జమ్మూ సరిహద్దుల్లో మళ్లీ డ్రోన్లు…బీఎస్ఎఫ్ జవాన్ల కాల్పులు

జమ్మూ నగరంలో తరచూ పాక్ డ్రోన్లు ప్రత్యక్షమవుతూనే ఉన్నాయి. జమ్మూ నగరంలోని అర్నియా అంతర్జాతీయ సరిహద్దు వద్ద శుక్రవారం తెల్లవారుజామరున 4.25 గంటలకు డ్రోన్ కనిపించింది. ఈ డ్రోన్ సరిహద్దుల్లోని ఫెన్సింగ్ కు పాకిస్థాన్ వైపు కనిపించింది. పాకిస్థాన్‌ వైపు నుంచి వచ్చిన చిన్నపాటి హెలికాప్టర్‌ (డ్రోన్‌) సరిహద్దులు దాటడానికి ప్రయత్నించింది. గుర్తించిన బీఎస్‌ఎఫ్ సైనికులు దానిపై కాల్పులు జరిపారు.

వెంటనే అది అటు నుంచి వెనక్కి మళ్లిందని బీఎస్‌ఎఫ్‌ అధికారులు వెల్లడించారు. డ్రోన్‌ ద్వారా రెక్కీ నిర్వహిస్తున్నట్లు అధికారులు గుర్తించారు. పాకిస్థాన్ నుంచి వచ్చిన ఈ డ్రోన్ సరిహద్దుల్లోని జుమ్మత్ పోస్టు ఎగురుతూ కనిపించింది. పాకిస్థాన్ భూభాగం వైపు ఫెన్సింగుకు అవతల డ్రోన్ ప్రత్యక్షమవడంతో బీఎస్ఎఫ్ జవాన్లు ఆరు రౌండ్ల కాల్పులు జరిపారు. బీఎస్ఎఫ్ కాల్పులతో డ్రోన్ తిరిగి పాక్ వైపు వెళ్లింది. డ్రోన్ తో పరిసరాలను చిత్రీకరించారని బీఎస్ఎఫ్ భావిస్తోంది.

జమ్మూలో ఇలా డ్రోన్ ప్రత్యక్షం కావడం ఐదో సారి. గతంలో జమ్మూ వైమానిక కేంద్రాల సమీపంలో 7 డ్రోన్లు లభించాయి.ఆదివారం రెండు డ్రోన్లు కనిపించాయి. ఒకరోజు తర్వాత కాలుచెక్ మిలటరీ స్టేషన్ వద్ద మరో రెండు డ్రోన్లు లభించాయి. కుంజావనీ, సుంజావన్, కాలుచెక్, మీరన్ సాహిబ్ ప్రాంతాల్లో డ్రోన్లు ప్రత్యక్షమయ్యాయి.దీంతో వైమానిక కేంద్రాల వద్ద యాంటీ డ్రోన్ సిస్టమ్ ను ఏర్పాటు చేశారు. శుక్రవారం పాక్ సరిహద్దుల్లో మరో డ్రోన్ ప్రత్యక్షం కావడంతో బీఎస్ఎఫ్ బలగాలను అప్రమత్తం చేశారు.

మరోవంక, మ్మూకశ్మీరులోని పుల్వామా జిల్లాలో శుక్రవారం ఉదయం ఉగ్రవాదులకు, భద్రతా బలగాలకు మధ్య ఎదురుకాల్పులు ప్రారంభమయ్యాయి.పుల్వామా జిల్లాలోని రాజ్ పొర వద్ద హంజన్ గ్రామం వద్ద ఉగ్రవాదులున్నారనే సమాచారం మేర శుక్రవారం ఉదయం జమ్మూకశ్మీర్ పోలీసులు, సీఆర్ఎఫ్ జవాన్లు కలిసి గాలింపు చేపట్టారు.

ఓ ఇంట్లో దాక్కున్న ఉగ్రవాదులు జవాన్లపై కాల్పులు జరిపారు. దీంతో భద్రతాబలగాలు ఎదురుకాల్పులు ప్రారంభించారు.ఓ ఇంట్లో ముగ్గురు లేదా నలుగురు ఉగ్రవాదులున్నారని పోలీసులు భావిస్తున్నారు. అదనపు సాయుధ బలగాలను రప్పించి ఉగ్రవాదుల కోసం గాలింపును మమ్మరం చేశారు.  గత 6 నెలల కాలంలో భద్రతా బలగాలు 61 మంది ఉగ్రవాదులను కాల్చిచంపారు. పుల్వామాలో గురువారం రాత్రి జరిగిన ఎన్ కౌంటరులో ఓ ఆర్మీ జవాన్ తీవ్ర గాయాలకు గురై మరణించారు. గాలింపు జరుపుతున్న జవాన్లపై ఉగ్రవాదులు జరిపిన కాల్పుల్లో ఒక జవాన్ మరణించారు