అనర్హత పిటిషన్లపై చట్టంపై అధికారం పార్లమెంట్ దే 

రాజ్యాంగంలోని పదవ అధికరణ కింద సభ్యుల అనర్హత పిటిషన్లను స్పీకర్ లేదా ఎగువ సభ చైర్మన్ నిర్ణీత కాల వ్యవధిలో పరిష్కరించడానికి సంబంధించి చట్టాన్ని చేసే అధికారం పార్లమెంటుకు మాత్రమే ఉందని సుప్రీంకోర్టు మరోసారి స్పష్టం చేసింది. ‘మేం ఎలా చట్టం రూపొందిస్తాం? అది పార్లమెంటుకు సంబంధించిన విష యం’ అని ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ఎన్ వి రమణ, న్యాయమూర్తులు ఎఎస్ బోపన్న, హృషీకేశ్ రాయ్‌లతో కూడిన ధర్మాసనం పేర్కొంది.

అనర్హత పిటిషన్లను స్పీకర్లు నిర్ణీత సమయంలోగా పరిష్కరించడానికి మార్గదర్శకాలను రూపొందించాలని కేంద్రాన్ని ఆదేశించాలని కోరుతూ పశ్చిమ బెంగాల్ పిసిసి సభ్యుడు రణజిత్ ముఖర్జీ దాఖలు చేసిన పిటిషన్ విచారణ సందర్భంగా బెంచ్ ఈ వ్యాఖ్యలు చేసింది.

స్పీకర్లు అనర్హత పిటిషన్లపై రాజ్యాంగంలోని పదో షెడ్యూల్ కింద సకాలంలో నిర్ణయాలు తీసుకోనందున దీనికి సంబంధించి నిర్ణీత గడువును నిర్ణయించాలని తాము కోరుతున్నామని రాయ్ తన పిటిషన్‌లో పేర్కొన్నారు. దీనిపై చీఫ్ జస్టిస్ ఎన్‌వి రమణ స్పందిస్తూ కర్నాటక ఎంఎల్‌ఎలకు సంబంధించిన కేసులో దీనిపై తాను ఇప్పటికే తన అభిప్రాయాన్ని వ్యక్తం చేశానని, ఆ కేసులో కూడా సీనియర్ అడ్వకేట్ కపిల్ సిబల్ ఈ విషయాన్ని లేవనెత్తి ఇదే తరహాలో తన వాదనను వినిపించారని పేర్కొన్నారు. 

అయితే, ఈ విషయాన్ని తాము పార్లమెంటుకు వదిలిపెట్టామని ఆయన స్పష్టం చేశారు. ‘మీరు ఆ తీర్పును చదివారా?’ అని పిటిషనర్ తరఫు న్యాయవాది అభిషేక్ జెబ్‌రాజ్‌ను బెంచ్ ప్రశ్నించగా లేదని ఆయన చెప్పారు. అయితే ముందు ఆ తీర్పును చదివాక తర్వాత రావాలని, బెంచ్ అంటూ రెండు వారాల తర్వాత తాము ఈ విషయాన్ని వింటామని పేర్కొంది. 

కర్ణాటకలో ఎమ్మెల్యేలపై అనర్హత వేటుకు సంబంధించి సుప్రీంకోర్టు 2019 నవంబరు 13న కీలక తీర్పు ఇచ్చింది. కర్ణాటకలో 17 మంది ఎమ్మెల్యేలను 15వ శాసనసభ పదవీకాలం ముగిసేదాకా అనర్హులుగా ప్రకటిస్తూ అప్పటి స్పీకర్‌ ఆర్‌ రమేశ్‌కుమార్‌ తీసుకొన్న నిర్ణయానికి సంబంధించిన వ్యాజ్యాన్ని ధర్మాసనం ప్రస్తావించింది.

ఎమ్మెల్యేని లేదా ఎమ్మెల్సీని ఎంతకాలం అనర్హులుగా ప్రకటించవచ్చో, ఎన్నికలలో వారు పోటీ చేయకుండా ఎంతకాలం అనర్హులను చేయవచ్చో అన్న విషయాలలో స్పీకర్లకు అధికారం లేదని ఈ కేసులో సుప్రీంకోర్టు స్పష్టం చేసింది. అయితే ఎమ్మెల్యేలపై అనర్హత వేటును సుప్రీంకోర్టు సమర్థించింది.

ప్రజాస్వామిక విలువలు, రాజ్యాంగ నిబంధనల మధ్య సమతుల్యత పాటించడంలో స్పీకర్‌ పాత్ర చాలా కీలకంగా మారిందని, అయితే నిష్పాక్షికంగా రాజ్యాంగవిహిత కర్తవ్యాన్ని నిర్వర్తించాల్సిన స్పీకర్లు దానికి విరుద్ధంగా పనిచేస్తున్న ధోరణి పెరుగుతోందని సుప్రీంకోర్టు ఆనాటి కేసులో వ్యాఖ్యానించింది. స్పీకర్‌ తనపై ఉన్న రాజ్యాంగపరమైన బాధ్యతను కచ్చితంగా నెరవేర్చాలని, రాజకీయ పార్టీలతో సంబంధాలు, సభ్యత్వాలను పక్కన పెట్టిన నిర్ణయాలు తీసుకోవాలని కూడా సుప్రీంకోర్టు స్పష్టం చేసింది.

చట్ట సభలకు ఎన్నికైన ప్రజాప్రతినిధులను రాజకీయ పార్టీలు కొనుగోలు చేస్తూ అవినీతికి పాల్పడడం వల్ల సుస్థిర ప్రభుత్వాలు లేకుండా పోతున్నాయని ధర్మాసనం వ్యాఖ్యానించింది. ఈ పరిస్థితులలో అప్రజాస్వామిక పద్ధతులను నిరోధించేందుకు పదో షెడ్యూలులోని కొన్ని అంశాలను పటిష్ఠం చేయడంపై పార్లమెంటు దృష్టి పెట్టాలని కర్ణాటక కేసులో ధర్మాసనం సూచించింది.