల నిషేధాలు, అణచివేత ధోరణి వల్ల కమ్యూనిస్టులు అజ్ఞాతంలో పనిచేయాల్సి వచ్చింది. భారతదేశానికి స్వాతంత్ర్యం వచ్చిన తర్వాత చైనా, సోవియట్ యూనియన్ (ఆనాటి రష్యా) భావజాలాల మధ్య విభేదాలు వచ్చాయి. అంతేకాదు పార్లమెంటరీ వ్యవస్థపై కూడా కమ్యూనిస్టుల మధ్య భిన్నాభిప్రాయాల కారణంగా 1964లో పార్టీ చీలిపోయింది. అప్పుడే సీపీఐ (మార్క్సిస్ట్) ఆవిర్భవించింది.
ప్రపంచంలోనే మొదటిసారిగా ప్రజాస్వామ్యయుతంగా ఎన్నికైన కమ్యూనిస్టు ప్రభుత్వం 1957లో కేరళలో ఈఎంఎస్ నంబూద్రిపాద్ నేతృత్వంలో ఏర్పడింది. అప్పటి నుంచి కేరళలో లెఫ్ట్ పార్టీల హవా అలా కొనసాగుతూనే వచ్చింది. యూడీఎఫ్ మధ్యలో పాలన కొనసాగించినప్పటికీ, 2016లో కేరళలో అధికారంలోకి వచ్చిన ఎల్డీఎఫ్, 2021లోనూ తన పట్టును నిలుపుకుంది. ముచ్చటగా మూడోసారి కూడా విజయం సాధించాలని భావించినప్పటికీ, చుక్కెదురైంది.
1977 నుంచి 2011 వరకు అంటే 34 ఏళ్లపాటుబెంగాల్ లో లెఫ్ట్ ఫ్రంట్ ఏకఛత్రాధిపత్యంగా పాలన కొనసాగించింది. భూ సంస్కరణలు చేపట్టి, గ్రామీణ పంచాయతీలను బలోపేతం చేసింది. అయినప్పటికీ పారిశ్రామిక రంగ వృద్ధి లేకపోవడం, సింగూరు, నందిగ్రామ్ వివాదాలు మొదలైనవి కమ్యూనిస్టుల పాలనపై తిరుగుబాటుకు దారితీసాయి. ఈ తరుణంలోనే 2011లో మమతా బెనర్జీ నేతృత్వంలోని తృణమూల్ కాంగ్రెస్ (టీఎంసీ) కమ్యూనిస్టులను చిత్తుగా ఓడించి అధికారంలోకి వచ్చింది.
ఈ విధంగా బెంగాల్ లో కమ్యూనిస్టుల శకం ముగిసింది. గత 15 ఏళ్లపాటు బెంగాల్ లో మమతా బెనర్జీ పాలనే కొనసాగింది. ఈ 2026లో అక్కడ టీఎంసీ ప్రభుత్వాన్ని కూలదోసి బీజేపీ అధికారం దక్కించుకుంది. కమ్యూనిస్టులు ఏ మాత్రం ప్రభావం చూపలేకపోయారు. ఈశాన్య భారత రాష్ట్రమైన త్రిపురలోనూ 25 ఏళ్లకు పైగా లెఫ్ట్ పాలన కొనసాగింది. అయితే 2018 అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ దెబ్బకు కమ్యూనిస్టులు అధికారం కోల్పోయారు.
ఇక ఆంధ్రప్రదేశ్, బిహార్, ఒడిశా లాంటి రాష్ట్రాల్లో గతంలో కమ్యూనిస్టులకు కొంత బలం ఉన్నప్పటికీ, అది క్రమంగా తగ్గుతూ వచ్చింది. కమ్యూనిస్టులు కాలానుగుణంగా మారకుండా, తమ సిద్ధాంతాలను పట్టుకొని వేళాడుతుంటారని రాజకీయ విశ్లేషకులు చెబుతుంటారు. ఇవే కమ్యూనిస్టు పార్టీల వైఫల్యానికి కారణమని విమర్శిస్తుంటారు. చైనా, వియత్నాం లాంటి కమ్యూనిస్టు దేశాల్లో పాలకులు మార్కెట్ సంస్కరణలు చేపట్టినప్పటికీ, భారత లెఫ్ట్ పార్టీలు మాత్రం పాత మార్క్సిస్ట్ సిద్ధాంతాలకే కట్టుబడి ఉన్నాయి.
ఆధునిక ప్రపంచానికి కావాల్సిన ఆర్థిక సరళీకరణ, ప్రైవేటీకరణ, ప్రపంచీకరణలను భారత కమ్యూనిస్టులు తీవ్రంగా వ్యతిరేకిస్తుంటారు. అందుకే అభివృద్ధిని ఆకాంక్షించే ఓటర్లకు వారు దూరమవుతున్నారు. మరోవైపు, ప్రారంభంలో కమ్యూనిస్టులు మన దేశంలో చాలా భూసంస్కరణలు విజయవంతంగా చేపట్టారు. కానీ తర్వాతి కాలంలో బంధుప్రీతి, హింస, ఆర్థిక వైఫల్యాలకు కారణమయ్యారు. దీనితో ప్రజల్లో కొంత మందికి కమ్యూనిస్టులు దూరమయ్యారు.
ప్రజా ఉద్యమాల ద్వారా నాయకత్వం ఎదిగే ప్రక్రియకు స్వస్తిపలకడం ఆ పార్టీని ప్రజలకు దూరం చేసిందని చెప్పవచ్చు. వీటికి తోడు ప్రాంతీయ పార్టీల ఆవిర్భావం కూడా లెఫ్ట్ పార్టీల ఓటు బ్యాంకును కొల్లగొట్టింది. 2024 లోక్‌సభ ఎన్నికల్లో సీపీఎం 4 సీట్లు, సీపీఐ 2 సీట్లు మాత్రమే గెలుచుకోగలిగాయి. పాత కమ్యూనిస్టు భావజాలం, అంతర్గత విభేదాలు, సవాళ్లు, నాయకత్వ లోపం మొదలైనవి లెఫ్ట్ పార్టీలను వేధిస్తున్న సమస్యలు.
పైగా ఇప్పుడు ఉన్న నాయకులు అందరూ వయస్సు రీత్యా చాలా పెద్దవారు. ఆ పార్టీలకు యువనాయకత్వ లోపం స్పష్టంగా కనిపిస్తుంది. ఇప్పటివరకు సీపీఎం, సీపీఐ పార్టీలతో పాటు ఆర్‌ఎస్‌పీ, ఫార్వర్డ్ బ్లాక్ నాయకులు తమ ఎన్నికల బలం తక్కువగా ఉన్నప్పటికీ జాతీయ రాజకీయాల్లో ప్రభావవంతమైన పాత్ర పోషించేవారు. పశ్చిమ బెంగాల్, కేరళ, త్రిపుర రాష్ట్రాల నుంచి వచ్చిన మద్దతే లెఫ్ట్ రాజకీయ బలానికి ఆధారం. ప్రస్తుతం ఈ మూడు రాష్ట్రాల నుంచి లెఫ్ట్‌కు ఒక్క ఎంపీ మాత్రమే మిగిలింది.

More Stories
`ఇస్లామిక్ నాటో’ దిశగా పాకిస్థాన్ అడుగులు సాధ్యమా?
నీట్ ప్రశ్న పత్రాల లీక్ లో ఐదుగురు అరెస్ట్ .. ఎబివిపి నిరసనలు
పెట్రోల్, డీజిల్ ధరలు పెంచక తప్పదేమో!