
నీటి పంపకాల విషయంలో రెండు తెలుగు రాష్ట్రాల మధ్య వివాదం నడుస్తున్న సంగతి తెలిసిందే. ఎపి, తెలంగాణ మంత్రుల మధ్య మాటల యుద్ధం నడుస్తోంది. అయితే, ఇప్పటి వరకూ ఈ విషయంలో ఒక్క మాట కూడా మాట్లాడని ఎపి సిఎం జగన్‌మోహన్ రెడ్డి తొలిసారిగా స్పందించారు.
ఎపి కేబినెట్ సమావేశంలో భాగంగా నీటి పంపకం, విద్యుత్ విషయంలో వచ్చిన చర్చలో ఆయన కీలక వ్యాఖ్యలు చేశారు. తెలంగాణలో ఎపి ప్రజలున్నారని, మన వాళ్లను ఇబ్బంది పెడతారనే ఉద్దేశంతో తాను ఎక్కువగా మాట్లాడటం లేదని చెప్పారు. రైతులకు అన్యాయం జరుగుతుంటే ఎలా ఊరుకోవాలని ప్రశ్నించారు.
తెలంగాణ మంత్రులు చాలా ఎక్కువగా మాట్లాడుతున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. నీటి విషయంలో ఎలా చేస్తే బాగుంటుందో ఆలోచించాలని ఎపి మంత్రులకు సూచనలు చేశారు. . తెలంగాణ విద్యుదుత్పత్తి విషయంపై మరోసారి లేఖ రాయాలని ఆదేశించారు. అనుమతి లేకుండా నీటి వినియోగంపై కేఆర్‌ఎంబీకి లేఖ రాయాలని జగన్ స్పష్టం చేశారు.
ఆంధ్రప్రదేశ్ రైతుల ప్రయోజనాలకు విఘాతం కలిగిస్తూ డెడ్ స్టోరేజ్ లెవల్ నీటినిల్వల నుంచి కూడా తెలంగాణ ప్రభుత్వం విద్యుత్ ఉత్పత్తి చేస్తుండటం దుర్మార్గమైన చర్యగా మంత్రివర్గం పేర్కొందని రాష్ట్ర మంత్రులు అనిల్‌కుమార్‌యాదవ్, పేర్ని వెంకట్రామయ్య (నాని) తెలిపారు. రాష్ట్ర ప్రయోజనాలను కాపాడుకునేందుకు ఎంతవరకైనా వెళ్లాలని నిర్ణయించిందని చెప్పారు. తెలంగాణ ప్రభుత్వ అన్యాయ వైఖరిపై కేంద్ర ప్రభుత్వంతోపాటు కృష్ణా రివర్ మేనేజ్‌మెంట్ బోర్డు (కేఆర్‌ఎంబీ)కు లేఖ రాయాలని నిర్ణయించినట్టు తెలిపారు.
‘రాష్ట్ర రైతులకు అన్యాయం చేస్తూ తెలంగాణ ప్రభుత్వం విద్యుత్ ఉత్పత్తి చేస్తుండటాన్ని అడ్డుకునేం దుకు ఎంతవరకైనా వెళ్తాం. తెలంగాణ మంత్రులు రాజకీయ ప్రయోజనాల కోసమే రెచ్చగొట్టే భాష మాట్లాడుతున్నారు’ అని వారు మండిపడ్డారు. ఇరుప్రాంతాల ప్రజల ప్రయోజనం కోసం మేము సంయమనం పాటిస్తున్నాం. విడిపోయిన తరువాత కూడా రెండు ప్రాంతాల తెలుగువారు బాగుండాలన్నదే సీఎం వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి ఉద్దేశం అని స్పష్టం చేశారు.
తెలంగాణ ప్రభుత్వం దుర్మార్గమైన చర్యకు పాల్ప డుతోంది. ఈ రోజు శ్రీశైలంలో 30 వేల క్యూసెక్కులు వస్తుంటే, 26 వేల క్యూసెక్కులను విద్యుత్ ఉత్పత్తికి వాడేస్తోంది. శ్రీశైలం డ్యాం నిండకుండా చేసేందుకే తెలంగాణ ప్రభుత్వం ఈ దుర్మార్గమైన చర్యకు పాల్పడుతోందిని మంత్రులు ధ్వజమెత్తారు.
More Stories
మూడురోజుల పాటు తిరుపతిలో టెంపుల్ ఎక్స్పో
గుంటూరు ఆసుపత్రిలో జిబిఎస్ తో ఓ మహిళ మృతి
అలనాటి నటి, నిర్మాత కృష్ణవేణి కన్నుమూత