సుమలతపై కుమారస్వామి అనుచిత వ్యాఖ్యలపై కలకలం

మహిళా ఎంపిపై మాజీ ముఖ్యమంత్రి కుమారస్వామి అనుచిత వ్యాఖ్యలు చేశారు. ఈ వ్యాఖ్యలు కన్నడ రాజకీయాల్లో తీవ్ర కలకలం రేపాయి. మాండ్య పార్లమెంటరీ నియోజకవర్గానికి ప్రముఖ సినీ నటి సుమలత స్వతంత్ర ఎంపిగా ఉన్నారు. మాండ్య జిల్లాలోని కృష్ణరాజసాగర్ డ్యామ్ గేట్లు లీక్ కావడంతో నీరు వృధాగా పోతుంది.

కృష్ణరాజసాగర్ (కెఆర్‌ఎస్) జలాశయం చుట్టూ గనుల తవ్వకంతో పాటు అక్రమంగా ఇసుకను తరలిస్తుండడంతోనే డ్యామ్‌కు పగుళ్లు ఏర్పడ్డాయని ఎంపి సుమలత ఆరోపణలు చేశారు. దీంతో జలవనరుల విభాగం ముఖ్య ఇంజనీర్ల పర్యవేక్షణలో తనిఖీలు నిర్వహించింది. పగుళ్లు లేవని ఆ కమిటీ తేల్చింది. ‘ముఖ్యమంత్రిగా కొనసాగారు. కనీస జ్ఞానం కూడా లేదు. ప్రజలు ఎవరికి బుద్ధి చెప్పారో దేశమంతా తెలుసు’ అని సుమలత పేర్కొన్నారు.

దీనిపై సోమవారం బెంగళూరులో కుమారస్వామి మీడియాతో మాట్లాడుతూ కేఆర్‌ఎస్‌ ప్రాజెక్టు నుంచి నీరు లీకవుతోందని సుమలత తరచుగా మాట్లాడుతున్నారని, జలాశయం రక్షణను ఆమె పర్యవేక్షిస్తున్నట్లుగా ఉందని ఎద్దేవా చేశారు. లీకేజీలు నిలిచిపోవాలంటే సుమలతను అడ్డుగా పడుకోబెట్టాలని అనుచితంగా మాట్లాడారు.

ఈ వాఖ్యలు ఇప్పుడు కన్నడ రాజకీయాలలో కలకలం రేపుతున్నాయి. గతంలో రాష్ట్రానికి సిఎంగా ఉన్న వ్యక్తి ఇలాంటి వ్యాఖ్యలు చేయడమేంటని మహిళ సంఘాలు, బిజెపి నేతలు మండిపడుతున్నారు. మహిళలకు ఇచ్చే గౌరవం ఇదేనా అని సుమలత ఆగ్రహం వ్యక్తం చేశారు.

మహిళపై అసభ్యపదజాలం వాడిన వ్యక్తి సిఎంగా ఎలా పని చేశారని ఆమె దుయ్యబట్టారు. తాను కూడా దిగజారి మాట్లాడితే తనకు, ఆయనకు తేడా ఏముంటుందని ప్రశ్నించారు. మహిళపై వ్యక్తిగత దాడికి దిగడం సరైన విషయం కాదని ఆమె హితవు చెప్పారు.  మండ్యలో అక్రమ మైనింగ్‌కు పాల్పడింది ఎవరనేది బహిరంగ రహస్యమని ఎద్దేవా చేశారు. మాండ్య పార్లమెంటరీ ఎన్నికలలో మాజీ సిఎం కుమారా స్వామి తనయుడు నిఖిల్‌పై సుమలత విజయం సాధించడంతో ఇలాంటి వ్యాఖ్యలు చేసి ఉంటారని భావిస్తున్నారు.