మాజీ మంత్రి నారాయణకు గుదిబండగా అమరావతి భూకుంభకోణం 

చంద్రబాబు నాయుడు ప్రభుత్వంలో అమరావతి రాజధాని పేరుతో టిడిపి నేతలు  ల్యాండ్‌ పూలింగ్‌ పేరుతో పెద్ద ఎత్తున  భూ కుంభకోణం   పాల్పడ్డారని  ఆరోపణలు చేస్తూ వస్తున్న వై ఎస్ జగన్ మోహన్ రెడ్డి అధికారంలోకి రాగానే మంత్రివర్గ ఉపసంఘం ఏర్పాటు చేయడం ద్వారా నాటి ప్రభుత్వంలో కీలక వ్యక్తులపై తీవ్రమైన ఆరోపణలు చేస్తూ, సిఐడి విచారణకు ఆదేశించారు. 
 
వారు పెద్ద ఎత్తున ముందే అసైన్డ్ భూములను కొనుగోలు చేశారని అంటూ నమోదు చేసిన కేసు ఆ సమయంలో రాజధాని భూసేకరణలో కీలక భూమిక వహించిన నాటి పట్టణాభివృద్ధి శాఖ మంత్రి డా పి నారాయణకు ఇప్పుడు గుదిబండగా మారే సూచనలు కనిపిస్తున్నాయి. 
 
ఈ కేసుకు సంబంధించి కీలకమైన వ్యక్తిగా భావిస్తున్న చెరుకూరి శ్రీధర్‌ సాక్షిగా మారుతుండటంతో వేగంగా పరిణామాలు సంభవిస్తున్నాయి. గత టిడిపి ప్రభుత్వం హయాంలో సిఆర్‌డిఎ కమిషనర్‌గా పని చేసిన ఐఎఎస్‌ అధికారి చెరుకూరి శ్రీధర్‌ను విచారించిన సిఐడి ల్యాండ్‌ పూలింగ్‌ ప్రక్రియకు ముందే రెవెన్యూ రికార్డులు మాయమయ్యాయని వచ్చిన ఆరోపణలపై కీలక సమాచారాన్ని రాబట్టినట్టు తెలుస్తోంది.
 
2015లో ల్యాండ్‌ పూలింగ్‌ ప్రక్రియ చేపడితే 2014 అక్టోబర్‌లోనే తుళ్లూరు మండలం భూ రికార్డులను రహస్యంగా తెప్పించుకున్నారని శ్రీధర్‌ చెప్పినట్లు తెలుస్తోంది.  రెండు నెలల తర్వాత 2015 జనవరిలో ల్యాంగ్‌ పూలింగ్‌ ప్రక్రియ ప్రారంభమైందని, అనంతరం రాజధాని ప్రాంతంలోని అసైన్డ్‌ భూముల సేకరణ కోసం జిఒ 41 తీసుకొచ్చారని శ్రీధర్‌ అధికారులకు చెప్పారు. 
 
అసైన్డ్‌ భూములు ల్యాండ్‌ పూలింగ్‌కి తీసుకునే సమయంలో ఎపి అసైన్డ్‌ యాక్ట్‌ 1977కు విరుద్ధంగా ఉన్న అంశాలను మంత్రి నారాయణ దృష్టికి తీసుకెళ్లానని శ్రీధర్‌ తెలిపారు. చట్టవ్యతిరేకమని చెప్పినా నారాయణ పట్టించుకోలేదని శ్రీధర్‌ సిఐడి అధికారులకు చెప్పినట్లు తెలుస్తోంది. 
 
దీంతో నారాయణను విచారించేందుకు అనుమతి కోరుతూ ఎపి సిఐడి హైకోర్టులో కౌంటర్‌ దాఖలు చేసినట్లు చెబుతున్నారు. ఈ పరిణామాలతో రాజధాని భూముల కుంభకోణం నారాయణ మెడకు బిగుసుకుంటోందన్న వాదనలు వినిపిస్తున్నాయి.