రాష్ట్రపతి పదవికి శరద్ పవర్ వ్యూహాత్మక అడుగులు

చలసాని నరేంద్ర

మరో రెండేళ్లలో జరిగే రాష్ట్రపతి ఎన్నికలలో ఏకగ్రీవంగా ఎన్నిక కావడానికి మాజీ ఉప  ప్రధాన మంత్రి,  నేషనలిస్ట్ కాంగ్రెస్ పార్టీ అధినేత శరద్ పవర్  వ్యూహాత్మకంగా అడుగులు వేస్తున్నట్లు కనిపిస్తున్నది. ఒక వైపున కాంగ్రెసేతర పక్షాలను ఒక దరికి చేర్చడం ద్వారా, వాటి మద్దతును కూడదీసుకోవడంతో పాటు, కాంగ్రెస్ మద్దతు ఇవ్వకుండా ఉండలేని పరిస్థితులు కల్పించడం ద్వారా, బిజెపికి సొంత బలంపై రాష్ట్రపతి అభ్యర్థిని గెలిపించుకునే పరిస్థితి లేని పక్షంలో, అందరూ తన అభ్యర్ధిత్వంకు అందరు మద్దతు ఇచ్చే విధంగా చేసుకోవాలని చూస్తున్నట్లున్నది.

తన మనసులో అభిప్రాయాలను బయటకు వ్యక్తం కానీయకుండా రాజకీయ ఎత్తుగడలు వేయడంలో శరద్ పవర్ అసాధ్యులు. తన పార్టీ ప్రాబల్యం, తన రాజకీయ బలం చాల పరిమితమైనప్పటికీ, దేశంలోనే ఒక గొప్ప నాయకుడిగా, రాజకీయంగా విశేషమైన పలుకుబడిని సొంతం చేసుకోగలుగుతున్నారు. దాదాపు అన్ని పార్టీల నాయకులతో వ్యక్తిగత సంబంధాలను ఏర్పాటు చేసుకొంటున్నారు.

ఆయన రాజకీయ పలుకుబడి మహారాష్ట్రకు పరిమితమైనప్పటికీ, చాలాకాలంగా ఆయన చూపులు అన్ని జాతీయ స్థాయిలో కీలక భూమిక వహించడం వైపే ఉన్నాయి. 1991లో రాజీవ్ గాంధీ మరణం అనంతరం కాంగ్రెస్ అధ్యక్ష పదవి, ఆ తర్వాత ప్రధాన మంత్రి పదవికి విశ్వ ప్రయత్నాలు చేశారు. అయితే ఆయనకు ఒక సారి ఆ పదవులు అప్పగిస్తే, వాటిలో శాశ్వతంగా పాతుకుపోతారని ఆ నాటి కాంగ్రెస్ లోని సీనియర్ నాయకులు అంతా భయపడ్డారు.

అందుకనే ఎంతో బలహీనుడిగా భావించి పివి నరసింహారావును ఎంపిక చేసుకున్నారు. వాస్తవానికి ఆ ఎన్నికలలో ఎంపీగా గెలుపొందితే  గాంధీ కుటుంబానికి విశ్వాస పాత్రుడైన ఎన్ డి తివారి ప్రధాన మంత్రి పదవి చేపట్టి ఉండేవారు. పివి నరసింహారావు సహితం `లోపలి మనిషి’. తన మనసులో భావాలను బైటకు అర్ధం కానివ్వరు. అందుకనే కాంగ్రెస్ లో ఆయనను కూడా ఎవ్వరు నమ్మలేదు.

పివి నరసింహారావు తర్వాత అయినా కాంగ్రెస్ సారధ్యం లభిస్తుందని ఎదురు చూసిన శరద్ పవర్ ఆ పార్టీలో ఉండగా తనకు సోనియా గాంధీ ఉన్నంతవరకు ప్రాధాన్యత ఉండబోదని గ్రహించి ఆమె `విదేశీయత’ను ప్రశ్నిస్తూ, ఆమె పై తిరుగుబాటు జరిపారు. నేషనలిస్ట్ కాంగ్రెస్ పార్టీని ఏర్పాటు చేసుకొని, కనీసం 50 లోక్ సభ సీట్లు గెలుపొందడం ద్వారా సంకీర్ణ ప్రభుత్వాల యుగంలో ప్రధాన మంత్రి పదవి చేపట్టవచ్చని ఆశపడ్డారు.

