జమ్మూలోని వైమానిక స్థావరంలో డ్రోన్ల దాడితో కేంద్ర ప్రభుత్వం అప్రమత్తమైంది. మంగళవారం ప్రధాని నరేంద్ర మోదీ అధ్యక్షతన ఉన్నతస్థాయి సమావేశం నిర్వహించారు. ఈ సమావేశంలో రక్షణశాఖమంత్రి రాజ్‌నాథ్‌సింగ్, హోంమంత్రి అమిత్‌షాతోపాటు జాతీయ భద్రతా సలహాదారు(ఎన్‌ఎస్‌ఎ) అజిత్‌దోవల్ పాల్గొన్నారు.
డ్రోన్ల దాడి నేపథ్యంలో సైన్యానికి ఆధునిక సాంకేతికతను అందుబాటులోకి తేవడంపై సమావేశంలో దృష్టి సారించినట్టు తెలుస్తోంది. భవిష్యత్‌లో ఎదురు కానున్న సవాళ్లను దీటుగా ఎదుర్కొనేలా సాంకేతిక వనరులను సమకూర్చుకోవడంపై సమాలోచనలు సాగిస్తున్నారు. డ్రోన్ ఎటాక్స్ వంటి నూతన సవాళ్లను ఎదుర్కొనడంపై ప్రత్యేక శ్రద్ధ పెట్టాలని, యాంటీ డ్రోన్ టెక్నాలజీపై దృష్టి సారించాలని కేంద్రం త్రివిధ దళాలకు సూచించింది.
రక్షణ దళాలకు నూతన సాంకేతికతను అందించడం, ఇందుకోసం నవ యువతను, స్టార్టప్స్‌ను భాగస్వాములుగా చేసుకోవడం తదితర అంశాలపై సమావేశంలో చర్చించారు. ఇప్పటికే కృత్తిమ మేధ, రోబోటిక్స్, డ్రోన్స్, క్వాంటమ్ కంప్యూటింగ్ తదితర కొత్త సాంకేతికతలపై మిలటరీ దృష్టి సారించింది.రాబోయే వారాల్లో త్రివిధ దళాలు, కీలక భద్రతా వ్యూహకర్తలు మరిన్ని సమావేశాలు నిర్వహించి, కొత్త పాలసీపై చర్చలు జరుపుతారు. రెండు మూడు కిలోమీటర్ల దూరం నుంచే డ్రోన్లను గుర్తించి పేల్చేసే సాంకేతికతను ఇప్పటికే డీఆర్‌డీఓ రూపొందించింది. దీన్ని మరింత విస్తృతీకరించేందుకు కృషి జరుగుతోంది.
మూడు రోజుల క్రితం ఆదివారం) జమ్మూలోని స్థావరంలో రెండు డ్రోన్లు బాంబులు జారవిడిచిన సంఘటనతో ఇప్పటికే పాకిస్థాన్ సరిహద్దుల్లో భద్రతను పటిష్టం చేశారు. జమ్మూకాశ్మీర్‌లో సైన్యాన్ని అప్రమత్తం చేశారు. జమ్మూలో మంగళవారం కూడా డ్రోన్లు సంచరించినట్టు వార్తలొచ్చాయి. అయితే, సైన్యం దీనిపై అధికారికంగా స్పందించలేదు.
సైనిక శిబిరాల సమీపంలో మళ్లీ డ్రోన్లు ప్రత్యక్షమయ్యాయి. జమ్మూ నగరంలోని మిరాన్ సాహిబ్, కాలుచక్, కుంజావనీ ప్రాంతాల్లో బుధవారం ఉదయం మూడు డ్రోన్లు కనిపించాయి. గడచిన నాలుగు రోజులుగా జమ్మూ నగరంలో మిలటరీ స్థావరాల వద్ద డ్రోన్లు లభించాయి. మిలటరీ కేంద్రాల వద్ద ఇప్పటివరకు 7 డ్రోన్లు లభించాయి. ఈ డ్రోన్ల మిస్టరీని ఛేదించడానికి సైన్యంతోపాటు నేషనల్ ఇన్వెస్టిగేషన్ ఏజెన్సీ అధికారులు కూడా రంగంలోకి దిగారు.
