మిజోరాం గవర్నర్ గా హరిబాబు, హర్యానాకు దత్తాత్రేయ 

విశాఖపట్నం మాజీ లోక్ సభ సభ్యుడు, ఏపీ బీజేపీ మాజీ అధ్యక్షుడు డా  కంభంపాటి హరిబాబును మిజోరాం గవర్నర్ గా నియమించారు. ఆయన ప్రస్తుతం బిజెపి జాతీయ కార్యవర్గ సభ్యునిగా ఉన్నారు.  కాగా, హిమాచల్ ప్రదేశ్ గవర్నర్ గా ఉన్న బండారు దత్తాత్రేయను బదిలీ చేస్తూ హర్యానా గవర్నర్ గా నియమించారు. 

కేంద్ర మంత్రివర్గంలో మార్పులు చేయనున్న సమయంలో ఎనిమిది రాష్ట్రాలకు గవర్నర్ లను నియమిస్తూ రాష్ట్రపతి రామనాథ్ గోవింద్ నేడు ఉత్తరువులు జారీచేశారు. వారు పదవీ బాధ్యతలు చేపట్టినప్పటి నుండి ఉత్తరువులు అమలులోకి వస్తాయని అందులో పేర్కొన్నారు. 

 కేంద్ర సాంఘి న్యాయం, సాధికారిత మంత్రి  థావ‌ర్ చంద్ గెహ్లాట్ ను కర్ణాటక గవర్నర్ గా నియమించారు. ఆయన 2019 నుండి రాజ్యసభ నాయకుడిగా కూడా వ్యవహరిస్తున్నారు. ఈ నెల 19 నుండి పార్లమెంట్ సమావేశాలు  ప్రారంభం అవుతున్న దృష్ట్యా ఆయన స్థానంలో మరొకరిని రాజ్యసభ నాయకుడిగా నియమించవలసి ఉంది. 

గుజరాత్ కు చెందిన బీజేపీ నాయకుడు మంగూభాయ్ ఛ‌గ‌న్‌భాయ్ ప‌టేల్ ను మధ్యప్రదేశ్ గవర్నర్ గా నియమించారు. గోవా అసెంబ్లీ మాజీ స్పీకర్, బిజెపి నేత రాజేంద్ర విశ్వ‌నాథ్ ను హిమాచల్ ప్రదేశ్ గవర్నర్ గా నియమించారు.

మిజోరం గ‌వ‌ర్న‌ర్‌గా కొన‌సాగుతున్న పీఎస్ శ్రీధ‌ర‌న్ పిళ్లై గోవా గ‌వ‌ర్న‌ర్‌గా, హ‌ర్యానా గ‌వ‌ర్న‌ర్‌గా కొన‌సాగుతున్న స‌త్య‌దేవ్ నారాయ‌ణ్ త్రిపుర గ‌వ‌ర్న‌ర్‌గా, త్రిపుర గ‌వ‌ర్న‌ర్‌గా కొన‌సాగుతున్న ర‌మేశ్ బైస్ జార్ఖండ్ గ‌వ‌ర్న‌ర్‌గా నియామ‌కం అయ్యారు.

ఇలా ఉండగా, కేంద్ర మంత్రివ‌ర్గ విస్త‌ర‌ణకు ముహుర్తం ఖ‌రారైంది. ఈ నెల 8వ తేదీన కేంద్ర మంత్రివ‌ర్గ విస్త‌ర‌ణ చేప‌ట్ట‌నున్నారు. ఆ రోజు ఉద‌యం 10 నుంచి 11 గంట‌ల మ‌ధ్య మంత్రివ‌ర్గ విస్త‌ర‌ణ కార్య‌క్ర‌మం జ‌రిగే అవ‌కాశం ఉంది. కొత్త‌గా 22 మందికి కేంద్ర కేబినెట్‌లో చోటు ల‌భించ‌నున్న‌ట్లు తెలుస్తోంది.

ప‌లువురు మంత్రుల శాఖ‌ల్లోనూ మార్పులు జ‌రిగే అవ‌కాశం ఉంది. ఈ నేప‌థ్యంలో త్వ‌ర‌లో అసెంబ్లీ ఎన్నిక‌లు జ‌ర‌గ‌బోయే రాష్ట్రాల‌కు ప్ర‌ధాని మోదీ అత్యంత ప్రాధాన్య‌త ఇస్తున్న‌ట్లు స‌మాచారం. కేంద్ర కేబినెట్‌లో మొత్తం 81 మంది మంత్రుల‌కు అవ‌కాశం ఉండ‌గా, ప్ర‌స్తుతం 53 మందితోనే కేంద్ర కేబినెట్ కార్య‌క‌లాపాలు కొన‌సాగుతున్నాయి. మిగ‌తా 28 స్థానాల‌ను భ‌ర్తీ చేసే అవ‌కాశం ఉంది.