అయితే ఆ నాడు వాజపేయి సారధ్యంలో ఎన్డీయే సుస్థిర ప్రభుత్వం ఏర్పడడంతో ఆయనకు అటువంటి అవకాశం లేకుండా పోయింది. తిరిగి కాంగ్రెస్ కే ప్రభుత్వం ఏర్పాటు చేసే అవకాశం లభించడంతో, ఆ పార్టీకి దూరంగా ఉంటూ ఏమీ చేయలేనని గ్రహించి, యుపిఎ ప్రభుత్వాలలో భాగస్వామిగా, కేంద్ర మంత్రిగా కొనసాగారు.

ఆ సమయంలో మహారాష్ట్రలో సహితం తన పార్టీకి ముఖ్యమంత్రి పదవి దక్కకుండా చేయడంతో, వ్యూహం మార్చి ప్రస్తుతం శివసేనతో చేతులు కలిపి మహారాష్ట్రలో కాంగ్రెస్ కు నూకలు చెల్లె విధంగా వ్యూహాత్మకంగా వ్యవహరిస్తున్నారు. శరద్ పవర్ కు ప్రధాన మంత్రి నరేంద్ర మోదీతో సన్నిహిత సంబంధాలు ఉన్నట్లు అందరికి తెలిసిందే.

ప్రధాన మంత్రి ఆయన నియోజకవర్గం పర్యటనకు వెళ్లడమే కాకుండా, ఒక రాత్రి ఆయన ఇంట్లో బస చేశారు. ఇప్పటి వరకు బిజెపి నాయకల ఇళ్లల్లో కూడా ఆయన ఎక్కడా బస చేయలేదు. ఇదివరలో, ,బిజెపి, శివసేన విడివిడిగా పోటీచేసి, బిజెపికి పూర్తి ఆధిక్యత లభించనప్పుడు ప్రభుత్వం ఏర్పాటుకు ఆ పార్టీకి బేషరతుగా మద్దతు ఇవ్వడానికి పవర్ ముందుకు రావడం తెలిసిందే.

బిజెపి, శివసేన ఇద్దరు కలసి పోటీ చేసినప్పుడు కూడా ముఖ్యమంత్రి పదవిపై వారిద్దరి మధ్య పేచీ ఏర్పడి, ప్రతిష్టంభన ఏర్పడిన సమయంలో పవర్ చొరవ తీసుకొని, శివసేన, కాంగ్రెస్ పార్టీలను దగ్గరకు చేర్చి, ప్రభుత్వం ఏర్పాటుకు దోహదపడ్డారు. ఈ సమయంలో కాంగ్రెస్ అధిష్ఠానం ఆదేశాలను రాష్ట్ర కాంగ్రెస్ ఎమ్యెల్యేలు దిక్కరించేటట్లు చేశారు.

ప్రస్తుతం మహారాష్ట్రలో అధికారంలో ఉన్న మహా వికాస్ అగాఢీలో శివసేన, ఎన్సీపీ లతో పాటు భాగస్వామి అయిన కాంగ్రెస్ పార్టీని రాజకీయంగా సమాధి చేయడం కోసం ఆ రెండు  పార్టీలు వ్యూహాత్మకంగా అడుగులు వేస్తున్నట్లు కనిపిస్తున్నది. వచ్చే శాసనసభ ఎన్నికలలో శివసేన, ఎన్సీపీ కలసి పోటీచేసే అవకాశం ఉన్నట్లు  శివసేన తన అధికారిక పత్రిక సామ్నాలో పేర్కొనడం రాష్ట్ర రాజకీయాలలో సంచలనం కలిగిస్తున్నది.

మరోవంక, తమను ధిక్కరించి, కాంగ్రెస్ తో చేతులు కలిపినా శివసేన అధినేత ఉద్ధవ్ థాకరేతో ప్రధాని మోదీ మంచి సంబంధాలు కలిగి ఉండడం గమనార్హం. ప్రధాని మోదీ అభీష్టం మేరకే మహారాష్ట్రలో కాంగ్రెస్ ను సమాధి చేయడానికి శరద్ పవర్ వ్యూహాత్మకంగా వ్యవహరిస్తున్నట్లు స్పష్టం అవుతున్నది.

ఇంకోవైపు, దేశవ్యాప్తంగా ఉన్న పలు ప్రతిపక్ష పార్టీల సీనియర్‌ నేతలు శరద్‌పవార్‌ ఇంట్లో గత నెలలో భేటీ జరిపారు. అసలు ఈ భేటీ ఎందుకు జరిపామో కూడా స్పష్టత ఇవ్వలేక పోతున్నారు. ఈ భేటీలో కాంగ్రెస్ గైరాజరు కావడం గమనిస్తే జాతీయ రాజకీయాలలో కాంగ్రెస్ ను ఒంటరిగా చేయడమే లక్ష్యంగా కనిపిస్తున్నది.

