దేవాదాయ నిధుల మల్లింపు ఆపండి

దేవదాయశాఖ నిధులను వైయ్‌సఆర్‌ వాహనమిత్ర పథకానికి మళ్లించారంటూ దాఖలైన ప్రజాప్రయోజన వ్యాజ్యంపై ఏపీ  హైకోర్టులో మంగళవారం విచారణ జరిగింది. ఈ వ్యవహారంపై కౌంటర్‌ దాఖలు చేయాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని హైకోర్టు ఆదేశించింది. రఈ మేరకు హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్‌ అరూ్‌పకుమార్‌ గోస్వామి, జస్టిస్‌ ఎన్‌.జయసూర్యతో కూడిన ధర్మాసనం ఆదేశాలిచ్చింది. 

వైయ్‌సఆర్‌ వాహన మిత్ర పథకానికి దేవదాయశాఖ నుంచి మళ్లించిన రూ.49 లక్షలను విడుదల చేస్తూ రెవెన్యూ (దేవదాయ)శాఖ జూన్‌ 15న జీవో 334ని జారీ చేసిందని, ఆ జీవోను చట్టవిరుద్ధమైనదిగా ప్రకటించాలని కోరుతూ తిరుపతికి చెందిన బీజేపీ నేత జీ భానుప్రకాశ్‌ రెడ్డి హైకోర్టులో పిల్‌ వేశారు. 

పిటిషనర్‌ తరఫు న్యాయవాది గోపాలకృష్ణ కళానిధి వాదనలు వినిపిస్తూ ‘‘దేవదాయశాఖకు చెందిన రూ. 49 లక్షల నిధులను వైయ్‌సఆర్‌ వాహనమిత్ర పథకానికి మళ్లిస్తూ ప్రభుత్వం జీవో జారీచేసింది. నిబంధనల ప్రకారం దేవదాయశాఖ నిధులను ప్రభుత్వ పథకాలకు కేటాయించడానికి వీల్లేదు. కాబట్టి, ఈ నిధుల విడుదలకి సంబంధించి ప్రభుత్వం జారీ చేసిన జీవోను రద్దు చేయాలి’’ అని కోరారు. 

ప్రభుత్వ ప్రత్యేక న్యాయవాది సీ సుమన్‌ వాదనలు వినిపిస్తూ  ‘‘బ్రాహ్మణ కార్పొరేషన్‌ కోసం ప్రభుత్వం బడ్జెట్‌లో నిధులు కేటాయించింది. ఆ నిధులనే వాహనమిత్ర పథకానికి కేటాయిస్తూ పరిపాలన ఉత్తర్వులు జారీ చేశారు. పూర్తి వివరాలతో కౌంటర్‌ దాఖలు చేసేందుకు సమయం ఇవ్వాలి’’ అని కోరారు. అందుకు అంగీకరించిన ధర్మాసనం, కౌంటర్‌ దాఖలుకు వచ్చే సోమవారం వరకు అవకాశం ఇస్తూ, అప్పటివరకు నిధులు విడుదల చేయవద్దని ఆదేశించింది. అదే రోజుకు విచారణను వాయిదా వేసింది.