పిల్లలపై కోవోవాక్స్‌ టీకా ట్రయల్స్‌కు నిపుణుల అభ్యంతరం

సీరం ఇన్‌స్టిట్యూట్‌ కోవోవాక్స్‌ కొవిడ్‌ టీకా 2-17 సంవత్సరాల మధ్య వయసున్న పిల్లలపై ఫేజ్‌-2, 3 ట్రయల్స్‌ నిర్వహించొద్దని సెంట్రల్‌ డ్రగ్‌ అథారిటీ నిపుణుల కమిటీ సిఫారసు చేసింది. అయితే, పెద్దలపై మొదట ట్రయల్స్‌ పూర్తి చేయాలని ప్యానెల్‌ సీరం సంస్థకు సూచించింది. 
 
సీరం దేశవ్యాప్తంగా పది కేంద్రాల్లో 2-11, 12-17 సంవత్సరాల మధ్య 920 మంది పిల్లలపై వ్యాక్సిన్‌ ట్రయల్స్‌ కోసం డీసీజీఐకి దరఖాస్తు చేసింది. సెంట్రల్ డ్రగ్స్ స్టాండర్డ్ కంట్రోల్ ఆర్గనైజేషన్‌కు చెందిన సబ్జెక్ట్‌ ఎక్స్‌పర్ట్‌ కమిటీ (ఎస్‌ఈసీ) కూడా ఏ దేశంలోనూ వ్యాక్సిన్‌ను ఆమోదించలేదని పేర్కొంది. 
 
అమెరికాకు చెందిన నోవావాక్స్‌ ఇంక్‌ సంస్థ ఎన్‌వీఎక్స్‌ కోవ్‌ 2373 పేరిట అభివృద్ధి చేసిన వ్యాక్సిన్‌ను భారత్‌లో ఉత్పత్తి చేసేందుకు సీరం కంపెనీ ఒప్పందం చేసుకుంది. మూడో దశ క్లినికల్‌ ట్రయల్స్‌లో వ్యాక్సిన్‌ ఎన్‌వీఎక్స్‌-2373 టీకా మితమైన, తీవ్రమైన కేసుల్లో వందశాతం ప్రభావంతంగా పని చేస్తున్నట్లు తేలింది. మొత్తంగా 90.4 శాతం సమర్థతతను చూపిందని జూన్‌ 14న నోవావాక్స్‌ కంపెనీ ఒక ప్రకటనలో తెలిపింది.
 
మరోవంక,  భారత్‌లో త్వరలో మరో కొవిడ్‌ టీకా అందుబాటులోకి రానున్నది. అహ్మదాబాద్‌కు చెందిన ఫార్మా కంపెనీ జైడస్‌ క్యాడిలా తయారు చేసిన కొవిడ్‌ టీకా జైకోవ్‌-డీ కోసం అత్యవసర వినియోగానికి అనుమతి కోరుతూ డ్రగ్‌ కంట్రోలర్‌ జనరల్‌ ఆఫ్‌ ఇండియా (డీసీజీఐ)కి గురువారం దరఖాస్తు చేసింది. అనుమతి లభిస్తే ఏటా 120 మిలియన్‌ మోతాదుల డోసులను ఉత్పత్తి చేయాలని కంపెనీ యోచిస్తోంది.
 
 ప్రస్తుతం భారత్‌లో సీరం ఇన్‌స్టిట్యూట్‌ కొవిషీల్డ్‌, భారత్‌ బయోటెక్‌ కంపెనీ కొవాగ్జిన్‌, రష్యాకు చెందిన స్పుత్నిక్‌-వీ టీకాలకు డీసీజీఐ అనుమతి ఇవ్వగా.. వ్యాక్సినేషన్‌లో వినియోగిస్తున్నారు. మోడెర్నా టీకా దిగుమతి కోసం సైతం ఇటీవల డీసీజీఐ అనుమతి ఇవ్వగా.. ప్రస్తుతం జైడస్‌ క్యాడిలా వ్యాక్సిన్‌కు అనుమతి లభిస్తే వస్తే ఐదో టీకాగా నిలువనుంది.

కంపెనీ 12-18 సంవత్సరాల వయసు పిల్లలతో సహా దేశవ్యాప్తంగా 50కిపైగా కేంద్రాల్లో 28వేల మంది వలంటీర్లపై ట్రయల్స్‌ నిర్వహించింది. చివరి దశ ట్రయల్స్‌లో జైకోవ్‌-డీ సామర్థ్యాన్ని చూపిందని కంపెనీ పేర్కొంది. కరోనా కొత్త వేరియంట్లు, డెల్టా వేరియంట్‌కు వ్యతిరేకంగా టీకా పని సమర్థవంతంగా పని చేస్తుందని పేర్కొంది. 

జైడస్‌ క్యాడిలా టీకా ప్లాస్మిడ్‌ డీఎన్‌ఏ ఆధారిత వ్యాక్సిన్‌. దేశంలో 12-18 సంవత్సరాల వయస్సులో కౌమార బాలలపై కొవిడ్‌ వ్యాక్సిన్‌ ట్రయల్స్‌ నిర్వహించడం ఇదే మొదటిసారి. ప్లాస్మిడ్ డీఎన్‌ఏ ప్లాట్‌ఫామ్‌ ప్లగ్ అండ్ ప్లే టెక్నాలజీ కరోనా వైరస్‌లోని ఉత్పరివర్తనాలను ఇది సులభంగా ఎదుర్కోవటానికి అనుకూలంగా ఉంటుందని కంపెనీ తెలిపింది.