ప్రియాంకా చోప్రాకు ‘గ్లోబల్ వాన్‌గార్డ్ హానర్’ అవార్డు

ప్రియాంకా చోప్రాకు ‘గ్లోబల్ వాన్‌గార్డ్ హానర్’ అవార్డు

భారతీయ సినీ పరిశ్రమ నుంచి హాలీవుడ్ వరకు తన ప్రతిభతో సరిహద్దులను చెరిపేసిన నటి ప్రియాంక చోప్రాకు మరో ప్రతి ష్ఠాత్మక అవార్డు ‘గ్లోబల్ వాన్‌గార్డ్ హానర్’ లభించనుంది. ఈ అవార్డును అమెరికాలో  మే 9న లాస్ ఏంజిల్స్‌లో నిర్వహించనున్న ‘గోల్డ్ హౌస్ గోల్డ్ గాలా-2026’ వేడుకల్లో ఆమె అందుకోనున్నారు.  ఆసియా-పాసిఫిక్ ప్రాంతానికి చెందిన ప్రతిభావంతుల విజయాలను గుర్తించి సత్కరించే ఈ వేదికపై ప్రియాంకకు ఈ గౌరవం దక్కడం విశేషం.

కేవలం సినిమాలకే పరిమితం కాకుండా, వివిధ రంగాల్లో ప్రభావం చూపిన నాయకులను కూడా ఈ వేడుకలో సత్కరించడం జరుగుతుంది. ఈ నేపథ్యంలో ప్రియాంక ఎంపిక కావడం భారతీయులకు గర్వకారణంగా మారింది. ఇప్పటికే 25 ఏళ్ల సినీ ప్రయాణాన్ని పూర్తి చేసుకున్న ప్రియాంకా చోప్రా, మిస్ వరల్డ్ విజేతగా తన ప్రయాణాన్ని అంతర్జాతీయ స్థాయిలో విస్తరించింది. బాలీవుడ్‌లో అగ్రనటిగా ఎదిగిన ఆమె, తర్వాత హాలీవుడ్‌లోనూ గుర్తింపు పొందింది.

భిన్న సంస్కృతుల మధ్య వారధిగా నిలుస్తూ భారతీయ సినీ ప్రతిభను ప్రపంచానికి పరిచయం చేసింది.  నటిగా మాత్రమే కాకుండా, సామాజిక అంశాల్లోనూ చురుకుగా పాల్గొంటూ సమాజానికి తన వంతు సేవ అందించడం కూడా ఆమెకు ఈ అవార్డు రావడానికి ప్రధాన కారణంగా భావిస్తున్నారు. ప్రపంచవ్యాప్తంగా ప్రభావం చూపిన వ్యక్తిగా ఆమెను గౌరవించడం ప్రత్యేకతను సంతరించుకుంది.

ఈ ఏడాది ‘గోల్డ్ గాలా’ వేడుక ‘ఎ న్యూ గోల్డ్ వరల్డ్’ అనే అంశంతో జరుగుతోంది. ఈ కార్యక్రమంలో ప్రియాంకతో పాటు అంతర్జాతీయ స్థాయి ప్రముఖులు కూడా పాల్గొననున్నారు. వ్యాపారం, సాంకేతికం, ఫ్యాషన్, క్రీడలు వంటి విభిన్న రంగాల్లో ప్రతిభ కనబరిచిన సుమారు 650 మంది ప్రముఖులు ఈ వేడుకకు హాజరుకానున్నారు. ఇక ప్రియాంకా చోప్రా తన సినీ ప్రయాణాన్ని మరింత విస్తరించేందుకు సిద్ధమవుతోంది. దర్శకుడు రాజ‌మౌళి తెరకెక్కించనున్న ‘వారణాసి’ చిత్రంలో ఆమె కీల‌క పాత్ర పోషిస్తుంది. ఈ భారీ ప్రాజెక్ట్‌తో పాటు మరిన్ని అంతర్జాతీయ చిత్రాల్లోనూ ఆమె కనిపించనున్నారని తెలుస్తోంది.