పార్లమెంట్, అసెంబ్లీలలో అల్లర్ల పట్ల సుప్రీం కోర్ట్ అసహనం  

పార్లమెంటు, రాష్ట్ర అసెంబ్లీలలో ఎన్నికైన ప్రతినిధులు డెకోరం నిర్వహించకపోవడంపై సుప్రీంకోర్టు ఆందోళన వ్యక్తం చేసింది. జస్టిస్ డి.వై. చంద్రచూడ్, జస్టిస్ ఎం ఆర్ షా  ఇటువంటి ప్రవర్తనను సహించలేమని, బలమైన సందేశం పంపాల్సిన అవసరం ఉందని స్పష్టం చేశారు.

2015 లో కేరళ  రాష్ట్ర శాసనసభలో జరిగిన , రభస, విధ్వంసానికి సంబంధించి ఆరుగురు సిపిఐ (ఎం) సభ్యులపై దాఖలు చేసిన  క్రిమినల్ కేసులను ఉపసంహరించుకోవాలని కోరుతూ కేరళ ప్రభుత్వం దాఖలు చేసిన పిటిషన్ ను విచారించినప్పుడు ఉన్నత న్యాయస్థానం ఈ అంశంపై అసంతృప్తి వ్యక్తం చేసింది.

“ప్రాధమికంగా ఈ విషయమై మేము కఠినమైన అభిప్రాయాన్ని తీసుకోవాలి. ఈ విధమైన ప్రవర్తన ఆమోదయోగ్యం కాదు. ప్రజా ఆస్తిని నాశనం చేసిన ఎమ్మెల్యే ఈ విధమైన ప్రవర్తనను మేము క్షమించము. మీరు విచారణను ఎదుర్కోవలసి ఉంటుంది” అని జస్టిస్ చంద్రచూడ్ రాష్ట్ర ప్రభుత్వ న్యాయవాదికి తేల్చి చెప్పారు. “ఆర్థిక బిల్లును రూపొందిస్తున్నప్పుడు రభస సృష్టించిన ఎమ్మెల్యేను రక్షించడంలో పెద్ద ప్రజా ప్రయోజనం ఏమిటి?” అని ఆయన ప్రశ్నించారు.

అవినీతి ఆరోపణలు ఎదుర్కొన్న అప్పటి ఆర్థిక మంత్రిపై ఎమ్మెల్యేలు నిరసన వ్యక్తం చేస్తున్నారని రాష్ట్ర ప్రభుత్వం తరఫున హాజరైన సీనియర్ న్యాయవాది రంజిత్ కుమార్ తెలిపారు. శాసనసభ్యులకు నిరసన తెలిపే హక్కు ఉందని ఆయన చెప్పినప్పుడు, జస్టిస్ చంద్రచూడ్ ఇలా సమాధానం ఇచ్చారు: “ఇది నిరసన తెలిపే పద్ధతిలో కాదు”.

ఎమ్మెల్యేల ప్రవర్తనకు స్పీకర్ సస్పెండ్ చేసినట్లు కుమార్ తెలిపారు.  అసెంబ్లీ లోపల వారి చర్యలకు క్రిమినల్ ప్రాసిక్యూషన్ అనవసరమని ఆయన వాదించారు, ఎందుకంటే ఇది సభ  నిబంధనల ప్రకారం “తగిన విధంగా” వ్యవహరించబడింది. జూలై 15 న తదుపరి విచారణ కోసం సుప్రీం కోర్టు ఈ విషయాన్ని వాయిదా వేసింది.

2015 మార్చి 13 న కాంగ్రెస్ నేతృత్వంలోని యునైటెడ్ డెమోక్రటిక్ ఫ్రంట్ (యుడిఎఫ్) అధికారంలో ఉన్నప్పుడు కేరళ అసెంబ్లీలో  ఈ సంఘటన జరిగింది. బార్ లైసెన్సులను మంజూరు చేయడంలో అవినీతి ఆరోపణలకు సంబంధించిన కుంభకోణంలో ఆర్థిక మంత్రి కె ఎం మణి ప్రమేయం ఉందని ప్రతిపక్ష సభ్యులు నిరసన వ్యక్తం చేశారు.

తరువాత జరిగిన రభసతో తొమ్మిది మంది గాయపడ్డారు, స్పీకర్ గది ధ్వంసం చేశారు.  గందరగోళంలో ఎలక్ట్రానిక్ పరికరాలు ధ్వంసమయ్యాయి. ఏదేమైనా, ప్రతిపక్ష సభ్యుల అల్లర్లను లెక్క చేయకుండా ఆర్ధికమంత్రి  మణి అసెంబ్లీ భద్రతా సిబ్బంది, యుడిఎఫ్ శాసనసభ్యుల కాపలా బడ్జెట్ ను సభలో ప్రవేశ పెట్టగలిగారు.

కోడ్ ఆఫ్ క్రిమినల్ ప్రొసీజర్ సెక్షన్ 321 ప్రకారం ఈ కేసులో ప్రాసిక్యూషన్‌ను ఉపసంహరించుకునేందుకు అనుమతించడాన్ని తిరస్కరించిన తిరువనంతపురంలోని చీఫ్ జ్యుడిషియల్ మేజిస్ట్రేట్ కోర్టు ఇచ్చిన ఉత్తర్వులకు వ్యతిరేకంగా ప్రస్తుతం కేరళలో అధికారమలో ఉన్న ఎల్ డి ఎఫ్ ప్రభుత్వం సుప్రీం కోర్ట్ ను ఆశ్రయించింది.