బెంగాల్‌లో ఎన్‌హెచ్ఆర్సీ బృందంపై దాడి

ప‌శ్చిమ బెంగాల్‌లో ఎన్నిక‌ల త‌ర్వాత జ‌రిగిన హింస‌పై విచార‌ణ జ‌రుపుతున్న జాతీయ మానవ హక్కులక‌మిష‌న్ (ఎన్‌హెచ్ఆర్సీ) బృందంపై మంగ‌ళ‌వారం దాడి జ‌రిగింది. జాద‌వ్‌పూర్‌లో ఈ ఘ‌ట‌న జ‌రిగిన‌ట్లు ప్ర‌ముఖ న్యూస్ ఏజెన్సీ ఏఎన్ఐ వెల్ల‌డించింది. 

‘ఎన్నిక‌ల త‌ర్వాత హింస‌పై విచార‌ణ జ‌రిపేందుకు మేము జాద‌వ్‌పూర్‌లో ప‌ర్య‌టించాం. అక్క‌డ 40కిపైగా ఇళ్ల‌ను ధ్వంసం చేసిన‌ట్లు విచార‌ణ‌లో తేలింది. ఈ సంద‌ర్భంగానే మాపై దాడి జ‌రిగింది” అని ఎన్‌హెచ్ఆర్సీ బృందంలోని ఓ స‌భ్యుడు చెప్పిన‌ట్లు ఏఎన్ఐ వెల్ల‌డించింది. 

మానవ హ‌క్కుల సంఘం ఏర్పాటు చేసిన ఈ క‌మిటీ ఈ హింస‌పై విచార‌ణ జ‌రిపేందుకు సోమ‌వార‌మే ప‌శ్చిమ బెంగాల్‌కు వెళ్లింది. ఈ దాడిపట్ల ఎన్‌హెచ్‌ఆర్‌సీ ఆగ్రహం వ్యక్తం చేసింది.

మే 2న ఎన్నికల ఫలితాలు ప్రకటించినప్పటి నుండి బెంగాల్ లో తరచుగా రాజకీయ హింస చోటుచేసుకొంటున్నది. ఈ సందర్భంగా జరిగిన దాడులలో పలువురు రాజకీయ కార్యకర్తలు మృతి చెందారు. ఈ సంఘటనల పట్ల తీవ్రంగా స్పందించిన కొలకత్తా హైకోర్టు ఐదుగురు సభ్యుల బెంచ్ ఈ సంఘటనలపై ఒక కమిటీని నియమించి దర్యాప్తు జరిపించమని ఈ నెల 18న ఎన్‌హెచ్‌ఆర్‌సీ చైర్ పర్సన్ ను ఆదేశించింది.

దానితో ఏడుగురు సభ్యుల కమిటీని ఎన్‌హెచ్‌ఆర్‌సీ నియమించింది. హింసకు తీవ్రంగా ప్రభావితమైన ఉత్తర 24 పరాగణాల  జిల్లాతో పాటు ఇప్పటికే ఈ కమిటీ పలు జిల్లాల్లో పర్యటించింది.

ఈ దాడిని బిజెపి అధ్యక్షుడు జెపి నడ్డా తీవ్రంగా ఖండిస్తూ ఎక్కడైతే టిఎంసి  ఉంటుందో, అక్కడ హింస ప్రత్యక్షం అవుతుందని ధ్వజమెత్తారు. ‘పుదుచ్చేరి, తమిళనాడు, కేరళ, అస్సాం లలో కూడా ఎన్నికలు జరిగాయి. కానీ ఎక్కడెక్కడ ఎన్నికల అనంతరం హింస జరగలేదు. ఎందుకంటె అక్కడ టిఎంసి లేదు’ అని ఆయన ఎద్దేవా చేశారు.

పశ్చిమ బెంగాల్ లో ఒక మహిళా ముఖ్యమంత్రిగా ఉండగా ఎక్కువగా దాడులు జరుగుతున్నాయని నడ్డా ఆందోళన వ్యక్తం చేశారు. మహిళలకు రక్షణ కల్పించలేని ప్రభుత్వం ఏమి ప్రభుత్వం అని ప్రశ్నించారు. 

సిక్కిం హైకోర్టు మాజీ ప్రధాన న్యాయమూర్తి ప్రేమోద్ కోహ్లీ నేతృత్యంలోని పౌర సంఘాల బృందం రూపొందించిన నివేదిక ప్రకారం ఎన్నికల అనంతరం బెంగాల్ అంతటా పలు గ్రామాలు, పట్టణాలలో హింస చోటుచేసుకున్నది కేంద్ర హోమ్ శాఖ సహాయ మంత్రి జి కిషన్ రెడ్డి తెలిపారు. 

ఎన్నికల అనంతరం 15,000 హింసాయుత సంఘటనలు బెంగాల్ లో జరుగగా, వాటిల్లో 25 మంది మృతి చెందారని, 7,000 మంది మహిళలు హింసకు గురయ్యారని ఆ నివేదిక వెల్లడించిన్నట్లు వివరించారు.