సోమవారం కలూచాక్త్న్‌చ్రాక్ సైనిక స్థావరంవైపు రెండు డ్రోన్లు రాగా, శీఘ్ర స్పందన దళం కాల్పులు జరపడంతో అవి పారిపోయాయని సైన్యం ఇప్పటికే వెల్లడించింది. ఈ ఘటనతో భద్రతాదళాలు అత్యంత అప్రమత్తమయ్యాయని, ఆ ప్రాంతంలో సెర్చ్ ఆపరేషన్ కొనసాగుతున్నదని ఆర్మీ పిఆర్‌ఒ లెఫ్టినెంట్ కల్నల్ దేవేందర్ ఆనంద్ తెలిపారు. వరుస సంఘటనలతో ఉగ్రవాదులు ఆధునిక సాంకేతికతను అందిపుచ్చుకున్నట్టు అర్థమవుతోంది.
గతంలో డ్రోన్ల ద్వారా సరిహద్దుల్లోని ఉగ్రవాదులకు ఆయుధాలు, మందుగుండును చేరవేసిన ఘటనలను సైన్యం గుర్తించింది. తాజా సంఘటనలో వాణిజ్య డ్రోన్లతో నేరుగా దాడులు జరపడం కొత్త అనుభవం. ఈ సంఘటనతో ఉగ్రవాదుల నుంచి సరికొత్త ముప్పును ఎదుర్కోవాల్సి ఉంటుందని నిఘా వర్గాలు భావిస్తున్నాయి.
డ్రోన్ దాడులకు దీటుగా జవాబిచ్చేందుకు జమ్మూకాశ్మీర్‌లోని సైనిక దళాలకు ఆధునిక సాంకేతికతను అందుబాటులోకి తెచ్చేందుకు వేగవంతమైన చర్యలకు కేంద్రం సిద్ధమవుతున్నట్టు తెలుస్తోంది. జమ్మూ సంఘటనలపై ప్రధాన ప్రతిపక్షం కాంగ్రెస్ స్పందించింది.
కాగా, ఇటీవల చైనా నుంచి పాకిస్థాన్ పెద్ద ఎత్తున డ్రోన్లను కొనుగోలు చేసినట్టు నిఘా వర్గాల నుంచి భారత భద్రతా సంస్థలకు సమాచారం అందింది. వీటిని పిజ్జాలు, ఔషధాల సరఫరా కోసం వాడనున్నట్లుగా పాక్ పేర్కొన్నట్లు సమాచారం. ప్రస్తుతం ఈ డ్రోన్లనే జమ్ము వైమానిక స్థావరంపై జరిగిన దాడికి పాక్ ఉగ్రవాదులు ఉపయోగించినట్లు అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. దీనిపై దర్యాప్తు చేపట్టాల్సిన అవసరం ఉన్నదని అధికారులు పేర్కొంటున్నారు.
వైమానిక స్థావరంపై డ్రోన్ దాడి వెనుక నిషేధిత లష్కరే తాయిబా ఉగ్రవాద సంస్థ హస్తం ఉండొచ్చని అనుమానిస్తున్నట్టు జమ్ముకశ్మీర్ డీజీపీ దిల్బాగ్ సింగ్ తెలిపారు. పాకిస్థాన్ నుంచే డ్రోన్లు వచ్చి ఉంటాయని అనుమానాలు వ్యక్తం చేశారు. పౌర అవసరాలకు కూడా అనుమతి లేకుండా డ్రోన్లను వినియోగించొద్దని ప్రజలకు సూచించారు. ఉల్లంఘిస్తే కఠిన చర్యలు తీసుకుంటామన్నారు.
More Stories
సచివాలయంపై నుంచి దూకేసిన డిప్యూటీ స్పీకర్
తిరుమల లడ్డూ వివాదంలో ప్రత్యేక సిట్ దర్యాప్తు
జాతీయ స్థాయిలో తాజా పౌరుల రిజిస్టర్ అవసరం