బెంగాల్ ఎన్నికలు పూర్తి కాగానే జాతీయ ప్రత్యామ్న్యాయంగా మమతా బెనర్జీని ప్రధాని అభ్యర్థిగా ముందుకు తీసుకు రావడం కోసం పవర్ వ్యూహాత్మకంగా అడుగులు వేస్తున్నట్లు కధనాలు వెలువడ్డాయి. అదే జరిగితే కాంగ్రెస్ పార్టీని, ఆ పార్టీ అధినేత రాహుల్ గాంధీని జాతీయ రాజకీయాలలో పక్కకు త్రోసివేయడమే కాగలదు.

దేశంలో ఇప్పటికి 200 నియోజకవర్గాలలో బిజెపితో నేరుగా తలబడుతున్నది కాంగ్రెస్ పార్టీ మాత్రమే. ఆ పార్టీ నాయకత్వ సమస్యను పరిష్కరించుకొని, బలమైన పొటీ  ఇవ్వగలిగితేనే ప్రధాని మోదీకి జాతీయ స్థాయిలో ప్రత్యామ్న్యాయంగా ప్రజల ముందుకు రాగలదు. లేని పక్షంలో మరే ప్రాంతీయ నాయకుడు జాతీయ స్థాయిలో ప్రత్యామ్న్యాయం కాగలిగిన పరిస్థితులు లేవు.

ఇతర పార్టీల నేతలకు రాహుల్ ను దూరం చేయడంలో శరద్ పవర్ సహితం వ్యూహాత్మకంగా వ్యవహరిస్తున్నారు. పవర్ చేస్తున్న ప్రయత్నాలు అన్ని 2024 ఎన్నికలలో ప్రధాని మోదీకి గట్టి ప్రతిఘటన లేకుండా చేయడానికి దారితీసే అవకాశాలు ఉన్నాయి. అందుకు ప్రతిఫలంగా మరో రెండేళ్లలో జరిగే రాష్ట్రపతి ఎన్నికలలో బిజెపి మద్దతుతో రాష్ట్రపతి పదవి అధిష్టించాలని పవర్ ఎత్తుగడలు వేస్తున్నట్లు కనిపిస్తున్నది.

తమ పార్టీ వారిని కాకుండా పవర్ కు బిజెపి మద్దతు ఇవ్వాలి అంటే,  రాష్ట్రాల అసెంబ్లీలలో బిజెపి బలం గణనీయంగా తగ్గాలి. ముఖ్యంగా మరి కొద్దీ నెలల్లో జరిగే ఉత్తర ప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికలలో బిజెపి బలం తగ్గితే  రాష్ట్రపతి ఎన్నికలలో తమ సొంత అభ్యర్థిని గెలిపించుకోవడం బిజెపికి దాదాపు అసాధ్యం కాగలదు. అటువంటి సమయంలో రాజీ అభ్యర్థిగా శరద్ పవర్ కు మద్దతు ఇవ్వడం ఆ పార్టీకి ఇబ్బందికరం కాబోదు.

అటువంటి పరిస్థితుల కోసమే శరద్ పవర్ ఇప్పుడు ఎదురు చూస్తున్నట్లు కనిపిస్తున్నది. మమతా బెనర్జీ, ఎం కె స్టాలిన్, అరవింద్ కేజ్రీవాల్ వంటి నేతలతో పాటు వామపక్షాలు సహితం పవర్ కు మద్దతు ఇవ్వడానికి సిద్ధంగా ఉంటాయి. అటువంటప్పుడు కాంగ్రెస్ కు సహితం మరో మార్గం ఉండబోదు.

ఎన్నికల వ్యూహకర్త ప్రశాంత్ కిషోర్ తో వరుసగా శరద్ పవర్ జరుపుతున్న భేటీలు 2024 ఎన్నికల వ్యూహం గురించి అని చెబుతున్నప్పటికీ అసలు ఉద్దేశ్యం రాష్ట్రపతి పదవికి ఎన్నిక కావడం కోసం అనువైన రాజకీయ వాతావరణాన్నిఏర్పరుచు కోవడమే అని భావించవలసి వస్తున్నది. పైగా, బహుశా ఆయనకు రాజకీయంగా అధికార పదవి చేపట్టడానికి ఇదే చివరి అవకాశం కావచ్చు.