రూ.6.29 లక్షల కోట్ల ఉద్దీపన ప్యాకేజీకి ఆమోదం

కరోనాతో తీవ్రంగా ప్రభావితమైన ఆర్థిక వ్యవస్థకు ఊతమిచ్చేందుకు కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్‌ సోమవారం ప్రకటించిన రూ.6.29 లక్షల కోట్ల ఉద్దీపన ప్యాకేజీకి ప్రధాని నరేంద్ర మోదీ నేతృత్వంలోని కేంద్ర మంత్రివర్గం  ఆమోదముద్ర వేసింది.

కొవిడ్‌ కారణంగా దెబ్బతిన్న రంగాలను ఆదుకోవడంతోపాటు, ఉత్పత్తి పెంపు, ఎగుమతులకు ప్రోత్సాహం, విద్యుత్‌ సంస్కరణలు, ఉపాధి కల్పన, సూక్ష్మ చిన్న తరహా పరిశ్రమలకు అదనపు రుణాలు అందించేలా ఈ ప్యాకేజీని ప్రకటించారు. ఆరోగ్య రంగంలో వైద్య సదుపాయాల అభివృద్ధికి రూ.75 వేల కోట్లు, ఎంఎస్‌ఎంఈలకు రూ.1.5 లక్షల కోట్ల అదనపు రుణాలు, ప్రధానమంత్రి గరీబ్‌ కల్యాణ్‌ యోజనకు రూ.93,869 కోట్లు, ఎరువుల రాయితీకి రూ.14,775 కోట్లు వెచ్చించనున్నారు.

పబ్లిక్‌-ప్రైవేట్‌ భాగస్వామ్య పద్ధతిలో 16 రాష్ర్టాల్లోని గ్రామీణ ప్రాంతాల్లో బ్రాడ్‌బ్యాండ్‌ సేవలు అందించేందుకు భారత్‌నెట్‌ ప్రాజెక్ట్‌కు వయబిలిటీ గ్యాప్‌ ఫండింగ్‌ కింద రూ.19,041 కోట్లు అందించేందుకు మంత్రివర్గం ఆమోదం తెలిపింది. దేశంలోని 6 లక్షల గ్రామాలకు వెయ్యి రోజుల్లోగా బ్రాడ్‌బ్యాండ్‌ కనెక్షన్‌ ఇవ్వనున్నట్టు గతేడాది స్వాత్రంత్య దినోత్సవ ప్రసంగంలో ప్రధాని ప్రకటించిన విషయం తెలిసిందే. ఈ ప్రాజెక్టు మొత్తం వ్యయం రూ.29,430 కోట్లు కాగా, వయబిలిటీ గ్యాప్‌ ఫండింగ్‌ కింద కేంద్రం 19,041 కోట్లు కేటాయించనున్నట్టు కేంద్రమంత్రి రవిశంకర్‌ ప్రసాద్‌ తెలిపారు.

కాగా, ఆత్మనిర్భర్‌ భారత్‌ రోజ్‌గార్‌ యోజన (ఏబీఆర్‌వై) కింద దరఖాస్తు చేసుకునేందుకు గడువును మరో తొమ్మిది నెలలు (వచ్చే ఏడాది మార్చి 31 వరకు) పెంచుతూ కేంద్ర మంత్రివర్గం నిర్ణయం తీసుకున్నది. దీనివల్ల సంఘటిత రంగంలో ఇంతకుముందు అంచనా వేసినట్లు 58.5 లక్షల ఉద్యోగాలు కాకుండా 71.8 లక్షల ఉద్యోగాలు వస్తాయని కేంద్రం తెలిపింది.

ఈ పథకం కింద కంపెనీలు నియామకాలు చేపడితే ప్రభుత్వం రాయితీలు అందిస్తుంది. రెండేండ్ల పాటు కొత్త ఉద్యోగులకు సంబంధించి భవిష్యనిధిని ప్రభుత్వమే చెల్లిస్తుంది. ఉద్యోగి వాటా 12 శాతం, కంపెనీ వాటా 12 శాతం కలిపి మొత్తం 24 శాతం కేంద్రమే చెల్లిస్తుంది. మరోవైపు, వైద్య రంగంలో సంయుక్త పరిశోధనల కోసం నేపాల్‌, మయన్మార్‌తో కుదిరిన అవగాహన ఒప్పందాలకు కూడా కేంద్ర క్యాబినెట్‌ ఆమోదం తెలిపింది.

ఉద్దీపన ప్యాకేజీలో భాగంగా ప్రకటించిన రూ.3.03 లక్షల కోట్ల విలువైన విద్యుత్‌ సంస్కరణల పథకానికి మంత్రివర్గం ఆమోదం తెలిపింది. ఇందులో కేంద్రం వాటా రూ.97 వేల కోట్లు. దేశవ్యాప్తంగా ఒకే రీతిన కాకుండా రాష్ట్రాల్లోని పరిస్థితులకు తగ్గట్టుగా సంస్కరణలు చేపడుతారు. పథకంలో భాగంగా 25 కోట్ల స్మార్ట్‌ మీటర్లు, 10 వేల ఫీడర్లు, 4 లక్షల కిలోమీటర్ల మేర లో- టెన్షన్‌ ఓవర్‌హెడ్‌ లైన్ల నిర్మాణం చేపడుతారు.