దీటైన టెక్నాలజీ అభివృద్ధికి ఆరు వేదికలు

కేంద్ర భారీ పరిశ్రమలు, పబ్లిక్ ఎంటర్‌ప్రైజెస్ శాఖ మంత్రి ప్రకాశ్ జవదేకర్ శుక్రవారం ఆరు టెక్నాలజీ ఇన్నోవేషన్ ప్లాట్‌ఫామ్స్‌ను వర్చువల్ విధానంలో ప్రారంభించారు. ప్రపంచ స్థాయి పోటీని తట్టుకునేవిధంగా భారత దేశంలో తయారీ రంగాన్ని తీర్చిదిద్దేందుకు అవసరమైన సాంకేతిక పరిజ్ఞానాన్ని అభివృద్ధి చేయడంపై ఈ ఆరు వేదికలు దృష్టి సారిస్తాయి.

కేపిటల్ గూడ్స్ సెక్టర్‌లో భారత దేశానికి అవసరమైన పరిష్కారాలను కనుగొనేందుకు ఆరు టెక్నాలజీ ఇన్నోవేషన్ వేదికలను ప్రారంభించినట్లు ప్రకాశ్ జవదేకర్ ఓ ట్వీట్‌లో తెలిపారు. హై-ఎండ్ టెక్నాలజీలో నవకల్పనలు భారత దేశానికి సంపదను సృష్టిస్తాయని తెలిపారు. 

పరిశోధన, నవకల్పన రంగాల్లో పెట్టుబడులను పెంచడంపై ప్రధాన మంత్రి నరేంద్ర మోదీకి విజన్, మిషన్ ఉన్నాయని పేర్కొన్నారు.  75వ స్వాతంత్ర్య దినోత్సవాలను జరుపుకోబోతున్న తరుణంలో ఈ ఆరు వేదికలు దేశానికి గొప్ప బహుమతి వంటివని పేర్కొన్నారు. అన్ని రకాల సాంకేతిక వనరులను, సంబంధిత పరిశ్రమలను ఒకే వేదికపైకి తీసుకురావడానికి ఇవి దోహదపడతాయని తెలిపారు.

దీనివల్ల భారతీయ పారిశ్రామిక రంగం ఎదుర్కొంటున్న సాంకేతిక సమస్యలను గుర్తించడానికి వీలవుతుందని తెలిపారు. ఆ సమస్యలకు పరిష్కారాలను కనుగొనడం సాద్యమవుతుందని చెప్పారు. స్వయంసమృద్ధ భారత్ విజన్‌ను సాధించేందుకు ఈ వేదికలు దోహదపడతాయన్నారు. ఈ వేదికపై వచ్చే ‘గ్రాండ్ ఛాలెంజెస్’ ద్వారా దేశీయంగా ‘మదర్’ మాన్యుఫ్యాక్చరింగ్ టెక్నాలజీస్‌ను అభివృద్ధిపరచవచ్చునని తెలిపారు.

మన దేశంలో అంతర్జాతీయంగా పోటీ పడగలిగిన తయారీ రంగం అభివృద్ధి చెందుతుందన్నారు. కొత్తవాటిని సృష్టించే దేశం ప్రగతి సాధిస్తుందని, సుసంపన్నమవుతుందని తెలిపారు. ఈ ఆరు వేదికలు స్వయం సమృద్ధ భారత్‌కు మరింత ఊపునిస్తాయన్నారు. ప్రపంచంలో టెక్నాలజీ, ఇన్నోవేషన్ కేంద్రంగా భారత దేశం ఎదిగేందుకు దోహదపడతాయని వివరించారు.

ఈ టెక్నాలజీ ప్లాట్‌ఫామ్స్‌ను ఐఐటీ మద్రాస్, సెంట్రల్ మాన్యుఫ్యాక్చరింగ్ టెక్నాలజీ ఇన్‌స్టిట్యూట్, ఇంటర్నేషనల్ సెంటర్ ఫర్ ఆటోమోటివ్ టెక్నాలజీ, ఆటోమోటివ్ రీసెర్చ్ అసోసియేషన్ ఆఫ్ ఇండియా, బీహెచ్ఈఎల్, హెచ్ఎంటీ అభివృద్ధి చేశాయి. బెంగళూరులోని ఇండియన్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ సైన్స్ సహకారంతో వీటిని అభివృద్ధి చేశాయి. 

మాన్యుఫ్యాక్చరింగ్ టెక్నాలజీకి సంబందించిన సమస్యలను ఈ వేదికలపై చర్చించవచ్చు. ఓఈఎంలు, టైర్-1, టైర్-2, టైర్-3 కంపెనీలు, ముడి సరుకుల తయారీదారులు, స్టార్టప్ కంపెనీలు, డొమెయిన్ నిపుణులు, పరిశోధన, అభివృద్ధి సంస్థలు, కళాశాలలు, విశ్వవిద్యాలయాలు పాల్గొనవచ్చు. 

టెక్నాలజీ సొల్యూషన్స్, సలహాలు, నిపుణుల అభిప్రాయాలను పొందవచ్చు. ఇప్పటికే సుమారు 39 వేల మంది విద్యార్థులు, నిపుణులు, సంస్థలు, పరిశ్రమలు, ప్రయోగశాలలు ఈ వేదికలపై నమోదయ్యాయి.