హక్కుల కమీషన్ కార్యాలయం పక్క రాష్ట్రంలోనా?

ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్ర మానవ హక్కుల కమీషన్ కార్యాలయం రాష్ట్రంలో లేకపోవడం, ఎటువంటి ఫిర్యాదు చేయాలన్నా పక్క రాష్ట్రంపై వెళ్ళవలసి రావడం పట్ల రాష్ట్ర హై కోర్ట్ విస్మయం ప్రకటించింది. వెంటనే రాష్ట్రంలో కార్యాలయం ఏర్పాటు చేయాలనీ రాష్ట్ర ప్రభుత్వాన్ని ఆదేశించింది. ఈ విషయమై రెండు వారల లోగా సమాధానం చెప్పాలని, లేని పక్షంలో తామే తగు ఆదేశాలు ఇస్తామని స్పష్టం చేసింది. 

రాష్ట్ర ప్రజలు ఫిర్యాదు చేయడానికి తెలంగాణ వరకు వెళ్లాలా అని ప్రశ్నించింది. మానవహక్కుల కమిషన్‌, లోకాయుక్త వంటి సంస్థలు ప్రజలకు అందుబాటులో రాష్ట్రంలోనే ఉండాలని స్పష్టం చేసింది. ఈ మేరకు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్‌ అరూ్‌పకుమార్‌ గోస్వామి, జస్టిస్‌ ఎన్‌.జయసూర్యతో కూడిన ధర్మాసనం సోమవారం ఆదేశాలు ఇచ్చింది. 

విచారణను ఈ నెల 27కి వాయిదా వేసింది. హెచ్‌ ఆర్సీకి కార్యాలయం ఏర్పాటు చేసి…ప్రజలకు అందుబాటులోకి తీసుకురాకపోవడాన్ని సవాల్‌ చేస్తూ దాఖలైన పిల్‌ ను చేపట్టింది. రాష్ట్ర  ప్రభుత్వం హెచ్‌ఆర్సీ చైర్మన్‌, సభ్యులను నియమించినప్పటికీ కార్యాలయం ఏర్పాటు చేయలేదు. ఫిర్యాదులు సమర్పించేందుకు కార్యాలయం చిరునామా తెలియక  ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు.

ప్రభుత్వం తరఫున అడ్వకేట్‌ జనరల్‌ (ఏజీ) ఎస్‌.శ్రీరామ్‌ వాదనలు వినిపిస్తూ హైదరాబాద్‌ 10 ఏళ్లపాటు ఉమ్మడి రాజధానిగా ఉందని గుర్తు చేశారు. లోకాయుక్త, ఏపీఈఆర్సీ వంటి కార్యాలయాలు హైదరాబాద్‌ నుంచే పనిచేస్తున్నాయని తెలిపారు. హెచ్‌ఆర్సీ విషయంలో విభజన చట్టం మేరకు వ్యవహరించాల్సి ఉంటుందని పేర్కొన్నారు.

ఈ వ్యాఖ్యలపై  ధర్మాసనం అభ్యంతరం వ్యక్తం చేసింది. కమిషన్‌ను ఏపీలోనే ఏర్పాటు చేయాలని ప్రభుత్వానికి తేల్చి చెప్పింది. హైకోర్టు సూచనలు ప్రభుత్వం ముందు ఉంచుతామని, పూర్తి వివరాలు సమర్పించేందుకు  సమయం కావాలని ఏజీ కోరగా, ధర్మాసనం అంగీకరించింది.