ఎన్ఐఏకు జ‌మ్మూ వైమానిక స్థావ‌రంపై దాడి కేసు

జ‌మ్మూలో వైమానిక స్థావ‌రంపై దాడి కేసు విచార‌ణ‌ను జాతీయ ద‌ర్యాప్తు సంస్థకు అప్ప‌గిస్తూ కేంద్ర హోంశాఖ ఉత్త‌ర్వులు జారీ చేసింది. ఈ నెల 27వ తేదీన జ‌మ్మూ వైమానిక స్థావ‌రంపై బాంబు దాడి జ‌రిగిన విష‌యం విదిత‌మే. ఉగ్ర‌వాదులు డ్రోన్ల‌తో వైమానిక స్థావ‌రంపై బాంబు పేలుళ్ల‌కు పాల్ప‌డ్డారు.

జ‌మ్మూ విమానాశ్రయంలోని వాయుసేన కార్యకలాపాలు నిర్వహించే స్థావరంలో పేలుడు కలకలం సృష్టించింది. శనివారం అర్ధరాత్రి దాటాక 1.40 గంటల సమయంలో ఈ ఘటన జరిగింది. తక్కువ ఎత్తులో ఎగురుతూ వచ్చిన రెండు డ్రోన్లు ఆరు నిమిషాల వ్యవధిలో వాయుసేన స్థావరం మీదకు పేలుడు పదార్థాలను (ఐఈడీ) జారవిడిచినట్టు అధికారులు తెలిపారు. 

తొలి బాంబు దాడిలో సత్వారీ ఏరియాలోని హై-సెక్యూరిటీ టెక్నికల్‌ ఏరియాలోని ఒక బిల్డింగ్‌ పైకప్పు దెబ్బతినగా, రెండో పేలుడు బహిరంగ ప్రదేశంలో జరిగినట్టు చెప్పారు. ఈ ఘటనలో ఇద్దరు వాయుసేన అధికారులు స్వల్పంగా గాయపడ్డట్టు చెప్పారు.

జమ్ములోని కల్చుక్‌ ప్రాంతంలో ఉన్న సైనిక స్థావరంపై ఆదివారం అర్ధరాత్రి రెండు డ్రోన్లు అనుమానాస్పదంగా కనిపించాయి. వెంటనే అప్రమత్తమైన బలగాలు వాటిపైకి 25 రౌండ్ల వరకు కాల్పులు జరిపారు. రాత్రి 11.45 గంటలు, 2.40 గంటల సమయంలో ఈ డ్రోన్లు కనిపించినట్టు అధికారులు తెలిపారు. 

జమ్ములో వాయుసేన స్థావరంపై దాడి జరిగిన 24 గంటల్లోనే మరోసారి డ్రోన్లు సైనిక స్థావరం మీదకు రావడం పరిస్థితి తీవ్రతను తెలియజేస్తున్నది. 2002లో కూడా ఇదే స్థావరంపై ఉగ్రదాడి జరిగింది. అప్పుడు 10 మంది పిల్లలు సహా 31 మంది చనిపోయారు.

కాగా, జమ్ములోని వాయుసేన స్థావరంపై రెండు డ్రోన్లతో దాడి జరిగినట్టు ప్రాథమిక దర్యాప్తులో తేల్చారు. ఆరు నిమిషాల వ్యవధిలో ఈ పేలుళ్లు జరిగాయి. ఒక్కో డ్రోన్‌ 2 కిలోల చొప్పున శక్తిమంతమైన ఐఈడీలను మోసుకొచ్చాయి. జైషే మహ్మద్‌ ఈ దాడి వెనుక ఉండొచ్చని అనుమానిస్తున్నారు.