జులై 19 నుంచి పార్లమెంట్‌ వర్షాకాల సమావేశాలు

పార్లమెంట్‌ వర్షాకాల సమావేశాల తేదీలు ఖరాయ్యాయి. జులై 19 నుంచి ఆగస్టు 13వ తేదీ వరకు పార్లమెంటు సమావేశాలు జరగనున్నాయి. ఈ మేరకు సమావేశాల తేదీలు ఖరారు చేస్తూ నోటిఫికేషన్‌ విడుదలైంది. 

ప్రభుత్వ బిజినెస్‌ను బట్టి ఈ సమావేశాలు ఆగస్టు 13న ముగియవచ్చని ఆ ప్రకటన తెలిపింది. కాగా రాష్ట్రపతి రాంనాథ్ కోవింద్ జూలై 19న సభను సమావేశపర్చాలని ఆదేశించారని, ఈ సమావేశాలు ఆగస్టు 13న ముగుస్తాయని రాజ్యసభ కూడా ఒక ప్రకటనలో తెలియజేసింది. 

సాధారణంగా పార్లమెంటు వర్షాకాల సమావేశాలు జూలై మూడో వారంలో ప్రారంభమై స్వాతంత్య్ర దినోత్సవానికి ముందు ముగుస్తుంటాయి. కాగా జూలై 19నుంచి ఆగస్టు 13 వరకు పార్లమెంటు వర్షాకాల సమావేశాలు నిర్వహించాలని ఇంతకు ముందు పార్లమెంటు వ్యవహారాల కేబినెట్ కమిటీ ప్రభుత్వానికి సిఫార్సు చేసిన విషయం తెలిసిందే.

పార్లమెంట్‌ వర్షాకాల సమావేశాలు సాధారణంగా జులై మూడో వారంలో ప్రారంభమై ఆగస్టు 15వ తేదీ లోపల ముగుస్తుంటాయి. సమావేశాలకు సిద్ధం కావాల్సిందిగా ప్రధానమంత్రి నరేంద్రమోదీ తన సహచర మంత్రివర్గ సభ్యులకు సూచించారు. కరోనా సంక్షోభంపై ప్రతిపక్షాల విమర్శలను సమర్థవంతంగా తిప్పికొట్టేవిధంగా సిద్ధమై రావాలని తమ సబ్యులకు బిజెపి నాయకత్వం ఆదేశాలు జారీచేసింది.

కరోనా మూడో వేవ్  నిలువరించేవిధంగా చేపట్టిన వ్యాక్సినేషన్‌ డ్రైవ్‌పై అవగాహన కలిగి ఉండాలని పేర్కొన్నారు. ఆయా విభాగాల వారీగా అమలు అవుతున్న కేంద్ర సంక్షేమ పథకాలపై సమగ్ర అవగాహనతో రావాలను సూచించారు. అదేవిధంగా దేశ ఆర్థిక వృద్ధికి తగిన సలహాలు, సూచనలు ఇవ్వాల్సిందిగా సహచర మంత్రివర్గ సభ్యులను ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ కోరారు. పార్లమెంట్‌ వర్షాకాల సమావేశాలకు అన్ని ఏర్పాట్లు చేసినట్లు లోక్‌సభ స్పీకర్‌ ఓం బిర్లా తెలిపారు.