స్వతంత్ర భారత్ చరిత్ర దిశను మార్చిన డా. ముఖర్జీ

* 120వ జయంతి నివాళి 

ఆధునిక భారతదేశపు గొప్ప జాతీయవాది డాక్టర్ శ్యామా ప్రసాద్ ముఖర్జీ (1901-1953) రాజకీయ జీవనకాలం తక్కువే అయినప్పటికి మూడు కీలక అంశాలతో స్వతంత్ర భారత చరిత్ర గతినే మార్చిన ఘనత ఆయనకు దక్కుతుంది. ప్రధాని నరేంద్ర మోదీ చెప్పిన్నట్లుగా భారతదేశానికి కొత్త రాజకీయ దృక్పధాన్ని సూచించే విధంగా “పార్లమెంటులో 3 నుండి 300 వరకు” బిజెపి ప్రయాణం సాధించడానికి సహితం ఆయన వేసిన ఈ బలమైన పునాది కారణం అని చెప్పవచ్చు.

జూన్ 23, 1953 న కాశ్మీర్‌లోని శ్రీనగర్‌లో నిర్బంధంలో మరణించే సమయానికి, 52 సంవత్సరాల వయసులో, డాక్టర్ ముఖర్జీ భారతీయ జాతీయత,  ఐక్యత, స్వతంత్రంలకు అత్యంత శక్తివంతమైన చిహ్నాలలో ఒకరుగా  ఆయన అవతరించారు. విద్యావేత్తగా, రాజకీయ నాయకుడిగా, రాజనీతిజ్ఞుడిగా, పరిపాలన వేత్తగా ఆయన సాధించిన అనేక విజయాలలో ముఖ్యంగా మూడు చారిత్రాత్మక అంశాలు ఆ తర్వాత కాలంలో స్వతంత్ర భారత చరిత్రనే మార్చివేశాయి.

పశ్చిమ బెంగాల్ సృష్టి 

ఆయన  మొదటి చారిత్రక విజయం పశ్చిమ బెంగాల్ రాష్ట్రాన్ని సృష్టించడానికి దారితీసింది. ఆయన  బెంగాల్ మొత్తాన్ని జిన్నా కోరుకున్న విధంగా పాకిస్థాన్ లోకి వెళ్ళకుండా నిరోధించారు. డాక్టర్ ముఖర్జీ 1947 లో బెంగాల్ విభజనను డిమాండ్ చేశారు. అందుకు అనుకూలంగా ఒక ఉద్యమాన్ని ప్రారంభించి విజయం సాధించారు.

పశ్చిమ బెంగాల్‌ను రూపొందించడంలో, ఆ ప్రాంతం జిన్నా పాకిస్థాన్ కు వెళ్లకుండా చేయడంలో విజయం సాధించారు. బెంగాల్ విభజనను అడ్డుకోవడం కష్టమని గ్రహించిన జిన్నా చివరకు పాకిస్థాన్ కు తోక దేశంగా ఉండేవిధంగా భారత్, పాకిస్థాన్ లలో చేరకుండా “స్వతంత్ర బెంగాల్”ను ఏర్పాటు చేయాలని కూడా ప్రయత్నం చేశారు.

అటువంటి ప్రయత్నాలను మొగ్గలోనే త్రుంచి వేయడం ద్వారా, ఆయన పశ్చిమ బెంగాల్ సృష్టికి కారకుడు కావడం ద్వారా దేశంలో కొంత భాగాన్ని కాపాడి, అది భారత దేశంలో అవిభాజ్యమైన ప్రాంతంగా అయ్యేవిధంగా చేయగలిగారు. దశాబ్దాలుగా తూర్పు పాకిస్తాన్,  తరువాత బంగ్లాదేశ్లలో మతపరమైన హింస కారణంగా పారిపోవలసి వచ్చిన పెద్ద సంఖ్యలో బెంగాలీ హిందువులు పశ్చిమ బెంగాల్ లోఆయన దూరదృష్టి కారణంగానే నేడు ఆశ్రయం పొందగలుగుతున్నారు.

