దేశ అత్యున్నత విధాన నిర్ణాయక సంస్థ ‘నీతి ఆయోగ్’ నూతన వైస్ ఛైర్మన్‌గా ఆర్థిక నిపుణుడు అశోక్ కుమార్ లాహిరీ నియమితులయ్యారు. ఇప్పటి వరకు ఈ పదవిలో కొనసాగిన సుమన్ కే బరీ స్థానంలో ఆయన బాధ్యతలు స్వీకరించనున్నారు. అశోక్ కుమార్ లాహిరీకి ఆర్థిక రంగంలో అపారమైన అనుభవం ఉంది. గతంలో ఆయన కేంద్ర ప్రభుత్వ ప్రధాన ఆర్థిక సలహాదారుగా (సిఈఎ), 15వ ఆర్థిక సంఘం సభ్యుడిగా, అలాగే ఆసియా అభివృద్ధి బ్యాంకులో కీలక బాధ్యతలు నిర్వహించారు.
ఆయన నేతృత్వంలో నీతి ఆయోగ్ మరిన్ని వినూత్న ఆర్థిక సంస్కరణలకు నాంది పలకనుందని విశ్లేషకులు భావిస్తున్నారు. బెంగాల్‌కు చెందిన బీజేపీ ఎమ్మెల్యే కూడా అయిన లహిరి, శనివారం ఢిల్లీలో ప్రధాని మోదీని కలిశారు. ఈ సమావేశ వివరాలు తెలియరాలేదు. కానీ భారతదేశ ఆర్థిక విధాన చట్రాన్ని రూపొందించడంలో ఈ థింక్ ట్యాంక్ కీలక పాత్ర పోషిస్తున్నందున ఇది ముఖ్యమైనదిగా భావిస్తున్నారు.
లహిరితో పాటు, బెంగాల్‌కు చెందిన మరో ప్రముఖుడు, శాస్త్రవేత్త గోబర్ధన్ దాస్‌ను ఈ థింక్ ట్యాంక్‌లో పూర్తికాల సభ్యుడిగా నియమించారు. శాస్త్రవేత్త, మాజీ బీజేపీ సభ్యుడైన గోబర్ధన్ దాస్, 2021 పశ్చిమ బెంగాల్ ఎన్నికలలో పూర్వస్థలి ఉత్తర్ నియోజకవర్గం నుంచి పోటీ చేసి ఓడిపోయారు. ఆయన ఒక ప్రముఖ రోగనిరోధక శాస్త్రవేత్త. గతంలో ఢిల్లీలోని జవహర్‌లాల్ నెహ్రూ విశ్వవిద్యాలయం (జేఎన్‌యూ)లో పనిచేశారు. ఐఐఎస్ఈఆర్ భోపాల్‌కు డైరెక్టర్‌గా కూడా సేవలందించారు.
కేవలం వైస్ ఛైర్మన్ మాత్రమే కాకుండా, నీతి ఆయోగ్ పాలక మండలిలో పలు కీలక నియామకాలు జరిగాయి. రాజీవ్ గౌబా, ప్రొఫెసర్ కేవీ రాజు, ప్రొఫెసర్ గోవర్ధన్ దాస్, డాక్టర్ శ్రీనివాస్, ప్రొఫెసర్ అభయ్ కరణ్‌కర్ లు నీతి ఆయోగ్ పూర్తిసమయ సభ్యులుగా నియమితులయ్యారు. వివిధ రంగాల్లో నిష్ణాతులైన వీరందరితో కూడిన ఈ కొత్త బృందం సోమవారం నుంచి అధికారికంగా బాధ్యతలు చేపట్టే అవకాశం ఉంది.
రాబోయే కాలంలో దేశాభివృద్ధికి అవసరమైన రోడ్ మ్యాప్‌ను సిద్ధం చేయడంలో ఈ బృందం కీలక పాత్ర పోషించనుంది. నూతనంగా నియమితులైన వైస్ ఛైర్మన్ మరియు సభ్యుల వివరాలను ప్రకటిస్తూ ప్రధానమంత్రి నరేంద్ర మోదీ వారికి ప్రత్యేక అభినందనలు తెలిపారు. ‘వికసిత్ భారత్’ లక్ష్య సాధనలో నీతి ఆయోగ్ పాత్ర ఎంతో కీలకమని, కొత్త బృందం తమ మేధస్సుతో దేశాభివృద్ధిని పరుగులు పెట్టిస్తుందని ఆయన ఆకాంక్షించారు. ముఖ్యంగా రాష్ట్రాలతో సమన్వయం చేసుకుంటూ, క్షేత్రస్థాయిలో ప్రభుత్వ పథకాలు సమర్థవంతంగా అమలు జరిగేలా చూడటం ఈ కొత్త బృందం ముందున్న ప్రధాన సవాలు.
More Stories
ప్రియాంకా చోప్రాకు ‘గ్లోబల్ వాన్గార్డ్ హానర్’ అవార్డు
హరిత హైడ్రోజన్ భవిష్యత్ ఇంధనం
గ్యాంగ్‌స్టర్ లారెన్స్ బిష్ణోయ్ డాక్యుమెంటరీపై నిషేధం!