ఎన్‌ఆర్‌ఐ ఆస్పత్రి అమ్మాలని బెదిరింపులు

రాజధాని అమరావతి ప్రాంతంలోని మంగళగిరి ఎన్‌ఆర్‌ఐ ఆస్పత్రిని అమ్మాల్సిందేనని, లేకపోతే భూమ్మీద నూకలు చెల్లిపోతాయని బెదిరించేంత తీవ్ర పరిస్థితులు ఏర్పడ్డాయి. మొత్తం డైరెక్టర్లలో 14 మంది అమ్మకానికి అంగీకరించినా, 16 మంది వ్యతిరేకంగా ఉన్నారని తెలుస్తున్నది. దీనితో అమ్మకంపై వ్యతిరేకిస్తున్న వారిపై కేసుల పరంపర మొదలైందని బలమైన ఆరోపణలొస్తున్నాయి. 

అధికార పార్టీలోని పెద్దలే ఈ ప్రతిష్టాకరమైన ఆసుపత్రిని కట్టబెట్టేందుకు పెద్ద ఎత్తున ప్రయత్నాలు చేస్తున్నట్లు చెబుతున్నారు. వివాదాల పేరిట, జరిమానాలు విధించి అమ్మకంకు వ్యతిరేకిస్తున్న వారిని భయాందోళనలకు గురిచేస్తున్నారు. 

ఒకవైపు రాజధాని ఇక్కడ ఉండదన్న ప్రచారం సాగుతుండగానే మరోవైపు కీలకమైన ఆస్తులు, సంస్థల కొనుగోలుకు సంబంధించిన చిత్ర విచిత్ర వ్యవహారాలు జరుగుతుండడం ఆశ్చర్యకరం.    23 ఎకరాల విస్తీర్ణంలో భవనాలు, 750 పడకలు గల మంగళగిరి ఎన్‌ఆర్‌ఐ ఆస్పత్రిని అమ్ముతున్నారంటూ ఇటీవల వార్తలు గుప్పుమన్నాయి. 

ఎన్‌ఆర్‌ఐ ఆస్పత్రిని తమకు అమ్మాలని రెండు నెలల క్రితం కొంతమంది అధికార పార్టీ నేతలు ఆస్పత్రి బోర్డును సంప్రదించారు. కొనుగోలు చేయాలనుకున్నది పెద్దలు కావడంతో కాదంటున్నవారిపై మంగళగిరి పోలీసు స్టేషన్లో కేసులు నమోదయ్యాయి. వేధింపుల పర్వం మొదలైంది. 

గొడవను సర్దుబాటు చేసి బేరసారాలు జరిపేందుకు తెలుగు రాష్ట్రాల్లో పేరెన్నికగన్న ఓ కాంట్రాక్టు కంపెనీ యాజమాన్యం జోక్యం చేసుకున్నట్లు తెలిసింది. దీంతో ఆ కంపెనీయే స్వాధీనం చేసుకుంటుందనే వార్తలు వచ్చాయి. 

అమ్మకం ఒప్పందం చేసుకోకపోతే తీవ్ర పర్యవసానాలుంటాయని బెదిరిస్తున్నారని కొంతమంది వాటాదారులు ఇటీవల విలేకరుల సమావేశంలో ఆరోపించారు.  దీనివెనుక కొంతమంది ప్రభుత్వ పెద్దలున్నారని, వారి మాట వినడం లేదనే ఉద్దేశంతోనే తమపై కక్ష సాధింపులకు దిగుతున్నారని, జరిమానాలు, కేసులు అన్నీ ఆస్పత్రి అమ్మకాన్ని వ్యతిరేకించిన వారిపైనేనని వారు వివరించారు. తమకు ప్రాణహాని జరిగితే ప్రభుత్వానిదే బాధ్యతని స్పష్టం చేశారు.

 విజయవాడ, గుంటూరు మధ్యలో విశాల వాతావరణంలో ఎన్‌ఆర్‌ఐ మెడికల్‌ కళాశాల, అనుబంధంగా ఆస్పత్రి ఉంది. 10 లక్షల చదరపు అడుగుల విస్తీర్ణంలో (సుమారు 23 ఎకరాలు) నిర్మాణాలు, 750 బెడ్లు ఉన్నాయి. అన్ని రకాల వైద్య పరీక్షలకు అవసరమైన ల్యాబరేటరీలు ఏర్పాటు చేశారు. 

అన్ని సదుపాయాలూ ఉండటంతోపాటు విలువ కూడా ఎక్కువ కావడంతో కొనుగోలు చేసేందుకు కొంతమంది పెద్దలు సిద్ధపడ్డట్లు తెలిసింది. ఎంబిబిఎస్‌, పిజి, సూపర్‌స్పెషాలిటీ కోర్సులతోపాటు పారామెడికల్‌ కోర్సులూ ఉన్నాయి. మొత్తం 200 మెడికల్‌ సీట్లు ఉండగా వీటిల్లో ఎ కేటగిరీలో 100, బి కేటగిరీలో 70, సి కేటగిరీలో 30 సీట్లు ఉన్నాయి. ఎంబిబిఎస్‌ సీటు రూ.36 లక్షలు, పిజి సీటు రూ.80 లక్షల వరకూ పలుకుతుంది. ఇలాంటి కారణాలవల్ల ఈ బోధనాసుపత్రికి డిమాండు ఏర్పడింది.