రాష్ట్ర ప్రభుత్వాలు పెట్రోల్‌పై పన్ను భారం తగ్గించవచ్చు

పెట్రోల్‌, డీజిల్‌ ధరల పెరుగుదలకు కేంద్రమే కారణమంటూ ప్రతిపక్షాలు పదే పదే ఆడిపోసుకోవడాన్ని కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్‌ తప్పుబట్టారు. బెంగళూరులో మీడియాతో మాట్లాడుతూ వాస్తవాలు గుర్తెరిగి మాట్లాడాలని, ప్రజలలో గందరగోళం సృష్టించవద్దని ఆమె హితవు పలికారు. 
 
అంతర్జాతీయంగా ముడి చమురు ధరలు పెరగడం వల్లే పెట్రో ఉత్పత్తుల ధరలు అనివార్య స్థితిలో పెంచాల్సి వస్తోందని ఆమె పేర్కొన్నారు. బ్యారెల్ ధర 76 డాలర్లకు చెరుకున్నదని ఆమె చెప్పారు.  ప్రజలపై భారం మోపాలన్నది కేంద్ర ప్రభుత్వ ఉద్దేశం కానే కాదని ఆమె స్పష్టం చేశారు. 
ఆయా రాష్ట్ర ప్రభుత్వాలు పెట్రోల్‌, డీజిల్‌పై పన్నులు తగ్గించే అవకాశం ఉందని, తద్వారా ప్రజలపై కొంతమేరకు భారాన్ని తగ్గించవచ్చునని ఆమె సూచించారు. ప్రజలపై పన్నుల భారం తగ్గించదానికి కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు కలసి పనిచేయాలని ఆమె స్పష్టం చేశారు. పెట్రోల్ ధరలపై కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు విడి,విడిగా పన్నులు వేస్తున్నాయని ఆమె గుర్తు చేసారు.
ఏ రాష్ట్ర ప్రభుత్వానికీ నిధుల కేటాయింపులో అన్యాయం జరగనీయమని ఆర్ధిక మంత్రి భరోసా ఇచారు. జీఎస్టీలో రాష్ట్రాల వాటాను ఎట్టి పరిస్థితుల్లోనూ కేంద్రం నిలుపుదల చేయదని ఆమె స్పష్టం చేసారు. అయితే జీఎస్టీ పై నిర్ణయాలు తీసుకోవలసింది జిఎసీ కౌన్సిల్ అని, కేంద్ర ప్రభుత్వం కాదని ఆమె తెలిపారు.
కొవిడ్‌ అనంతరం రాష్ట్రాల ఆర్థిక పరిస్థితి జఠిలంగా ఉన్న మాట నిజమేనని సీతారామన్‌ అంగీకరించారు. సాధ్యమైన మేరకు ఆర్థిక ఇబ్బందుల్లో ఉన్న అన్ని రాష్ట్రాలను ఏదో ఒక రూపంలో ఆదుకుంటూనే ఉన్నామని తెలిపారు.

రెండేళ్లుగా కొవిడ్‌ మహమ్మారితో పోరాడాల్సి రావడం, భారీగా ఆర్థిక ప్యాకేజీలు ప్రకటించడం వంటి అంశాలను ఆమె గుర్తు చేశారు.  నూతన ఆదాయ పన్ను పోర్టల్ లో కొన్ని సమస్యలు తలెత్తాయని ఆర్ధిక మంత్రి అంగీకరించారు. ఈ లోపాలను సరిదిద్దే ప్రయత్నంలో ఇన్ఫోసిస్ ఉన్నదని ఆమె చెప్పారు.

కాంగ్రెస్‌ ప్రభుత్వ హయాంలో కుంభకోణాలు ప్రతినెలా జరిగేవని, అలాంటి పరిస్థితి ఇప్పుడు లేదని ఆర్ధిక మంత్రి  స్పష్టం చేశాన్నారు. అవినీతి, అక్రమాలపై మాట్లాడే అధికారం కాంగ్రె్‌సకు లేదని ఆమె ధ్వజమెత్తారు. ప్రతిపక్ష నేత సిద్దరామయ్య గతంలో చేసిన ఆరోపణలను ఆమె తోసిపుచ్చారు.

కొవిడ్‌ అనంతర పరిస్థితులను అధిగమించడంలో రాష్ట్ర ప్రభుత్వం చక్కగా పనిచేస్తోందని కితాబునిచ్చారు. ఇందుకు ప్రభుత్వం ప్రకటించిన ప్యాకేజీలే కారణమని ఆమె తెలిపారు. చిన్న, మధ్య తరహా పరిశ్రమలు, రైతాంగం, కార్మికులను దృష్టిలో ఉంచుకుని కేంద్రం ఇటీవల అనేక కీలక నిర్ణయాలు తీసుకున్న సంగతిని కేంద్ర మంత్రి గుర్తు చేశారు.

బెంగుళూరులోని బయోటెక్,  స్తర్త్స్ అప్ నేతలతో సమావేశమవుతూ శాస్త్రీయ పరిశోధనలలో వివిధ శాఖల మధ్య సమంవ్యం కోసం కేంద్రం ప్రయత్నిస్తున్నదని నిర్మల సీతారామన్ తెలిపారు. ఈ పరిశ్రమలకు అనువైన వాతావరణం ఏర్పర్చడం కోసం కర్ణాటక ప్రభుత్వం చేస్తున్న కృషిని ఆమె కొనియాడారు. ఈ సమావేశంలో బయోటెక్నాలజీ విజన్ గ్రూప్ చైర్ పర్సన్ కిరణ్ మజుందార్ షా, స్టార్ట్స్ విజన్ గ్రూప్ చైర్మన్ ప్రశాంత్ ప్రకాష్ తదితరులు పాల్గొన్నారు.