చైనా సరిహద్దుల్లో 2 లక్షల మంది  భారత్ సైనికులు 

భార‌త్, చైనాల మ‌ధ్య ఉద్రిక్త‌త‌లు కొన‌సాగుతున్న క్ర‌మంలో చైనా స‌రిహ‌ద్దుల్లో భారత్ ఇటీవ‌ల దాదాపు 50,000 అద‌న‌పు బ‌ల‌గాల‌ను మోహ‌రించింద‌ని బ్లూమ్‌బ‌ర్గ్ నివేదిక వెల్ల‌డించింది. గ‌త కొద్ది నెల‌లుగా చైనా స‌రిహద్దులో మూడు ప్రాంతాల్లో మోదీ స‌ర్కార్ పెద్ద‌సంఖ్య‌లో సైనికులు, యుద్ధ విమానాల‌ను మోహ‌రించింద‌ని ఈ నివేదిక పేర్కొంది.

గ‌త ఏడాదితో పోలిస్తే 40 శాతం అధికంగా చైనా స‌రిహ‌ద్దులో భార‌త్ 2,00,000 మంది సైనికుల‌ను మోహ‌రించింది. గ‌త ఏడాది తూర్పు ల‌డ‌ఖ్‌లో ఘ‌ర్ష‌ణ‌ల నేప‌థ్యంలో చైనాతో ప్ర‌తిష్టంభ‌న నెల‌కొన్న క్ర‌మంలో చైనా, పాకిస్తాన్‌ల‌తో ఉద్రిక్త‌త‌ల నివార‌ణ‌కు నరేంద్ర మోదీ ప్ర‌భుత్వం ప‌లు చ‌ర్య‌లు చేప‌డుతూనే భ‌విష్య‌త్‌లో ఎలాంటి ప‌రిస్థితులు ఎదురైనా ఎదుర్కొనేందుకు సిద్ధంగా ఉండాల‌ని సాయుధ ద‌ళాల‌ను సంసిద్ధం చేసింది. 

చైనా స‌రిహ‌ద్దుల్లో సేన‌ల‌ను తిరిగి మోహ‌రించ‌డంతో పాటు క‌శ్మీర్‌లోయ నుంచి ఎత్తైన ప్రాంతాల‌కు హెలికాఫ్ట‌ర్ల‌లో సైనికుల‌ను ఎం777 హోయిట్జ‌ర్ వంటి అత్యాధునిక ఆయుధాల‌ను త‌ర‌లించింద‌ని బ్లూమ్‌బ‌ర్గ్‌ నివేదిక పేర్కొంది.

ఇక చైనా సైతం భార‌త్ స‌రిహ‌ద్దుల్లో సేన‌ల‌ను మోహ‌రించ‌డంతో పాటు ర‌న్‌వే బిల్డింగులు, యుద్ధ విమానాల కోసం బాంబ్ ఫ్రూఫ్ బంక‌ర్ల‌ను నిర్మిస్తోంది. ట్యాంకులు, ట్విన్ ఇంజిన్ ఫైట‌ర్ల‌ను కొద్దినెల‌లుగా స‌రిహ‌ద్దుల‌కు త‌ర‌లించింద‌ని నివేదిక తెలిపింది.  మ‌రోవైపు స‌రిహ‌ద్దుల్లో ఉద్రిక్త‌త‌ల నివార‌ణ‌కు ఇరు దేశాలు ప‌లుమార్లు దౌత్య‌, సైనిక సంప్ర‌దింపులు జ‌రిపినా ఇప్ప‌టివ‌ర‌కూ కీల‌క పురోగ‌తి సాధించ‌లేదు.