లాభాపేక్ష లేని ఆసుపత్రుల ప్రోత్సాహం: నీతీ ఆయోగ్

దేశంలో లాభాపేక్షలేని ఆసుపత్రి ఎలా ఉండాలో సూచించే నమూనాపై ఒక సమగ్ర అధ్యయన నివేదికను నీతీ ఆయోగ్ విడుదల  చేసింది. దీనివల్ల లాభాపేక్షలేని ఆసుపత్రి నమూనాపై పటిష్టమైన విధాన రూపకల్పనలో సమాచారపరంగా ఏర్పడే అంతరాన్ని పూడ్చే దిశగా ముందడుగు పడినట్టు భావించవచ్చు.

“దేశంలో ప్రైవేటు రంగంలో ఆరోగ్య సదుపాయాల విస్తరణకు సంబంధించి పెట్టుబడులు తక్కువ స్థాయిలోనే ఉంటున్నాయి. అయితే,ఇందుకు సంబంధించి పరిస్థితిని చక్కదిద్దేందుకు ఉద్దీపన ప్యాకేజీ అవకాశం కల్పిస్తుంది. లాభాపేక్షలేని ఆసుపత్రి నమూనా రూపకల్పన కూడా ఆ దిశగా ఒక చిన్న ముందడుగు అవుతుంది.” అనినీతీ ఆయోగ్ ఆరోగ్య వ్యవహారాల సభ్యుడు డాక్టర్ వి.కె.పాల్ తెలిపారు.

వైద్యానికి అయ్యే ఖర్చును కట్టడిచేసేందుకు లాభాపేక్షలేని ఆసుపత్రులు అమలు చేస్తూవస్తున్న వ్యూహాలపై తాజాగా నీతీ ఆయోగ్ అధ్యయనం చేసింది. ఈ తరహా సంస్థల కార్యకలాపాలకు సవాలుగా నిలుస్తూ,వాటి ప్రగతిని ఆటంకపరిచే అంశాలను అర్థం చేసుకోవడానికి నీతీ ఆయోగ్ ఈ అధ్యయనం ద్వారా ప్రయత్నించింది.

లాభాపేక్షలేని ఆసుపత్రుల రంగానికి సంబంధించి స్వల్పకాల,దీర్ఘకాల విధానాల రూపకల్పననతో పాటుగా, ఇతర సంబంధిత అంశాలపై ఈ అధ్యయనం పలు సూచనలు చేసింది. లాభాపేక్షలేని ఆసుపత్రులను గుర్తించేందుకు తగిన పద్ధతులను సూచించడం,పనితీరు సూచికల ప్రాతిపదికగా వాటికి ర్యాంకులను నిర్ధారించడం, దాతృత్వ పద్ధతిని అనుసరించే అగ్రశ్రేణి ఆసుపత్రులను తగిన విధంగా ప్రోత్సహించడం తదితర అంశాలపై ఈ నివేదిక కొన్ని విధానాలను సూచించింది.

దేశం మారుమూల ప్రాంతాల్లో సైతం పరిమిత ఆర్థిక వనరుల సహాయంతో మానవ వనరులను వినియోగించుకునేందుకు సంబంధించి ఆసుపత్రుల నైపుణ్యాలను ఉపయోగించుకునే అంశానికి కూడా నీతీ ఆయోగ్ అధ్యయనం ప్రాధాన్యత ఇస్తోంది. అధ్యయన నివేదికను విడుదల చేసేందుకు ఏర్పాటు చేసిన కార్యక్రమంలో నీతీ ఆయోగ్ ముఖ్య కార్యనిర్వహణాధికారి అమితాబ్ కాంత్. అదనపు కార్యదర్శి డాక్టర్ రాకేశ్ సర్వాల్ వివిధ ఆసుపత్రుల ప్రతినిధులు పాల్గొన్నారు.