మత్తుమందుల అంతర్జాతీయ స్థావరంగా హైదరాబాద్

మత్తుమందుల రవాణాకు అంతర్జాతీయ స్థాయిలో హైదరాబాద్‌ కీలక స్థావరంగా మారింది. మత్తుమందు రవాణాదారులు రాజధానిని కేంద్రంగా చేసుకొని తమ పని సులువుగా కానిచ్చేస్తున్నారు. కేవలం మూడు వారాల వ్యవధిలోనే డైరెక్టరేట్‌ ఆఫ్‌ రెవెన్యూ ఇంటెలిజెన్స్‌ (డిఆర్‌ఐ) అధికారులు రూ.97.5 కోట్ల విలువైన హెరాయిన్‌ను పట్టుకోగా,  ఇదే సమయంలో నార్కొటిక్స్‌ కంట్రోల్‌ బ్యూరో (ఎన్‌సిబి) అధికారులు ఏకంగా 2 వేల కిలోల గంజాయిని స్వాధీనం చేసుకున్నారు.

 ఈ మత్తుమందులేవీ స్థానిక వినియోగానికి కాదని, హైదరాబాద్‌ మీదుగా ఇతర ప్రాంతాలకు రవాణా అవుతున్నవేనని అధికారులు ప్రాథమికంగా గుర్తించారు. దీన్నిబట్టి పక్కరాష్ట్రాల్లో సాగవుతున్న గంజాయి ఇతర రాష్ట్రాలకు, అటు నుంచి ఇతర దేశాలకు, ఖరీదైన మత్తుమందులయితే, ఒక దేశం నుంచి మరో దేశానికి హైదరాబాద్‌ మీదుగానే రవాణా అవుతున్నాయని అధికారులు చెబుతున్నారు.

తూర్పు ఆసియా దేశాల్లో మత్తుమందుల వాడకం ఎక్కువగా ఉంటుంది. అయితే, అక్కడున్న విమానాశ్రయాల్లో నిఘా ఎక్కువగా ఉంటుంది. ఆఫ్రికా దేశాల నుంచి వచ్చేవారినయితే మరింత క్షుణ్ణంగా పరీక్షిస్తారు. అందుకే ఆఫ్రికా నుంచి కాకుండా భారత్‌ మీదుగా తరలించేందుకు స్మగ్లర్లు ప్రయత్నిస్తున్నారు. 

ఇందుకు ప్రధానంగా ఢిల్లీ, హైదరాబాద్‌లను వినియోగించుకుంటున్నారనే ఆధారాలనూ దర్యాప్తు అధికారులు సేకరించారు. హైదరాబాద్‌ నుంచి అంతర్జాతీయ విమానాల రాకపోకలు ఉండటమే కాకుండా,  ఇక్కడి నుంచి రోడ్డు మార్గంలో సులభంగా తమిళనాడుకు వెళ్లేందుకు వీలుంది. 

ఏ సమస్య లేకుండా సరుకు హైదరాబాద్‌కు చేరుకుంటే మరో ముఠా ఆ సరకును తీసుకొని రోడ్డుమార్గంలో తమిళనాడు, అక్కడ నుంచి పడవల్లో శ్రీలంకకు చేరుస్తుంది. అక్కడి నుంచి అంతర్జాతీయ ముఠాలు సరకును తూర్పు ఆసియా దేశాలకు చేరుస్తున్నాయనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయని చెబుతున్నారు.

నాలుగేళ్ల క్రితంగే నగర పోలీసులు మాదక ద్రవ్యాల మాఫియాను అదుపులోకి తీసుకొని, వారి నుండి కోట్ల రూపాయల విలువచేసే ఎండిఎంఎ అనే మాదకద్రవ్యంను స్వాధీనం చేసుకున్నారు. సినీ పరిశ్రమకు చెందిన హీరోలు, హీరోహిన్‌లు, నిర్మాతలతో పాటు 26 కార్పొరేట్ స్కూళ్లు, 27 ఇంజనీరింగ్ కళాశాలలను ఎచుంకుని విచ్చలవిడిగా వ్యాపారం చేసిన్నట్లు విచారణలు తెలుసుకున్నారు. 

ఆ తర్వాత విచారణను ముమ్మరం చేసి, అనేకమంది ప్రముఖులను విచారించారు. అయితే వివిధ రకాల వత్తిడుల కారణంగా వారందరిని వదిలివేశారు. ఆ కేసులను కూడా నిర్వీర్యం చేశారు. ఆ తర్వాత సహితం అధికార పార్టీకి సన్నిహితులైన రాజకీయ నేతలు, వ్యాపారాలకు ఈ మాఫియాతో సంబంధాలున్నట్లు వెల్లడైన తగు చర్యలు తీసుకున్న దాఖలాలులేవు. 

మత్తుమందులు పట్టుబడుతున్న ఉదంతాలు పెరగడంతో తీవ్రతను గుర్తించిన దర్యాప్తు సంస్థలు దీని వెనుక ఎవరున్నారో తెలుసుకునేందుకు తీవ్రంగా ప్రయత్నిస్తున్నారు. ఇందుకోసం వివిధ దర్యాప్తు సంస్థలన్నీ చేతులు కలిపినట్లు ఓ అధికారి తెలిపారు. ఇక, గంజాయి రవాణాకు కూడా హైదరాబాద్‌ కేంద్రస్థానంగా మారింది. 

దేశం మొత్తంలో అత్యధికంగా గంజాయి సాగవుతున్న ప్రాంతాల్లో ఆంధ్ర-ఒడిశా సరిహద్దు ఉంది. అక్కడ సాగయ్యే గంజాయి ఇతర దేశాలకూ ఎగుమతి అవుతోంది. ఇదంతా ఎక్కువగా హైదరాబాద్‌ మీదుగానే జరుగుతోంది. ఒడిశా సరిహద్దుల నుంచి రకరకాల పద్ధతుల్లో తొలుత హైదరాబాద్‌ తీసుకొచ్చి, అదును చూసుకుని ముంబయికి, అక్కడ నుంచి ఇతర దేశాలకూ ఎగుమతి చేస్తున్నట్లు అధికారులు గుర్తించారు.