జ‌మ్ము ఎయిర్ బేస్‌లో యాంటీ డ్రోన్ వ్య‌వ‌స్థ

జ‌మ్ము ఎయిర్ ఫోర్స్ స్టేష‌న్‌లో ఈ నెల 27న ఉగ్ర‌వాదులు డ్రోన్లతో దాడి చేసి పేలుడు ప‌దార్థాల‌ను జార‌విడిచిన ఘ‌న‌ట‌లో రెండు పేలుళ్లు జ‌రిగాయి. అలాగే గ‌త నాలుగు రోజుల్లో జ‌మ్ములోని సైనిక స్థావ‌రాల స‌మీపంలో ఏడు డ్రోన్ల క‌ద‌లిక‌ల‌ను భ‌ద్ర‌తా సిబ్బంది గుర్తించారు. 

ఈ నేప‌థ్యంలో జ‌మ్ము ఎయిర్ బేస్‌లో యాంటీ డ్రోన్ వ్య‌వ‌స్థ‌ను ఏర్పాటు చేశారు. నేషనల్ సెక్యూరిటీ గార్డ్ (ఎన్‌ఎస్‌జీ) ఈ యాంటీ డ్రోన్ వ్య‌వ‌స్థ‌ను ఏర్పాటు చేసిన‌ట్లు స‌మాచారం. రేడియో ఫ్రీక్వెన్సీ డిటెక్టర్, సాఫ్ట్ జామర్‌ల ఏర్పాటుతోపాటు యాంటీ డ్రోన్ గ‌న్స్‌ను జ‌మ్ము ఎయిర్ బేస్‌లో మోహ‌రించిన‌ట్లు సంబంధిత వర్గాలు వెల్ల‌డించాయి.

‘‘డ్రోన్లతో ప్రమాదం పొంచి ఉన్న నేపథ్యంలో భద్రత వ్యవస్థలను మరింత కట్టుదిట్టం చేశాం. ఎయిర్‌ఫోర్స్ స్టేషన్‌లో రేడియో ఫ్రీక్వెన్సీ డిటెక్టర్‌‌, జామర్లను ఏర్పాటు చేశాం’’ అని ఈ వ్యవహారంతో సంబంధం ఉన్న వర్గాలు తెలిపాయి.

కాగా, రాజౌరి జిల్లా అధికారులు కొత్త ఆదేశాల‌ను జారీ చేశారు. డ్రోన్లు, ఎగిరే వ‌స్తువ‌ల వ‌ల్ల జాతి వ్య‌తిరేకులు దాడికి పాల్ప‌డే అవ‌కాశం ఉంద‌ని, దాని వ‌ల్ల మ‌నుషుల ప్రాణాల‌కు రిస్క్ ఏర్పాడుతున్న‌ట్లు జిల్లా మెజిస్ట్రేట్ ఓ ప్ర‌క‌ట‌న‌లో భావించారు. ఈ సంద‌ర్భంగా రాజౌరి జిల్లా అధికారులు డ్రోన్ల వినియోగంపై నిషేధం విధించారు. 

డ్రోన్ల‌ను దాచిపెట్ట‌డం, అమ్మ‌డం, వాడ‌డం, వాటిని ర‌వాణాకు వాడ‌డాన్ని నిషేధిస్తున్న‌ట్లు రాజౌరి అధికారులు చెప్పారు. కానీ ఇప్ప‌టికే డ్రోన్ కెమెరాలు, ఫ్ల‌యింగ్ ఆబ్జెక్ట్స్ ఉన్న‌వాళ్లు వాటిని పోలీసుల వ‌ద్ద డిపాజిట్ చేయాల‌ని ఆదేశించారు. స‌ర్వేలు, మ్యాపింగ్‌, నిఘా కోసం ప్ర‌భుత్వం వాడే డ్రోన్లపై పోలీసుల నిఘా ఉంటుంద‌న్నారు.