భారతీయ జనసంఘ్ స్థాపన 

డాక్టర్ ముఖర్జీ రెండవ చారిత్రాత్మక విజయం, అప్పటి ఆధిపత్య ధోరణులకు కేంద్రంగా నిలిచిన నెహ్రూవియన్ కాంగ్రెస్‌కు ప్రత్యామ్నాయ రాజకీయ ఉద్యమంగా 1951 అక్టోబర్ 21 న భారతీయ జనసంఘ్ (బిజెఎస్) ను స్థాపించడం ద్వారా సరికొత్త రాజకీయ కధనంతో జనసంఘ్ పేరుతో రాజకీయ ద్యమాన్ని ప్రారంభించారు. జనసంఘ్ ను ప్రారంభించడం ద్వారా భారత దేశ పునర్జీవనం కోసం పనిచేస్తూ, భారతీయ సాంస్కృతిక విలువలు, పరిస్థితులు, అవసరాలకు అనుగుణంగా విధానాలు రూపొందించుకొనే అవకాశం కలిగించారు. డాక్టర్ ముఖర్జీ  జనసంఘ్ ప్రారంభ ప్రకటనలో ఈ విధంగా పేర్కొన్నారు:

“భారతీయ జనసంఘ్  లక్ష్యం భారతీయ సంస్కృతి, మర్యాద [విలువల] ఆధారంగా భారత్ పునర్నిర్మాణం; రాజకీయ, సామాజిక, ఆర్ధిక ప్రజాస్వామ్యంగా, వ్యక్తి సమానత్వం, స్వేచ్ఛను అందించే విధంగా,భారత్ ను ప్రగతిశీల, ఆధునిక, జ్ఞానవంతమైన విధానాలతో సుసంపన్న, శక్తివంత, ఐక్య దేశంగా మార్చి, ఇతరుల దూకుడు ఎత్తుగడలకు తట్టుకొని, ప్రపంచ శాంతి స్థాపన కోసం దేశాల మండలిలో తన ప్రభావాన్ని చూపగలదు.” \

డాక్టర్ ముఖర్జీ 1953 లోనే మరణించినప్పటికీ, ఆయన సమర్ధవంతమైన నాయకత్వం కింద శిక్షణ పొందిన, రాష్ట్రీయ స్వయంసేవక్ సంఘ్ (ఆర్ఎస్ఎస్) నుండి వచ్చిన వారి సారధ్యంలో జనసంఘ్  భారత రాజకీయాల్లోఆ తర్వాత ప్రధాన పాత్ర పోషింప గలిగింది.

బిజెఎస్ రాజకీయ వారసత్వం పొచ్చుకున్న బిజెపి  డాక్టర్ ముఖర్జీ  రాజకీయ వారసత్వాన్ని ముందుకు తీసుకువెడుతూ, పూర్తిగా జాతీయవాదంతో, భారత దేశ గడ్డలో పాతుకు పోయిన విలువలతో ఆయన కలలను సాకారం చేయగలుగుతున్నది. ప్రధాని నరేంద్ర మోదీ డాక్టర్ ముఖర్జీ ప్రవచించిన  “ఒక దేశం, ఒక రాజ్యాంగం” కలని సాకారం చేసారు. “ఏక్ భారత్, శ్రేష్త్ భారత్”  దృష్టిని సాకారం చేయడానికి కృషి చేస్తున్నారు.

దేశ ఐక్యతకు బలిదానం 

డాక్టర్ ముఖర్జీ మూడవ విజయం భారతదేశ ఐక్యత  కోసం తన జీవితాన్ని త్యాగం చేశారు. పార్లమెంటులో, వెలుపల ఆయన జోక్యం లేని పక్షంలో జమ్మూ కాశ్మీర్ ఎప్పటికి భారత్ లో భాగంగా ఉండెడిది కాదు.

