రెండో వేవ్ ఇంకా ముగిసిపోలేదు

దేశంలో కరోనా వైరస్ ప్ర‌భావం త‌గ్గుముఖం ప‌ట్ట‌డంతో పలు రాష్ట్రాలు కొవిడ్‌ ఆంక్షలను సడలిస్తున్నాయి. ఈ నేపథ్యంలో కరోనా వైరస్‌ రెండో వేవ్‌ ఇంకా ముగిసిపోలేదని కేంద్ర ఆరోగ్యశాఖ హెచ్చ‌రించింది. కరోనా కేసుల సంఖ్య తగ్గుముఖం పట్టినప్పటికీ కొవిడ్‌ నిబంధనలు పాటించడంలో నిర్లక్ష్యం చేయవద్దని స్పష్టంచేసింది.

‘కరోనా రెండో  వేవ్‌ ఇంకా ముగిసిపోలేదు. కేసుల సంఖ్య గణనీయంగా తగ్గినప్పటికీ.. ఎలాంటి నిర్ల‌క్ష్యానికి తావివ్వ‌కూడ‌దు. కరోనాపై ఒకటిన్నరేళ్లుగా మనకున్న అనుభవం ఇదే విషయాన్ని స్పష్టంచేస్తున్న‌ది. ఈ సమయంలో మనం మరింత అప్రమత్తంగా ఉండాలి’ అని కేంద్ర ఆరోగ్యశాఖ మంత్రి డాక్టర్‌ హర్షవర్ధన్‌ హితవు చెప్పారు. 

కొవిడ్‌ విజృంభణపై ఢిల్లీ లెఫ్టినెంట్ గ‌వ‌ర్న‌ర్‌ అనిల్ బైజాల్‌, ఆరోగ్యశాఖ మంత్రి సత్యేంద్ర జైన్‌లతో ఏర్పాటు చేసిన వర్చువల్‌ సమావేశంలో కేంద్రమంత్రి మాట్లాడారు. అదృష్టవశాత్తు ఆరు నెలలుగా వ్యాక్సిన్‌ కూడా అందుబాటులో ఉందని, ఈ సమయంలో కొవిడ్‌ నిబంధనలు పాటిస్తూ వ్యాక్సిన్‌ తీసుకోవడంవల్ల త్వరలోనే మహమ్మారి మీద విజయం సాధించవచ్చని ఆయన ఆశాభావం వ్యక్తంచేశారు.

ఢిల్లీలో కేసులు గణ‌నీయంగా త‌గ్గినా మ‌నం విశ్ర‌మించరాద‌ని స్ప‌ష్టం చేశారు. ప్ర‌జ‌లు, స‌మాజం కూడా మ‌హ‌మ్మారి త‌గ్గుముఖం ప‌ట్టింద‌ని విశ్ర‌మించ‌రాద‌ని, మ‌నం అప్ర‌మ‌త్తంగా ఉండాల‌ని చెప్పారు.