ఉత్తరాకాండ్ సీఎం రావత్ రాజీనామా

ఉత్తరాఖండ్‌లో రాజ్యాంగ సంక్షోభం ఏర్పడిన నేపథ్యంలో ముఖ్యమంత్రి తీరథ్ సింగ్ రావత్ శుక్రవారం తన పదవికి రాజీనామా చేశారు. త్రివేంద్ర సింగ్ రావత్ స్థానంలో ముఖ్యమంత్రి పదవి చేపట్టిన 4 నెలల లోపలే ఆయన రాజీనామా చేశారు.
తాను ముఖ్యమంత్రి పదవికి రాజీనామా చేశానని, రాజ్యాంగ సంక్షోభాన్నినివారించడం కోసం గవర్నర్ కు రాజీనామా సమర్పించిన్నట్లు వెల్లడించారు ఇప్పటి వరకు తనకు అనేక అవకాశాలు కల్పిస్తున్న బిజెపి కేంద్ర నాయకత్వంకు, ప్రధాని నరేంద్ర మోదీకి ఆయన కృతజ్ఞతలు తెలిపారు.
 
రాష్ట్రంలో నాయకత్వం మార్పుపై కొన్ని రోజులనుండి వస్తున్న కథనాలకు స్వస్తి పలుకుతూ రాత్రి ఢిల్లీ నుండి రాష్ట్ర రాజధానికి చేరుకోగానే రాత్రి 11 గంటలకు ఆయన గవర్నర్ బేబీ రాణి మౌర్యకు రాజీనామా సమర్పించారు. రాజీనామా అందుకోగానే ముఖ్యమంత్రి తీరథ్ సింగ్ రావత్ తన పదవికి రాజీనామా సమర్పించారని అంటూ  గవర్నర్ ట్వీట్ చేశారు.
 
వాస్తవానికి ఆయన మూడు రోజులుగా ఢిల్లీలో బిజెపి పెద్లతో మంతనాలు జరుపుతున్నారు. ఈ నేపథ్యంలో కొత్త నాయకుడిని ఎన్నుకోవడానికి బిజెపి ఎంఎల్‌ఎలు శనివారం మధ్యాహ్నం 3 గంటలకు సమావేశం కానున్నారు.  గఢ్‌వాల్‌ ఎంపీ అయిన తీరథ్‌ సింగ్‌ రావత్‌ అనూహ్యంగా మార్చి 10న తివేంద్ర సింగ్‌ రావత్‌ స్థానంలో కొత్త సీఎంగా ప్రమాణ స్వీకారం చేశారు.

ఆ రాష్ట్రం నుంచి ఎన్నికైన ఎమ్మెల్యే కాని ఆయన ఎంపీగానే కొనసాగుతున్నారు. రాజ్యాంగం ప్రకారం ముఖ్యమంత్రిగా ప్రమాణం చేసిన వారు ఆరు నెలల లోపు రాష్ట్ర అసెంబ్లీ లేదా శాసన మండలికి ఎన్నిక కావాల్సి ఉంటుంది.  ఉత్తరాఖండ్‌కు శాసన మండలి లేదు. ఉప ఎన్నికల్లో పోటీ చేసేందుకు తీరథ్‌కు సెప్టెంబర్‌ 10 వరకు గడువు ఉన్నది.

రాష్ట్రంలోని గంగోత్రి, హల్ద్వానీ అసెంబ్లీ స్థానాలకు ఉప ఎన్నికలు జరుగాల్సి ఉన్నది. అయితే కరోనా పరిస్థితుల్లో ఈ ఏడాది నాలుగు రాష్ట్రాలు, ఒక కేంద్ర పాలిత ప్రాంతంలో ఎన్నికలు నిర్వహించడంపై ఈసీ పెద్ద ఎత్తున విమర్శలు ఎదుర్కొంది. ఈ నేపథ్యంలో ఉత్తరాఖండ్‌లో ఉప ఎన్నికలు జరిగే అవకాశాలు చాలా తక్కువ. ప్రజా ప్రాతినిధ్య చట్టంలోని సెక్షన్ 151ఏ ప్రకారం లోక్‌సభ, శాసన సభ స్థానాలు ఖాళీ అయినప్పటి నుంచి ఆరు నెలల్లోగా ఎన్నికలను ఎన్నికల కమిషన్ నిర్వహించాలి. అయితే కొత్తగా ఎన్నికయ్యే ఎమ్మెల్యే లేదా ఎంపీ పదవీ కాలం కనీసం ఒక సంవత్సరం ఉండాలి.

కానీ ఉత్తరాఖండ్ శాసన సభ పదవీ కాలం సుమారు తొమ్మిది నెలలే మిగిలింది. ఇటువంటి పరిస్థితుల్లో ఉప ఎన్నికలను తప్పనిసరిగా నిర్వహించాలని ఎన్నికల కమిషన్‌ను ఆదేశించే చట్టం ఏదీ లేదని, అదేవిధంగా ఎన్నికల కమిషన్ ఉప ఎన్నికలను నిర్వహించాలనుకుంటే నిరోధించే నిబంధనలు కూడా లేవని బీజేపీ వర్గాలు చెప్తున్నాయి. 

ఈ నేపథ్యంలో ఉత్తరాఖండ్‌లో నెలకొన్న ఈ అనిశ్చితిని తొలగించేందుకు కొత్త సీఎంను నియమించాలని బీజేపీ యోచిస్తున్నది. బీజేపీ జాతీయాధ్యక్షుడు జేపీ నడ్డా, కేంద్ర హోం మంత్రి అమిత్‌ షాతో బుధవారం రాత్రి భేటీ అయిన ఆయన.. శుక్రవారం మరోసారి నడ్డాను కలిశారు.

ఈ నేపథ్యంలో.. ప్రజాప్రతినిధుల చట్టం-1951 ప్రకారం ఆరు నెలల్లో ఎమ్మెల్యేగా ఎన్నికయ్యే పరిస్థితి లేనందున.. రాజీనామా చేయాలని నడ్డా ఆయనకు చెప్పినట్లు తెలుస్తోంది. ఈ క్రమంలో రావత్‌ శుక్రవారం మధ్యాహ్నం ఢిల్లీలో బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డాను కలిసి తన రాజీనామా లేఖను ఇచ్చినట్లు తెలుస్తున్నది. 

ఈ నేపథ్యంలో తదుపరి ముఖ్యమంత్రి ఎవరన్న చర్చ జరుగుతోంది. ముఖ్యంగా రెండు పేర్లు అధిష్ఠానం పరిశీలనలో ఉన్నట్లు తెలుస్తున్నది. వీరిద్దరూ సీనియర్ నాయకులే. ఒకరు సత్పాల్ సింగ్,  రెండో పేరు ధన్‌సింగ్ రావత్.