సచివాలయం ముట్టడికి ఏబీవీపీ యత్నం

ప్రభుత్వం ఇచ్చిన జాబ్ క్యాలెండర్‌కు వ్యతిరేకంగా సచివాలయం ముట్టడికి ఏబీవీపీ విద్యార్థి సంఘం నేతలు పూనుకున్నారు. కాగా వారిని పోలీసులు అడ్డుకున్నారు. విద్యార్థి నేతలను అరెస్ట్ చేసిన పోలీసులు పోలీస్‌స్టేషన్‌కు తరలించారు. 
జాబ్‌ క్యాలెండర్‌పై నిరుద్యోగ యువత అసంతృప్తితో ఉందని… కొత్త ఉద్యోగాలతో మరో క్యాలెండర్‌ను విడుదల చేయాలని వారు డిమాండ్ చేస్తున్నారు. 25 వేల టీచర్‌ పోస్టులు, 10 వేల కానిస్టేబుల్‌, మరో 6 వేల గ్రూప్‌-3, 4 పోస్టులతో కొత్త క్యాలెండర్‌ను విడుదల చేయాలని ఏబీవీపీ సెంట్రల్ వర్కింగ్ కమిటీ సభ్యులు నాగోతు హరికృష్ణ, రాష్ట్ర కార్యదర్శి కౌశిక్ డిమాండ్ చేస్తున్నారు.
 
 కాగా,కృష్ణా జిల్లా మచిలీపట్నంలో పలువురు ఏబీవీపీ కార్యకర్తలను పోలీసులు హౌస్ అరెస్ట్ చేశారు. తెల్లారితే రాష్ట్ర మంత్రివర్గ సమావేశం జరుగనున్న నేపథ్యంలో మంగళవారం రాత్రి మచిలీపట్నంలో ఏబీవీపీ కార్యకర్తలను పోలీసులు ముందస్తు చర్యల్లో భాగంగా నోటీసులు ఇచ్చి హౌస్ అరెస్ట్ చేశారు. 
 
ఏబీవీపీ ప్రతినిథి ఎం సుబ్రహ్మణ్యంతో పాటు మరికొంత మందికి పోలీసులు నోటీసులిచ్చారు. గత కొన్ని రోజులుగా జాబ్ క్యాలెండర్‌ను నిరసిస్తూ విద్యార్థి సంఘాలు నిరసనలు తెలియజేస్తున్న విషయం తెలిసిందే. ఈ క్రమంలో ఏబీవీపీ కార్యకర్తలను పోలీసులు గృహనిర్బంధం చేశారు.