ఉచిత సేవలకు టిటిడి స్వస్తి… ప్రైవేట్ ఏజెన్సీ లకు అప్పగింత!

తిరుమలలో భక్తులకు అందించే ఉచిత సేవలను సహితం ఇప్పుడు టిటిడి యాజమాన్యం ప్రైవేట్ ఏజెన్సీ లకు అప్పగించింది. కరోనాతో ఆదాయ మార్గాలు మూసుకుపోయిన తరుణంలో ఏజెన్సీకి అప్పగించి నిధులు కేటాయించడం ద్వారా స్వామి ఆదాయంపై ప్రభావం పడుతుందని విమర్శలు చెలరేగుతున్నాయి. 

కౌంటర్లను ఏజెన్సీలకు అప్పగించడం ద్వారా టీటీడీ ఖజానాపై అదనపు భారంతో పాటు ఆ లోటు భర్తీ కోసం సర్వీస్‌ చార్జ్‌ పేరుతో భక్తులపై భారం వేస్తారనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. టీటీడీలో కౌంటర్ల నిర్వహణ బాధ్యతలను ప్రైవేట్‌ ఏజెన్సీకి అప్పగించారు. గతంలో వీటిని బ్యాంకులు, త్రిలోక్‌ అనే సంస్థ ఉచితంగా నిర్వహించేవి.

తిరుమలలోని లడ్డూ కౌంటర్లతో పాటు కల్యాణకట్టలో తలనీలాలు సమర్పించే భక్తులకు టోకెన్లు ఇచ్చేవి, వైకుంఠం క్యూకాంప్లెక్సులో దర్శన టికెట్ల స్కానింగ్‌, తిరుపతిలోని ఎస్‌ఎ్‌సడీ కౌంటర్లు, అలిపిరి టోల్‌గేట్‌ వద్దనున్న కౌంటర్లను కేవీఎం ఇన్‌ఫో (బెంగళూరు) అనే మెన్‌పవర్‌ ఏజెన్సీకి అప్పగిస్తూ టీటీడీ నిర్ణయం తీసుకుంది. 

తిరుమలలోని లడ్డూ కౌంటర్‌లో అదనపు ఈవో ధర్మారెడ్డి గురువారం ప్రత్యేక పూజలు నిర్వహించి ఏజెన్సీ సిబ్బందితో సేవలను ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ భక్తులకు విశేష సేవలందిస్తున్న పలు కౌంటర్లను మరింత పారదర్శకంగా నిర్వహించేందుకు వృత్తి నిపుణత కలిగిన ఏజెన్సీలు అవసరమని తెలిపారు. అతితక్కువ ధరకు కేవీఎం ఇన్‌ఫో టెండరు వేసిందని చెప్పుకొచ్చారు. 

ఇకపై ఆ ఏజెన్సీతో టీటీడీలో భక్తులకు సేవలందించే కౌంటర్లు నిర్వహించనున్నట్లు తెలిపారు. తిరుపతి, తిరుమలలోని 164 కౌంటర్లను మూడు షిఫ్టులలో నడిపేందుకు 430 మంది సిబ్బంది అవసరమని పేర్కొన్నారు. ఈ సిబ్బందికి వారంపాటు శిక్షణ ఇచ్చామని చెప్పారు. 

కౌంటర్లలో ఎలాంటి అవకతవకలు జరగకుండా ఉండేందుకు రొటేషన్‌ పద్ధతిలో ప్రతి వారం సిబ్బందిని మార్చనున్నట్టు వివరించారు. కౌంటర్ల నిర్వహణ కోసం బ్యాంకులు స్వచ్ఛందంగా ముందుకొస్తే అప్పగించేందుకు సిద్ధంగా ఉన్నామని, ఆ కౌంటర్ల ముందు బ్యాంకుల బోర్డులు డిస్‌ప్లే చేసుకోవచ్చని. అయితే  సిబ్బంది మాత్రం ఏజెన్సీ నుంచే ఉంటారని ధర్మారెడ్డి స్పష్టంచేశారు. 

గతంలో టీటీడీలో ప్రధానంగా లడ్డూకౌంటర్ల నిర్వహణకు జాతీయ బ్యాంకులు ఉచిత సేవలు అందించేవి. శ్రీవారికి వచ్చే ఆదాయాలను టీటీడీ వివిధ జాతీయ బ్యాంకుల్లో డిపాజిట్‌ చేస్తున్న క్రమంలో కొన్నేళ్లుగా లడ్డూకౌంటర్‌లో ఔట్‌సోర్సింగ్‌ సిబ్బందిని నియమించి వారికి బ్యాంకులే జీతాలు ఇస్తున్నాయి. 

వీటితో పాటు వివిధ కౌంటర్లలో త్రిలోక్‌ అనే సంస్థ కూడా పలువురు ఉద్యోగులను నియమించుకుని ఉచిత సర్వీసునే (టోకెన్‌ ప్రింటింగ్‌ ధర మినహా) అందిస్తోంది. వీటిన్నిటిని పక్కన పెట్టి కౌంటర్లను ప్రైవేట్‌ ఏజెన్సీకి అప్పగించడంపై పలు అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి. కాగా, టీటీడీ స్పెసిఫైడ్‌ అథారిటీ చైర్మన్‌గా డాక్టర్‌ కేఎస్‌ జవహర్‌రెడ్డి,  టీటీడీ స్పెసిఫైడ్‌ అథారిటీ కన్వీనర్‌గా ఎవి.ధర్మారెడ్డి ప్రమాణస్వీకారం చేసిన రోజుననే ఈ మార్పులు చోటుచేసుకోవడం గమనార్హం.