కాశ్మీర్ లో ఆర్టికల్ 370 ను రద్దు చేయాలని, జమ్మూ కాశ్మీర్ భారతదేశంతో పూర్తిగా విలీనం కావాలని ప్రజాభిప్రాయం సమీకరించడానికి ఆయన ప్రయత్నించి ఉండక పోతే, “ఏక్ దేశ్ మెయి దో విధాన్, దో నిషన్, దో ప్రధాన్, నాహి చాలెంజ్, నహి చాలెంగే” [ఒక దేశంలో, రెండు రాజ్యాంగాలు, రెండు చిహ్నాలు, ఇద్దరు  ప్రధానులు చెల్లవు) అంటూ సింహ గర్జన చేయని పక్షంలో, కాశ్మీర్ భారత్ నుండి విడిపోకుండా చూడడం కోసం ఆయన కాశ్మీర్ పర్యటన చేయని పక్షంలో జమ్మూ కాశ్మీర్ ను మనం కోల్పోవలసి వచ్చెడిది.

ఈ ప్రాంతం పాకిస్తాన్ లో కలిసిపోయి ఉండెడిది. వేర్పాటువాదం,  ఉగ్రవాద శక్తులు భారతదేశ బాల్కనైజేషన్ కు ఆర్టికల్ 370 ను రద్దు చేయాలని డాక్టర్ ముఖర్జీ పిలుపునిచ్చారు.  ఎందుకంటే దీని వల్లనా జమ్మూ కాశ్మీర్ ప్రజలు భారత రాజ్యాంగం ఇచ్చిన ప్రయోజనాలు, హక్కులను కోల్పోతున్నారని ఆయన ఆనాడే స్పష్టం చేశారు.

“ప్రజాస్వామ్య సమాఖ్య రాష్ట్రంలో, ఒక రాజ్యాంగ యూనిట్ పౌరుల ప్రాథమిక హక్కులు మరొక యూనిట్ పౌరులతో పోలిస్తే మారవు. జమ్మూ కాశ్మీర్ ప్రజలకు మనం మిగిలిన భారత ప్రజలకు ఇచ్చిన ప్రాథమిక హక్కులకు అర్హత లేదా?” అంటూ ప్రశ్నించారు.
‘మీరు చేయబోయేది భారతదేశపు‘ బాల్కనైజేషన్’కు దారితీయవచ్చు, బలమైన సమైక్య భారత్ ను చూడకూడదనుకొనే వారిని బలపరచి విధంగా చేయవచ్చు’  అంటూ ఆయన నెహ్రూను హెచ్చరించారు.

ఆయన విజ్ఞప్తులు,  ప్రయత్నాలన్నీ చెవిటి చెవిలో పడినప్పుడు, డాక్టర్ ముఖర్జీ జమ్మూ కాశ్మీర్ సంపూర్ణ సమైక్యత కోసం ఉద్యమానికి మద్దతు ఇవ్వాలని నిర్ణయించుకున్నారు. అందుకోసం అత్యున్నత త్యాగం చేయడం ద్వారా, ఆయన ఆ రాష్ట్రం కోల్పోకుండా కాపాడారు.  ఫలితంగా స్వతంత్ర భారతదేశం బాల్కనైజేషన్, విచ్ఛిన్నతను నిరోధించారు.

జమ్మూ సరిహద్దు వరకు ఆయనతో పాటు వచ్చిన ఆయన సన్నిహిత రాజకీయ శిష్యులలో ఒకరైన  అటల్ బిహారీ వాజ్‌పేయి ఆయనను ‘భారత ఐక్యత, సమగ్రతకు కారణమైన మొదటి అమరవీరుడు’ అని కొనియాడారు.

డాక్టర్ ముఖర్జీ ఈ మూడు చారిత్రక జోక్యాలు భారతదేశ చరిత్ర  గమనాన్ని మార్చాయి; ఇవి భారతదేశంలో కొన్ని భాగాలను దేశం నుండి విడిపోకుండా కాపాడాయి. భారతదేశం ఐక్యతను సుస్థిరం చేశాయి. తద్వారా భారత్ ను రక్షించాయి. భారత రాజకీయ మట్టిలో లోతైన మూలాలతో నూతన రాజకీయ దృక్పధానికి మార్గం సుగమం చేశాయి.