తీహార్ జైలు నుంచి విడుదలైన ఓంప్రకాశ్ చౌతాలా

ఉపాధ్యాయ నియామక కుంభకోణం కేసులో 10 సంవత్సరాల జైలు శిక్షను పూర్తిచేసుకుని హర్యానా మాజీ ముఖ్యమంత్రి ఓం ప్రకాశ్ చౌతాలా శుక్రవారం తీహార్ జైలు నుంచి విడుదలయ్యారు. పెరోల్‌పై ఇదివరకే బయటకు వచ్చిన 86 ఏళ్ల చౌతాలా శుక్రవారం తీహార్ జైలుకు వచ్చి అన్ని నియమనిబంధనలను పూర్తి చేసుకుని జైలు నుంచి విడుదలైనట్లు తీహార్ జైలు అధికారులు తెలిపారు.
 
కొవిడ్-19 మహమ్మారిని దృష్టిలో ఉంచుకుని జైళ్లలో రద్దీని తగ్గించాలని నిర్ణయించుకున్న ఢిల్లీ ప్రభుత్వం 10 సంవత్సరాల జైలు శిక్షను ఎదుర్కొంటున్న ఖైదీలలో తొమ్మిదిన్నరేళ్ల జైలు శిక్షను పూర్తి చేసుకున్నవారికి ఆరు నెలల ప్రత్యేక క్షమాభిక్షను ప్రసాదిస్తూ గత నెల ఉత్తర్వులు జారీచేసింది.
 
కాగా, తన 10 ఏళ్ల శిక్షా కాలంలో 9 ఏళ్ల 9 నెలల శిక్షాకాలాన్ని చౌతాలా ఇప్పటికే పూర్తి చేసుకున్నారని, అందుకే ఆయన జైలు నుంచి విడుదలయ్యేందుకు అర్హత పొందారని జైలు అధికారులు తెలిపారు. ఉపాధ్యాయ నియామక కుంభకోణం కేసులో చౌతాలాకు 2013లో జైలు శిక్ష పడింది. 
 
కొవిడ్ కారణంగా 2020 మార్చి 26 నుంచి అత్యవసర పెరోల్‌పై ఉన్నారు. ఈ ఏడాది ఫిబ్రవరి 21న ఆయన జైలులో లొంగిపోవలసి ఉండగా ఆయన పెరోల్‌ను హైకోర్టు పొడిగించింది. 
 
2000 సంవత్సరంలో 3,200 జూనియర్ బేసిక్ టీచర్ల అక్రమ నియామకానికి సంబంధించిన కేసులో ఓపి చౌతాలాతోపాటు ఆయన కుమారుడు అజయ్ చౌతాలా, ఐఎఎస్ అధికారి సంజీవ్ కుమార్‌తోసహా 53 మంది ఇతరులకు 2013 జనవరిలో సిబిఐ కోర్టు శిక్ష విధించింది.